నాకు వేరే ఎవరితోనూ పోటీ లేదు: రకుల్‌

వరుస బాలీవుడ్‌ షూటింగ్స్‌ వల్ల తాను ఇంకా ‘చెక్‌’ చిత్రాన్ని వీక్షించలేదని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. నితిన్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి రూపొందించిన చిత్రం ‘చెక్‌’....

Published : 01 Mar 2021 13:18 IST

ఇంకా ‘చెక్‌’ చూడలేదు: నటి

హైదరాబాద్‌: వరుస బాలీవుడ్‌ షూటింగ్స్‌ వల్ల తాను ఇంకా ‘చెక్‌’ చిత్రాన్ని వీక్షించలేదని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. నితిన్‌ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి రూపొందించిన చిత్రం ‘చెక్‌’. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ లాయర్‌ మానసగా కీలకపాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. ఈ నేపథ్యంలో రకుల్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘చెక్‌’ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు బయటపెట్టారు.

‘‘చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించిన ఓ రెండు చిత్రాలను గతంలో వీక్షించాను. ఆయన సినిమాలు నాకు ఎంతో నచ్చాయి. ‘చెక్‌’ కోసం నన్ను సంప్రదించినప్పుడు.. మానస పాత్ర నాకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాను. ఓ ఖైదీ కోసం పోరాటం చేసే క్రమంలో మానస కూడా వ్యక్తిగతంగా ఎంతో మారుతుందని చూపించిన విధానం నాకు నచ్చింది’’

‘‘ప్రస్తుతానికి నేను ముంబయిలో ఉన్నాను. బాలీవుడ్‌ సినిమా షూట్స్‌లో బిజీగా ఉండడంతో ఇంకా ‘చెక్‌’ చిత్రాన్ని వీక్షించలేదు. కానీ, తెలిసిన వాళ్లు ఫోన్‌ చేసి సినిమా బాగుందని చెప్పారు. ‘చెక్‌’ కథ చాలా విభిన్నమైనది. నటి అంటే తప్పకుండా అన్నిరకాల పాత్రలు పోషించాలి. కమర్షియల్‌ లేదా నాన్‌ కమర్షియల్‌.. కథ ఎలాంటిదైనా సరే నటనలో వైవిధ్యం చూపించాలి. నేను ఎప్పుడూ బయటవాళ్లతో పోటీ గురించి ఆలోచించను. ఎందుకంటే, నాతో నేనే పోటీ పడతాను. ప్రతిరోజూ సెట్‌లోకి అడుగుపెట్టగానే ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నాను.? కొత్త విషయాలు ఏం తెలుసుకున్నాను? అనే అనుకుంటాను’’

‘‘క్రిష్‌ డైరెక్షన్‌లో నేను కథానాయికగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడు. ఈ సినిమాలో మా ఇద్దరి పాత్రలు విభిన్నంగా ఉంటాయి. అందులో నేను మేకప్‌ లేకుండా.. డీ గ్లామర్‌ లుక్‌లో కనిపిస్తాను’’ అని రకుల్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని