Rakul Preet Singh: అదృష్టం కొద్దీ అలా జరగలేదు.. నటినయ్యా: రకుల్‌ప్రీత్‌ సింగ్‌

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటి కాకపోయుంటే? ఏమయ్యేవారో మీకు తెలుసా? లేదు అంటే.. ఇది చదివేయండి..

Published : 01 Jun 2023 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను అనుకున్న సమయానికి సినిమా అవకాశాలు రాకపోతే ‘ప్లాన్‌ బీ’గా ఎం.బి.ఎ (ఫ్యాషన్‌) చేద్దామని నిర్ణయించుకున్నట్టు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) తెలిపారు. అయితే, అదృష్టం కొద్దీ అలా జరగలేదని, ప్రణాళిక ప్రకారమే నటిని అయ్యానని చెప్పారు. తాజాగా ఓ ‘పాడ్‌కాస్ట్‌’ వేదికగా అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ముందుగా మోడల్‌గా మారి, ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో పాల్గొంటే గుర్తింపు లభిస్తుందని, దాని వల్ల నటిగా అవకాశాలు వస్తాయని సినీ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఆమె సూచించారు. తాను మ్యాథ్స్‌ గ్రాడ్యుయేట్‌ అని తెలిపారు. సుమారు 18 ఏళ్ల వయసులోనే సినిమాలో నటించే అవకాశం వచ్చిందన్నారు.

తనది ఆర్మీ కుటుంబ నేపథ్యంకావడంతో చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణ అలవడిందని, తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో అది ఎంతగానో సహకరించిందని పేర్కొన్నారు. కన్నడ చిత్రం ‘గిల్లీ’తో తెరంగేట్రం చేసిన రకుల్‌ప్రీత్‌ ‘కెరటం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో మంచి విజయాన్ని అందుకున్నారు. తర్వాత, ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న ఆమె బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. గతేడాది 5 హిందీ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె ఈ ఏడాది మరో సినిమా చేస్తున్నారు. తమిళ్‌లో రెండు చిత్రాల్లో (ఇండియన్‌ 2, అయలాన్‌) నటిస్తున్నారు. ఆమె కీలక పాత్ర పోషించిన హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘బూ’ (boo) ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా కొన్ని రోజుల క్రితం నేరుగా ఓటీటీ (ott) ‘జియో సినిమా’ (jio cinema)లో రిలీజ్‌ అయింది. విశ్వక్‌సేన్‌, నివేదా పేతురాజ్‌, మేఘా ఆకాశ్‌ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని