Rakshit Shetty: తెలుగు ప్రేక్షకుల ఆదరణకు రక్షిత్‌ శెట్టి ఫిదా.. ఏమన్నారంటే?

తాను హీరోగా నటించిన ‘సప్తసాగరాలు దాటి’ సినిమాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమపై కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా వారికి థ్యాంక్స్‌ చెప్పారు.

Published : 24 Sep 2023 20:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటెంట్‌ బాగుంటే చాలు ఇతర పరిశ్రమలకు చెందిన సినిమాలనూ ఆదరించడంలో ముందుంటారు తెలుగు ప్రేక్షకులు. ఎన్నో సందర్భాల్లో ఇది రుజువైంది. అందుకే వేరే ఇండస్ట్రీల్లో హిట్‌ అయిన చిత్రాల్ని తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేసేందుకు చాలా మంది దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. అలా రిలీజ్‌ అయిన తాజా చిత్రమే ‘సప్తసాగరాలు దాటి: సైడ్‌ ఏ’ (Sapta Sagaralu Dhaati Side A). రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty), రుక్మిణీ వసంత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్‌ ఏ’ (Sapta Saagaradaache Ello Side A)కి అది అనువాదం. కన్నడనాట మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ నెల 22న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమాకి వస్తున్న స్పందనపై రక్షిత్‌ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ పెట్టారు.

అతడి సంగతి నాకు తెలియదు.. నేనైతే రష్మికతో మాట్లాడుతున్నా: రక్షిత్‌శెట్టి

‘‘తెలుగు ప్రేక్షకులు మా పని తీరుని మెచ్చి మాపై చూపిస్తున్న ప్రేమకు సంతోషంగా ఉంది. మీ మద్దతుతో ‘సప్తసాగరాలు దాటి’ సినిమా షోల సంఖ్యను పెంచనున్నాం. ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లి’ సినిమాలతో రక్షిత్‌ ఇప్పటికే తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల గురించి చిత్ర దర్శకుడు హేమంత్‌ ఎం. రావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ప్రతి శుక్రవారం తెలుగు ఆడియన్స్‌ థియేటర్లకు వెళ్తుంటారు. దాన్నొక వేడుకగా భావిస్తారు. ఒక వేళ సినిమాకి ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా అదెందుకు బాగోలేదో చూసేందుకు వారు వెళ్తుంటారని విన్నా’’ అని అన్నారు.

క‌థేంటంటే: మ‌ను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వ‌సంత్‌) ఓ ప్రేమ‌జంట‌. శంక‌ర్ గౌడ (అవినాష్‌) అనే పారిశ్రామిక వేత్త ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు మ‌ను. ఒక‌వైపు చ‌దువుకుంటూనే మ‌రోవైపు గాయ‌ని కావాల‌ని ఆ ప్ర‌య‌త్నాల్లో ఉంటుంది ప్రియ‌. మ‌ధ్య త‌ర‌గ‌తికి చెందిన ఈ జంట భ‌విష్య‌త్తు గురించి అంద‌మైన క‌ల‌లు కంటూ... పెళ్లి చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉంటుంది. తొంద‌ర‌గా జీవితంలో స్థిర‌ప‌డి పోవ‌చ్చ‌నే ఆశ‌తో చేయ‌ని త‌ప్పుని త‌నపైన వేసుకుంటాడు మ‌ను. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది?క‌ల‌లు క‌న్నంత అందంగా ఈ ప్రేమజంట భ‌విష్య‌త్తుని తీర్చిదిద్దుకుందా? అన్నది మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని