Game Changer Movie Update: ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈ ఏడాది విడుదలవుతుందా?

Game Changer: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించి దర్శకుడు శంకర్‌ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

Published : 08 Jul 2024 17:18 IST

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ (Ram Charan) కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). గత నాలుగేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ఎట్టకేలకు చివరి దశకు వచ్చింది. తాజాగా ఈ మూవీలో తన చిత్రీకరణ పూర్తయినట్లు రామ్‌చరణ్‌ ప్రకటించారు. ఇన్‌స్టా వేదికగా హెలికాప్టర్‌ వద్దకు వెళ్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘మార్పు కోసం ఆడే ఆట.. గేమ్‌ ఛేంజర్‌.. పూర్తయింది. థియేటర్స్‌లో మిమ్మల్ని కలుసుకుంటా’ అని పోస్ట్‌ చేశారు. దీంతో సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీ గురించి దర్శకుడు శంకర్‌ కూడా స్పందించారు. ‘భారతీయుడు2’ (Bharateeyudu2) ప్రమోషనల్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రామ్‌ చరణ్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తవగా, మిగిలిన పాత్రలకు సంబంధించిన షూటింగ్‌ మరో 15 రోజుల్లో (Game Changer Movie upadate) పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఎడిటింగ్‌ వెర్షన్‌ కూడా పూర్తి చేసి, విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. ఒకవైపు ‘భారతీయుడు2’ మరోవైపు ‘గేమ్‌ ఛేంజర్‌’కు సమాంతరంగా పనిచేయడం వల్ల ఎక్కడైనా రాజీపడ్డారా? అని విలేకరులు ప్రశ్నించగా, ‘ఏమీ తేడా ఉండదు. ఒకేసారి రెండు సినిమాలు చేసినా ఒక సినిమా కోసం ఎంత కష్టపడతానో రెండింటికీ అంతే కష్టపడ్డా. ఇంకాస్త ఎక్కువే శ్రమపడ్డాం. యూనిట్‌  అలాగే కష్టపడింది. షూటింగ్‌ ఎప్పుడు మొదలు పెట్టినా రెడీగా ఉండాలని సీన్లు, షాట్‌ డివిజన్‌, ప్రాపర్టీస్‌ వివరాలు, ఆర్టిస్ట్‌లు, కాస్ట్యూమ్స్‌, లొకేషన్స్‌ అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాం. దీని వల్ల రెండు సినిమాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా షూట్‌ చేశాం’ అని అన్నారు.

దర్శకుడు శంకర్‌ ‘భారతీయుడు2, 3’ చిత్రాలతో బిజీగా ఉండటంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ ఆలస్యమవుతూ వచ్చింది. దీనికి తోడు భారీ తారాగణం నటిస్తుండటంతో తేదీలను సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీని తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే, మరో 15 రోజులే చిత్రీకరణ ఉండటంతో ఈ ఏడాదే మూవీ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని