Chiranjeevi: చిరంజీవికి స్పెషల్‌ డే.. రామ్‌ చరణ్‌ కంగ్రాట్స్‌, థ్యాంక్స్‌.. విశేషమేంటంటే?

తన తండ్రి, ప్రముఖ హీరో చిరంజీవికి రామ్‌ చరణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. స్పెషల్‌ ఏంటంటే?

Updated : 22 Sep 2023 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన పుట్టినరోజు ఆగస్టు 22 చిరంజీవి (Chiranjeevi)కి ఎంత ప్రత్యేకమో సెప్టెంబరు 22 ఆయనకు అంతే ప్రత్యేకం. నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు ఆ రోజు పరిచయమవడమే అందుకు కారణం. చిరంజీవి వెండితెరపై కనిపించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ (Pranam Khareedu). 1978 సెప్టెంబరు 22న విడుదలైన ఈ సినిమా నేటితో 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి తనయుడు, హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan) సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. నటుడిగా 45 ఏళ్ల ప్రయాణం అసాధారణమని (45 Years of Mega Journey In Cinema) కొనియాడారు. ‘‘మీరు తెరపై నటనతో, తెర వెనుక వ్యక్తిత్వంతో ఎంతోమందికి స్ఫూర్తిన్నిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, అంకితభావంవంటివి నాలో పెంపొందించినందుకు థ్యాంక్స్‌ నాన్న’’ అని చరణ్‌ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ చూసిన పలువురు నెటిజన్లు, అభిమానులు.. తండ్రికి తగ్గ తనయుడు అంటూ చరణ్‌ను ప్రశంసిస్తున్నారు. చిరంజీవికి కంగ్రాట్స్‌ చెబుతున్నారు.

ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్‌

చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’ (Punadhirallu)కాగా అది 1979లో విడుదలైంది. దాంతో, కొణిదెల శివ శంకర వరప్రసాద్‌ని చిరంజీవిగా పరిచయం చేసిన సినిమాగా ‘ప్రాణం ఖరీదు’ నిలిచింది. దర్శకుడు కె.వాసు తెరకెక్కించిన ఈ సినిమాలో చిరంజీవి నరసింహ పాత్రలో నటించారు. రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్‌, కైకాల సత్యనారాయణ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అలా మొదలైన చిరంజీవి ప్రస్థానం నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ ప్రయాణంలో ఆయన సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా!

రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీలోనూ సినిమా అవకాశాలు అందుకునే విషయంలో జోరు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 155 సినిమాల్లో నటించిన ఆయన ఇటీవల రెండు సినిమాలు ఖరారు చేశారు. వాటిలో ఓ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట తెరకెక్కించనున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఇది రూపొందనుంది. మరో సినిమాని తన కుమార్తె సుస్మిత నిర్మించనున్నారు. దర్శకుడి వివరాలు ఇంకా వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని