నీ పని అయిపోయిందన్నారు: రకుల్‌

కథ నచ్చితే చాలు.. ఆకారంలో.. ఆహార్యంలో కొత్తదనం చూపించడానికి ఎంతయినా కష్ట పడుతుంటారు కథానాయకులు. ఇటీవల కాలంలో నాయికలూ ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. కథకు న్యాయం చేయడం కోసం ముద్దబంతిలా బొద్దుగా మారడానికైనా..

Published : 18 Jan 2021 10:53 IST

హైదరాబాద్‌: కథ నచ్చితే చాలు.. కొత్తలుక్‌ కోసం ఎంతయినా కష్టపడుతుంటారు కథానాయకులు. ఇటీవల కాలంలో నాయికలూ ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. కథకు న్యాయం చేయడం కోసం ముద్దబంతిలా బొద్దుగా మారడానికైనా.. సన్నజాజిలా నాజుగ్గా కనిపించడానికైనా వెనకాడటం లేదు. నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌ చిత్రం ‘దే దే ప్యార్‌దే’ కోసం ఇలాంటి ప్రయోగమే చేసింది. ఆ సినిమాలో తన పాత్ర కోసం అతి తక్కువ సమయంలోనే దాదాపు 8 కిలోలు బరువు తగ్గి స్లిమ్‌గా దర్శనమిచ్చింది. ఆ లుక్‌పై అప్పట్లో బాగా ట్రోల్స్‌ ఎదుర్కోన్నట్లు రకుల్‌ తాజాగా వెల్లడించింది.

‘‘దే దే ప్యార్‌దే’ సినిమాలో నా పాత్ర బాగుంది. అజయ్‌ దేవగణ్‌, టబులాంటి అనుభవజ్ఞులతో కలిసి పని చేసే ఛాన్స్‌ వదులుకోకూడదన్న లక్ష్యంతో బాగా కష్టపడ్డా. రోజూ జిమ్‌లో 4గంటలు చెమటోడ్చుతూ.. 40రోజుల్లోనే 8కిలోలు తగ్గాను. అప్పుడు నా లుక్స్‌పై సామాజిక మాధ్యమాల్లో చాలా ట్రోల్స్‌ వచ్చాయి. చాలా మంది నా ఫొటోలు షేర్‌ చేస్తూ.. ‘ఏంటి ఇంత సన్నగా అయిపోయావ్‌?’, ‘ఇక నీ సినిమాలెవరూ చూడరు..’, ‘నీ పని అయిపోయింది’, ‘ఇక తెలుగులో అవకాశాలు రావు’ అని కామెంట్లు‌ చేశారు. నేను కళ్లు మూసుకొని మనసుకి ఒకటే చెప్పుకొన్నా.. ‘ఏదీ పట్టించుకోకు.. నీ పనే ఆ విమర్శలకు సమాధానం చెబుతుంది’ అని సముదాయించుకొన్నాను. అనుకున్నట్లుగానే ఆ చిత్రం నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది’’ అని చెప్పింది రకుల్‌. ఆమె ప్రస్తుతం తెలుగులో నితిన్‌తో ‘చెక్‌’, క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. బాలీవుడ్‌లో ‘మేడే’ సినిమాలో నటిస్తోంది.

ఇదీ చదవండి

నా పెళ్లికి అవే వేదికలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని