Ram Charan: నాన్న మౌనం వీడితే ఏమవుతుందో తెలీదు: హీరో రామ్‌చరణ్‌

హనుమకొండలో నిర్వహించిన ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవ వేడుకలో నటుడు రామ్‌చరణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

Published : 29 Jan 2023 01:14 IST

హనుమకొండ:  ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi)ని  ఏమైనా అంటే తాము ఊరుకోమని ఆయన తనయుడు రామ్‌చరణ్‌ (Ram Charan) హెచ్చరించారు. తన తండ్రి మౌనం వీడితే  ఏమవుతుందో ఎవరికీ తెలీదన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) విజయోత్సవ వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి హీరోగా దర్శకుడు కె. బాబీ తెరకెక్కించిన చిత్రమిది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకి మంచి స్పందనరావడంతో చిత్రబృదం హనుమకొండలో ఈవెంట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘తమతో పనిచేసిన హీరోలందరికీ బ్లాక్‌బస్టర్‌ అందించిన ఏకైక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌లకు సినిమా అంటే ప్యాషన్‌. దర్శకుడు బాబీ ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్‌ నాకు బాగా నచ్చింది. యూఎస్‌లో ఉండగా ఇండియాకు తిరిగొచ్చి ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తానా? అని అనిపించింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అదిరిపోయే పాటలు ఇచ్చారు. నాన్నకే మ్యూజిక్‌ బాగా ఇస్తున్నారు.. మాక్కూడా ఇవ్వండి (నవ్వులు..). చిరంజీవిగారి సినిమాలకు సంబంధించిన వేడుకలకు అతిథులు అవసరం లేదు. ఆయనొక్కరే చాలు. నేనూ మీ అందరిలానే ఓ అభిమానిగా.. చిత్రాన్ని ఎంతగా ఎంజాయ్‌ చేశానో చెప్పేందుకు వచ్చా. చిరంజీవిగారిని ఏమైనా అనగలిగితే కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రమే అనగలరు. చిరంజీవి మౌనంగా, సౌమ్యంగా ఉంటారని అందరికీ తెలుసు. ఆయన సైలెంట్‌గా ఉంటేనే ఇలా ఉంది. అదే ఆయన మౌనం వీడి, మాట్లాడితే ఏం అవుద్దో ఎవరికీ తెలియదు. గుర్తుపెట్టుకోండి.. ఆయన సైలెంట్‌గా ఉంటారేమోకాని మేం (ఫ్యాన్స్‌) ఉండం. ఆయన్ను ఏమైనా అంటే మేం ఊరుకోమని మౌనంగానే చెబుతున్నా’’ అని రామ్‌చరణ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని