Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్‌ ఆస్కార్‌ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?

mm keeravani: ‘క్షణక్షణం’లో వల్లే తనకు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు.

Published : 26 Mar 2023 01:31 IST

హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Ram gopal varma) తన మొదటి ఆస్కార్‌ అని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (mm keeravani) అన్నారు. ‘RRR’ మూవీలోని ‘నాటు నాటు’(Naatu Naatu) కు ఆస్కార్‌ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడారు.  రాంగోపాల్‌వర్మ ‘క్షణ క్షణం’ మీ కెరీర్‌కు మంచి ఊతాన్ని ఇచ్చింది. అప్పటికీ, ఇప్పటికే అదే దృఢవిశ్వాసంతో ఉన్నారా? అని ప్రశ్నించగా, వెంటనే స్పందించిన కీరవాణి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

‘‘నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. రాంగోపాల్‌వర్మ నా మొదటి ఆస్కార్‌. 2023లో నేను అందుకున్న అకాడమీ అవార్డు రెండోది. ఎందుకంటే, సంగీత దర్శకుడిగా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో దాదాపు 51 మందిని కలిశా. వాళ్లలో కొందరు నేను చేసిన ట్యూన్‌ల క్యాసెట్‌ను చెత్తబుట్టలోకి విసిరేశారు. నన్ను పట్టించుకోవాల్సిన అవసరం వాళ్లకేముంది? నేనొక అపరిచితుడిని. నా పాటలు వాళ్లెందుకు వినాలి? కొందరికి నా ట్యూన్స్‌ నచ్చినా అవకాశం ఇవ్వడానికి మాత్రం ముందుకు రాలేదు. ఆ సమయంలో రాంగోపాల్‌వర్మ తన ‘క్షణక్షణం’లో పనిచేసే అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆయన ‘శివ’ రాంగోపాల్‌వర్మ. ఆ చిత్రం ఒక రకంగా ఆయన సాధించిన ఆస్కార్‌. అది ఎంతో పెద్ద హిట్‌ అయింది. అలాంటి వర్మ నా కెరీర్‌లో ‘ఆస్కార్‌’ పాత్ర పోషించారు. ఆయనే నా ఆస్కార్‌. ఎందుకంటే అప్పటివరకూ కీరవాణి అంటే ఎవరికి తెలుస్తుంది. ‘వర్మతో కలిసి కీరవాణి పనిచేస్తున్నాడు’ అంటే అతనిలో ఏదో ఉందనుకుంటూ నాకు అవకాశాలు ఇచ్చారు. ఆ ఏడాది వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అలా వర్మ అసోసియేషన్‌ నాకు ఎన్నో అవకాశాలను ఇప్పించింది’’ అని కీరవాణి వర్మను పొగడ్తలతో ముంచెత్తారు.

ఆ వీడియోను పంచుకుంటూ వర్మ ‘నేను చనిపోయిన భావన కలుగుతోంది. ఎందుకంటే చనిపోయిన వాళ్లనే ఇంత గొప్పగా పొగుడుతారు’ అంటూ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవుతున్న ఎమోజీలను పంచుకున్నారు. వెంకటేశ్‌, శ్రీదేవి జంటగా నటించిన ‘క్షణ క్షణం’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని