Srikanth Bolla Biopic: తెలుగు అంధ పారిశ్రామికవేత్త శ్రీకాంత్‌ బొల్లా బయోపిక్‌... హీరో ఎవరంటే?

ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా బయోపిక్‌ తెరపై ఆవిష్కృతం కానుంది.  బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌ ‘శ్రీకాంత్ బొల్లా’గా కనిపించనున్నారు‌. గురువారం ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌.

Updated : 06 Jan 2022 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం చిత్రసీమలో బయోపిక్స్‌ హవా నడుస్తోంది. నిజజీవిత కథలను ప్రేక్షకులకు అందించేందుకు ముందుకొస్తున్నారు నేటితరం దర్శకులు. ఇప్పటి వరకూ సినీ తారలు, క్రీడాకారుల జీవితాలను తెరపై చూశాం. ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా బయోపిక్‌ తెరపై ఆవిష్కృతం కానుంది.  బాలీవుడ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌ ‘శ్రీకాంత్ బొల్లా’గా కనిపించనున్నారు‌. గురువారం ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా శ్రీకాంత్‌ అన్నింటిని దీటుగా ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎదిగారు. పుట్టిన దగ్గర నుంచి ఎన్నో సవాళ్లు ఎదురైనా.. అన్నింటినీ జయించి తన కలలను నిజం చేసుకున్నారు. ఆయన జీవిత ప్రయాణం అందరికీ ఆదర్శనీయం. ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాం. హీరో రాజ్‌కుమార్ ఈ పాత్రకు న్యాయం చేయగలడనే నమ్మకం ఉంది’’ అన్నారు.  దర్శకురాలు తుషార్‌ హిద్రానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా టీ సీరిస్‌ భూషణ్‌ కుమార్‌, ఛాక్‌ అండ్‌ ఛీస్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ ఏడాది జులై నుంచి షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

శ్రీకాంత్‌ బొల్లా నేపథ్యం..

జులై 7, 1992న ఆంధ్రప్రదేశ్‌ మచిలీపట్నంలో శ్రీకాంత్‌ జన్మించారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. పదకొండో తరగతిలో 98శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. ఇంజినీరింగ్‌ చదవాలనుకున్నప్పటికీ.. అంధుడని చెప్పి అనుమతి ఇచ్చేందుకు ఐఐటీ నిరాకరించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. అన్నింటినీ అధిగమించారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బ్రెయిన్‌ కాగ్నిటివ్‌ సైన్స్‌లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్‌ రికార్డు సృష్టించారు. తర్వాత ప్రపంచస్థాయి సంస్థల ఉద్యోగావకాశాల్ని కాదని.. 2012లో హైదరాబాద్‌ కేంద్రంగా బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. దీని ద్వారా 2500 మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు. మరో మూడు వేల మంది దివ్యాంగులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. పర్యావరణమే మనిషి బతుకని నమ్మే శ్రీకాంత్‌ తన పరిశ్రమల్ని సౌర విద్యుత్తుతో నడిపిస్తూ, జీరో వేస్ట్‌ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. 2005లో లీడ్‌ ఇండియా కార్యక్రమం ద్వారా లక్షల మందిని ఉద్దేశించి స్ఫూర్తి ప్రసంగాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని