The Warriorr Review: రివ్యూ: ది వారియ‌ర్‌

రామ్‌ పోతినేని ‘ది వారియర్‌’ సినిమా ఎలా ఉందంటే

Updated : 14 Jul 2022 15:26 IST

The Warriorr Review: చిత్రం: ది వారియర్‌; న‌టీన‌టులు: రామ్ పోతినేని, కృతిశెట్టి, ఆది పినిశెట్టి, న‌దియా, అక్షర గౌడ‌, బ్రహ్మాజీ, పోసాని కృష్ణముర‌ళి త‌దిత‌రులు; కూర్పు: నవీన్ నూలి; కళ: డి.వై.సత్యనారాయణ; పోరాటాలు: విజయ్ మాస్టర్, అన్బు-అరివు; ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్; మాటలు: సాయిమాధవ్ బుర్రా, లింగుస్వామి; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; స‌మ‌ర్పణ: ప‌వ‌న్ కుమార్; నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి; నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్; కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శక‌త్వం: ఎన్‌. లింగుస్వామి; విడుద‌ల‌ తేదీ: 14 జులై 2022

కొంత‌కాలంగా మాస్ క‌థ‌ల‌తో ప్రయాణం చేస్తున్నారు యువ క‌థానాయ‌కుడు రామ్ పోతినేని(Ram Pothineni). మాస్ ఇమేజ్ ఉన్న క‌థానాయ‌కులంద‌రి కెరీర్‌లోనూ కీల‌క‌మైన పోలీస్ స్టోరీలు క‌నిపిస్తుంటాయి. రామ్ కూడా త‌న ఇమేజ్ దృష్ట్యా పోలీస్ క‌థ‌ని ఎంచుకుని ‘ది వారియ‌ర్‌’ (The Warriorr) చేశారు. ఇదే చిత్రంతో త‌మిళంలోకీ ఎంట్రీ ఇచ్చారు. రెండు భాషల‌పైనా మాస్ ద‌ర్శకుడిగా త‌న‌దైన ముద్రవేసిన లింగుస్వామి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డం, రామ్ తొలిసారి ఖాకీ పాత్రలో న‌టించ‌డంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. (The Warriorr Review) మ‌రి ఆ అంచ‌నాల‌కి త‌గ్గట్టుగా సినిమా ఉందో లేదో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం.

క‌థేంటంటే: స‌త్య (రామ్ పోతినేని)(RAM) ఐపీఎస్ అధికారి. త‌న కోరిక మేర‌కే క‌ర్నూలుకి డీఎస్పీగా వ‌స్తాడు. విధుల్లో చేర‌గానే ఊరికి ప‌ట్టిన రోగాన్ని న‌యం చేయ‌డంపై దృష్టిపెడ‌తాడు. ఆ రోగం పేరు స్థానిక గ్యాంగ్‌స్టర్ గురు (ఆది పినిశెట్టి) (Aadhi). మ‌రి ఖాకీ దుస్తుల్లో ఉన్న స‌త్య.. గురు ట్రీట్‌మెంట్ కోసం ఎలాంటి ఆపరేష‌న్ చేప‌ట్టాడు. ఆ క్రమంలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? స‌త్య త‌న బాధ్యత‌లను క‌ర్నూల్లోనే ఎందుకు చేప‌ట్టాల్సి వ‌చ్చింది. అక్కడ విజిల్ మ‌హాలక్ష్మి (కృతిశెట్టి)గా (Krithi shetty) ఫేమ‌స్ అయిన అమ్మాయితో స‌త్యకి సంబంధ‌మేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే(The Warriorr Review).

ఎలా ఉందంటే: ‘ఒక రౌడీ, రాజ‌కీయ నాయ‌కుడు కావ‌డం మామూలే కానీ, ఒక ఐపీఎస్ ఇలా వైద్యం చేయడం కొత్తగా ఉంది’ అని ఆది పినిశెట్టి (Aadhi) ఓ డైలాగ్ చెబుతాడు. బ‌హుశా క‌థానాయ‌కుడు రామ్‌కి(RAM) కూడా ఈ క‌థ‌లోని ఆ అంశ‌మే కొత్తగా అనిపించిందేమో. వాస్తవంగా కూడా మిగ‌తా పోలీస్ క‌థ‌ల‌కీ, దీనికీ తేడా అదొక్కటే. హీరోకీ విల‌న్‌కీ మ‌ధ్య సాగే వార్ అంతా సేమ్ టు సేమ్‌. (The Warriorr Review) ట్రైల‌ర్‌లో చూపించిన దానికీ, ప్రథ‌మార్ధంలో క‌థానాయ‌కుడి పాత్రకీ వ్యత్యాసం ఉంటుంది. స‌ర‌దా స‌న్నివేశాల‌తో క‌థ‌ని మొద‌లుపెట్టిన ద‌ర్శకుడు (Lingusamy).. అటెన్షన్ ప్లీజ్ అంటూ మెల్లగా గురు దురాగతాల‌తో క‌థ‌లోకి తీసుకువెళ్తాడు. స‌త్య‌, గురు, విజిల్ మ‌హాల‌క్ష్మి.. ఇలా పాత్రల‌న్నింటినీ ప‌రిచ‌యం చేస్తూ క‌థ‌లోకి వెళ‌తారు. ఒక‌వైపు నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ‌క‌థ, మ‌రోవైపు గురు గ్యాంగ్  చేసే హంగామాతో ప్రథ‌మార్ధం మాస్ ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకుంటుంది.

గురు అకృత్యాల‌పై క‌థానాయ‌కుడు క‌న్నెర్ర చేయ‌డం నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. విరామానికి ముందు వ‌చ్చే మ‌లుపు సినిమాకి కీల‌కం. ఐపీఎస్‌గా స‌త్య ఎంట్రీ ఇచ్చాక ఫేస్ టు ఫేస్ వార్ షురూ అవుతుంది. ఇక్కడి నుంచే ద‌ర్శకుడు త‌నదైన ప్రభావం చూపించాల్సింది. హీరో, విల‌న్‌ మ‌ధ్య సాగే వైరంతో పోలీసు క‌థ‌లు దాదాపుగా ఒకేలా ఉంటాయి. వారి మ‌ధ్య బ‌ల‌మైన సంఘ‌ట‌న‌లు, ఎత్తుకు పైఎత్తుల‌తో డ్రామాని జోడించి ఆస‌క్తిని రేకెత్తించిన‌ప్పుడే పోలీస్ క‌థ‌లు ఆక‌ట్టుకుంటాయి. కానీ, ఈ సినిమాలో ఆ త‌ర‌హా స‌న్నివేశాల్లోనే బ‌లం కొర‌వ‌డింది. మ‌హాల‌క్ష్మిని కిడ్నాప్ చేసి హీరోకి ఝ‌ల‌క్ ఇవ్వడం బాగుంది కానీ, సైలెన్స్ ఈజ్ మోస్ట్ వైయొలెన్స్ అంటూ ఆ స‌న్నివేశాల్లో ఏమీ చేయ‌కుండా నిలుచుంటాడు క‌థానాయ‌కుడు. అది ప్రేక్షకుల‌కు అంత‌గా కిక్ ఇవ్వదు. అలాంటి స‌న్నివేశాలు ఒక‌ట్రెండు ప్లాన్ చేసినప్పటికీ అవి పెద్దగా ప్రభావం చూపించ‌వు. చివ‌ర్లో కొండారెడ్డి బురుజు వద్ద హీరో విల‌న్ త‌ల‌ప‌డటంతో క‌థ ముగుస్తుంది. ఊహ‌కు త‌గ్గట్టుగా సాగే క‌థే ఈ సినిమాకి మైన‌స్‌.  ప్రేమ‌క‌థ‌, పాట‌లు, ఫైట్లతో కావ‌ల్సిన‌న్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలతో మాస్‌ని అల‌రించే ప్రయ‌త్నం చేశారు.

ఎవ‌రెలా చేశారంటే: ఐపీఎస్ స‌త్య పాత్రలోనూ, ప్రథ‌మార్ధంలోనూ రామ్ మంచి అభిన‌యం ప్రద‌ర్శించారు. ఆయ‌న పాత్రని డిజైన్ చేసిన తీరు బాగుంది. రెండు కోణాల్లో సాగే ఆ పాత్రలో ఆయ‌న ఒదిగిపోయిన తీరు న‌టుడిగా ప‌రిణ‌తికి అద్దం ప‌డుతోంది. డ్యాన్స్‌లు, ఫైట్లతోనూ ఆక‌ట్టుకున్నాడు. ఆది పినిశెట్టి చేసిన గురు పాత్ర సినిమాకి ప్రధాన‌బ‌లం. రాయ‌ల‌సీమ యాస మాట్లాడుతూ అందులో ఒదిగిపోయాడు. ఆది త‌గిన ఎంపిక అని రుజువు చేశారు. విజిల్ మ‌హాలక్ష్మిగా కృతి అందంగా క‌నిపించింది. ఆరంభ స‌న్నివేశాల్లో ఆమె వినోదం పంచింది. ఎక్కువ భాగం స‌న్నివేశాలు గురు, స‌త్య వైరం నేప‌థ్యంలోనే సాగుతాయి. దాంతో మిగిలిన పాత్రల‌కి పెద్దగా ప్రాధాన్యం ద‌క్కలేదు. న‌దియా పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ స్వర‌ప‌రిచిన మూడు పాట‌లు బాగున్నాయి. నేప‌థ్య సంగీతం మాత్రం మాస్‌ సినిమాకు తగినట్లు లేదు. కెమెరా విభాగం ప‌నితీరు మెప్పిస్తుంది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ద‌ర్శకుడు లింగుస్వామి రాసుకున్న క‌థ‌లో కొత్తద‌నం కొరవ‌డింది. ప‌లువురు ఐపీఎస్ అధికారుల స్ఫూర్తితోనే ఈ క‌థ రాసిన‌ప్పటికీ, త‌న మార్క్ డ్రామా క‌నిపించ‌లేదు. పాత్రల్ని డిజైన్ చేసిన విధానం, కొన్ని మ‌లుపుల‌పైనా ఆయ‌న ప్రభావం క‌నిపిస్తుందంతే.

బ‌లాలు

రామ్‌, ఆది న‌ట‌న‌

విరామానికి ముందు స‌న్నివేశాలు

పాట‌లు, పోరాట ఘ‌ట్టాలు

బ‌ల‌హీన‌త‌లు

ఊహ‌కు త‌గ్గట్టుగా సాగే క‌థ

చివ‌రిగా: ‘ది వారియ‌ర్’... పోలీస్ చేసిన ఆప‌రేష‌న్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని