RajTarun Standup Rahul Review: రివ్యూ: స్టాండ‌ప్ రాహుల్‌

రాజ్‌ తరుణ్‌, వర్ష బొల్లమ్మ నటించిన ‘స్టాండప్‌ రాహుల్‌’ ఎలా ఉందంటే

Published : 18 Mar 2022 13:44 IST

చిత్రం: స్టాండ‌ప్ రాహుల్‌; న‌టీన‌టులు: రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ, తదితరులు; సంగీతం: స్వీకర్ అగస్తి; సినిమాటోగ్రఫర్: శ్రీరాజ్ రవీంద్రన్; ఎడిటర్: రవితేజ గిరిజెల్లా; కొరియోగ్రఫర్: ఈశ్వర్ పెంటి; క‌ళ: ఉదయ్; సమర్ఫణ: సిద్ధు ముద్ద; నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి; ద‌ర్శక‌త్వం: శాంటో మోహన వీరంకి; ప్రొడక్షన్ కంపెనీ: డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్, హైఫైవ్ పిక్చర్స్; విడుద‌ల తేదీ‌: 18-3-2022

కొత్తత‌రం క‌థ‌ల‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. ఆరంభంలో వ‌రుస విజ‌యాల్ని అందుకున్నప్పటికీ.. ఆ త‌ర్వాతే ఆయ‌న క‌థ‌ల‌పై ప‌ట్టు కోల్పోయిన‌ట్టైంది. భిన్నమైన క‌థ‌ల‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ, బ‌ల‌మైన విజ‌యం మాత్రం ద‌క్కడం లేదు. ఈ ద‌శ‌లోనే ఆయ‌న చేసిన మ‌రో కొత్తత‌రం చిత్రం ‘స్టాండ‌ప్ రాహుల్‌’. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆస‌క్తిని రేకెత్తించాయి. మ‌రి ఈ సినిమాతో ఆయ‌న‌కి విజ‌యం ద‌క్కిన‌ట్టేనా?ఇంత‌కీ సినిమా ఎలా ఉంది?  తెలుసుకోవాలంటే ముందు కథేంటో చూద్దాం..

క‌థేంటంటే: విశాఖ కుర్రాడు రాహుల్ దండ‌పాణి (రాజ్ త‌రుణ్‌)కి స్టాండ‌ప్ కామెడీ అంటే ప్యాష‌న్‌. త‌ర‌చూ ఉద్యోగాలు మానేస్తూ ఇంట్లో వాళ్లతో మాట‌లు ప‌డుతుంటాడు. ఇంత‌లో హైద‌రాబాద్‌లో కొత్త ఉద్యోగం వ‌స్తుంది. ఈసారి మాత్రం ఉద్యోగం మానేయ‌న‌ని త‌న త‌ల్లి ఇందు (ఇంద్రజ‌)కి మాటిస్తాడు. త‌నకిష్టమైన స్టాండ‌ప్ కామెడీతోపాటు ఉద్యోగాన్ని కొన‌సాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తనతోపాటు పనిచేసే శ్రేయారావు (వ‌ర్ష బొల్ల‌మ్మ‌)కీ, రాహుల్‌కీ మ‌ధ్య ప్రేమ మొద‌ల‌వుతుంది. కానీ, త‌న‌కి పెళ్లిపై న‌మ్మకం లేదంటాడు రాహుల్‌. అందుకు కార‌ణం త‌న త‌ల్లిదండ్రులు ఇందు, ప్రకాశ్ (ముర‌ళీశ‌ర్మ‌) జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లే. ఇంత‌కీ రాహుల్ త‌ల్లిదండ్రుల క‌థేమిటి? మ‌రి రాహుల్‌పై ప్రేమ‌తో శ్రేయ ఏం చేసింది? అనేది మిగతా కథ‌.

ఎలా ఉందంటే: ప్రేమ కోసం నిల‌బ‌డాల‌ని చెప్పే ఇలాంటి కథలను ఇప్పటికే ఎన్నో సార్లు చూశాం. స‌మ‌కాలీన ప‌రిస్థితుల‌కి తగిన నేపథ్యాన్ని జోడించి న‌డిపించడమే ఈ సినిమాలోని కొత్తద‌నం. కథానేప‌థ్యం, పాత్రల్ని సృష్టించడం.. ఇలా పలు అంశాల్లో ద‌ర్శకుడి ఆలోచ‌న‌లు ఆక‌ట్టుకుంటాయి. కానీ ప్రేక్షకుల‌పై ప్రభావం చూపించే స్థాయిలో పాత్రల్ని మ‌ల‌చ‌క‌పోవ‌డం, వాటి మ‌ధ్య సంఘ‌ర్షణ‌ని రేకెత్తించ‌క‌పోవ‌డం, భావోద్వేగాల్లో లోతు లేక‌పోవ‌డం సినిమాని సాధార‌ణంగా మార్చేసింది. స్టాండ‌ప్ కామెడీ నేప‌థ్యాన్ని ఎంచుకున్నప్పటికీ త‌గిన మోతాదులో హాస్యం పండ‌క‌పోవ‌డం వెలితిగా అనిపించింది‌. ఉద్యోగం నిమిత్తం హీరో హైద‌రాబాద్‌కి చేరుకున్నాకనే అస‌లు క‌థ‌లోకి వెళుతుంది సినిమా. రాహుల్ జీవితం, అత‌ని కుటుంబ నేప‌థ్యం ప‌రిచ‌యమ‌య్యాక ఈ కథాగ‌మ‌నం ఏమిటో అర్థమ‌వుతుంది. చాలా స‌న్నివేశాలు ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టుగానే సాగిపోతాయి. విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలు కాస్త సంఘ‌ర్షణ‌ని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలోని కొన్ని చోట్ల స్టాండ‌ప్ కామెడీ హాస్యం పండింది. ప్రేమ, జీవితం గురించి హీరో రియలైజ్‌ అయ్యే స‌న్నివేశాలు మెప్పిస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు సాధార‌ణ‌ంగానే ఉన్నాయి. దర్శకుడు శాంటో మోహన వీరంకి కథనంతోపాటు నటీనటుల మధ్య బలమైన సంఘర్షణలు, భావోద్వేగాలు ఉండేలా చూసుకుని ఉంటే సినిమా మరింత బాగుండేది.

ఎవ‌రెలా చేశారంటే: కొత్తత‌రం సినిమాలు చేసే రాజ్‌త‌రుణ్‌కి త‌గిన క‌థే ఇది. ఆయ‌న రాహుల్ పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్ ప‌రంగా కూడా ఆయ‌న బాగా క‌నిపించాడు. పాత్రకి త‌గ్గట్టుగా భావోద్వేగాలూ పండించాడు. వ‌ర్ష బొల్లమ్మ అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. కథానాయిక పాత్రకు ఆమె అన్నివిధాలుగా న్యాయం చేసింది. ఇంద్రజ‌, ముర‌ళీశ‌ర్మ పాత్రలు బాగున్నాయి. వెన్నెల కిశోర్ చేసిన కామెడీ పెద్దగా ఆకట్టుకోలేదు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. శ్రీరాజ్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. పలు సన్నివేశాల్లో కెమెరాతో ఆయన మ్యాజిక్‌ క్రియేట్‌ చేశారు. స్వీక‌ర్ అగ‌స్త్య సంగీతం సినిమాకి మ‌రో హైలైట్‌. నంద‌కుమార్ సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శకుడు శాంటోకి ఇదే తొలి చిత్రమైనా కొన్ని స‌న్నివేశాల‌పై త‌న‌దైన ముద్ర వేశారు. కానీ, ప్రధాన పాత్రల నుంచి భావోద్వేగాల్ని పండించ‌డంలో  ప‌ట్టు కోల్పోయారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బ‌లాలు

+ రాజ్‌త‌రుణ్ - వ‌ర్ష బొల్లమ్మ 
కెమెరా పనితనం
సంగీతం

బ‌ల‌హీన‌త‌లు
-
బలమైన భావోద్వేగాలు లేకపోవడం
తెలిసిన కథ

చివ‌రిగా: స్టాండప్‌ రాహుల్‌... కొన్ని చోట్లే నిలుచున్నాడు..!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని