Ramabanam movie review: రివ్యూ: రామ‌బాణం

Rama banam movie review: గోపీచంద్‌, డింపుల్‌ హయాతీ కీలక పాత్రల్లో శ్రీవాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రామ బాణం’ ఎలా ఉందంటే?

Updated : 05 May 2023 13:04 IST

Ramabanam movie review: చిత్రం: రామబాణం; న‌టీన‌టులు: గోపీచంద్, డింపుల్ హయాతీ, జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా త‌దిత‌రులు; సంగీతం: మిక్కీ జె మేయర్; ఛాయాగ్ర‌హ‌ణం: వెట్రి పళనిసామి; కూర్పు: ప్రవీణ్ పూడి; కథ: భూపతి రాజా; సంభాష‌ణ‌లు: మధుసూదన్ పడమటి; క‌ళ‌: కిరణ్ కుమార్ మన్నె; నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్; దర్శకత్వం: శ్రీవాస్; సంస్థ‌:  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ; విడుద‌ల‌: 05-05-2023

కొన్ని క‌ల‌యిక‌లు ప్ర‌త్యేక‌మైన అంచ‌నాల్ని... ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. గోపీచంద్(Gopi chand) - శ్రీవాస్ క‌ల‌యిక అలాంటిదే. ‘ల‌క్ష్యం’, ‘లౌక్యం’ త‌ర్వాత ఆ ఇద్ద‌రూ క‌లవ‌డమే ఆ అంచ‌నాల‌కి కార‌ణం. విజ‌య‌వంత‌మైన ఆ క‌ల‌యిక‌లో రూపొందిన మూడో చిత్రం ‘రామ‌బాణం’ ఆరంభం నుంచీ మంచి ప్ర‌చారాన్నే సొంతం చేసుకుంది. (Ramabanam movie review) మ‌రి చిత్రం ఎలా ఉంది?గోపీచంద్‌ శైలి యాక్షన్‌ డ్రామా ఉందా?

క‌థేంటంటే: రాజారామ్ (జ‌గ‌ప‌తిబాబు) త‌న ఊళ్లో సుఖీభ‌వ పేరుతో హోట‌ల్ న‌డుపుతుంటాడు. ప్ర‌జ‌ల ఆరోగ్యమే ప‌ర‌మావ‌ధి అనుకునే ఆయ‌న‌... సంప్ర‌దాయ వంట‌కాల్ని త‌యారు చేయిస్తూ త‌క్కువ ధ‌రల‌కే అందుబాటులో ఉంచుతుంటాడు. వ్యాపారంలో పోటీదారుల‌కి అది కంట‌గింపుగా మారుతుంది. జీకే (త‌రుణ్ అరోరా), అత‌ని మామ (నాజ‌ర్‌) సుఖీభ‌వ హోట‌ల్‌పై దౌర్జ‌న్యానికి పాల్ప‌డి లైసెన్స్ తీసుకెళ్లిపోతారు. దాంతో రాజారామ్ త‌మ్ముడైన విక్కీ (గోపీచంద్‌) రాత్రికి రాత్రే వాళ్ల ఇంటిపై దాడిచేసి లైసెన్స్ తీసుకొస్తాడు. నీతి నిజాయ‌తీగా మెలిగే రాజారామ్ ఏదైనా చ‌ట్ట ప‌రిధిలోనే చేయాల‌ని భావిస్తుంటాడు. త‌న త‌మ్ముడు విక్కీ చేసిన ప‌ని న‌చ్చ‌ని రాజారామ్... ఇలాంటివి చేస్తే జీవితంలో ఉన్న‌తంగా ఎద‌గ‌లేమ‌ని చెబుతూ అత‌న్ని పోలీసుల‌కి అప్ప‌జెప్పేందుకు వెళ‌తాడు. ఇంత‌లో విక్కీ తాను ఎప్ప‌టికైనా ఉన్న‌తంగా ఎదిగి తిరిగొస్తానంటూ త‌ప్పించుకుని కలకత్తా వెళ్లిపోతాడు. అక్క‌డికి వెళ్లిన విక్కీ ఏం చేశాడు? ప‌దిహేనేళ్ల త‌ర్వాత తిరిగి రావ‌ల్సిన అవ‌స‌రం ఆయ‌న‌కి ఎందుకొచ్చింది? (Ramabanam movie review) వ‌చ్చాక ఏం జ‌రిగింద‌నేది అస‌లు క‌థ‌.

ఎలా ఉందంటే: పాత క‌థ‌ల్ని కూడా కొత్త‌గా చెబుతున్న స‌మ‌యం ఇది. క‌థ అదే అయినా దానికి కొత్త నేప‌థ్యాల్ని మేళ‌వించి, విభిన్న‌మైన పాత్రీక‌ర‌ణ‌ల‌తోనూ... క‌థ‌నంతోనూ మేజిక్ చేస్తూ ప్రేక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కుటుంబ క‌థ‌లు ఇప్పుడు రావ‌డం లేదు క‌దాని... ద‌శాబ్దాల కింద‌టే చూసేసిన క‌థ‌ల్ని అదే ఫార్ములాతో ఇప్పుడు తెర‌పైకి తీసుకొస్తామంటే కుద‌ర‌దు. కానీ, రామ‌బాణం (rama banam review) విష‌యంలో జ‌రిగింది అదే. సేంద్రీయ ఉత్ప‌త్తులు, సంప్ర‌దాయ ఆహారం అంటూ ఓ కొత్త నేప‌థ్యాన్ని ఎంచుకున్నారు. త‌గిన తారాగ‌ణం, కావ‌ల్సినంత బ‌డ్జెట్ ఉంద‌ని తెర‌పైన హంగులే చెబుతున్నాయి. కానీ చిత్రాన్ని మ‌లిచిన విధానం మాత్రం పేల‌వంగా ఉంది. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒక్క స‌న్నివేశంలోనూ కొత్త‌ద‌నం లేదు. ప్రేమ, కుటుంబ అనుబంధాలు,  డ్రామా, ఆలోచ‌నని రేకెత్తించ‌గ‌లిగే నేప‌థ్యం.. ఇలా అన్నీ ఉన్న క‌థే అది. (rama banam review) అయినా స‌రే మ‌న‌సుల్ని హ‌త్తుకునే భావోద్వేగాలు కానీ, కాసింత హాస్యం పంచే స‌న్నివేశాలు కానీ మ‌చ్చుకైనా క‌నిపించ‌వంటే ఈ స్క్రిప్ట్, ద‌ర్శ‌క‌త్వం ఎంత పేల‌వమో అర్థం చేసుకోవ‌చ్చు.

క‌థానాయ‌కుడు క‌లక‌త్తా నుంచి ఫ్లైటెక్కి సొంత కుటుంబాన్ని క‌ల‌వ‌డం కోసం బ‌య‌ల్దేర‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. క‌థానాయకుడి ఫ్లాష్‌బ్యాక్‌, క‌ల‌క‌త్తా జీవితం, అక్క‌డ విక్కీ భాయ్‌గా ఎద‌గడం వంటి స‌న్నివేశాలతో సినిమా సాగుతుంది. యూ ట్యూబ‌ర్ భైర‌వి (డింపుల్ హ‌యాతి)తో ప్రేమలో ప‌డ‌టంతో క‌థ‌లో మ‌లుపు చోటు చేసుకుంటుంది. క‌థానాయ‌కుడు ప‌దిహేనేళ్ల తర్వాత తిరిగి  సొంత కుటుంబానికి ద‌గ్గ‌ర కావ‌డం, అక్క‌డ చోటు చేసుకునే ప‌రిణామాలు ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందేవే. (Ramabanam movie review) కొన్న‌యితే మ‌రీ అతిగా అనిపిస్తాయి. క‌థానాయ‌కుడు ఫోన్‌లోనే రూ.50 కోట్లు స‌ర్దుబాటు చేసి పెళ్లికి ఒప్పించే స‌న్నివేశాలు అలాంటివే. కామెడీ కోస‌మంటూ వెన్నెల కిశోర్‌ని మ్యూజిక్ టీచ‌ర్‌గా చూపిస్తూ తీర్చిదిద్దిన స‌న్నివేశాల్లో ఏమాత్రం కొత్త‌ద‌నం లేదు. ఆ స‌న్నివేశాలు పెద్దగా న‌వ్వించ‌వు. ప‌తాక స‌న్నివేశాలు కొద్దిలో కొద్దిగా న‌యం.  అన్న‌ద‌మ్ములిద్ద‌రి అభిప్రాయాలూ క‌ల‌వ‌డం, ఆ త‌ర్వాత చోటు చేసుకునే ప‌రిణామాలు మాస్ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాయి. సేంద్రీయ ఆహార ఉత్పత్తుల గురించి కోర్టులో జ‌రిగే వాద‌న‌లు, న్యాయ‌మూర్తి చెప్పే మాట‌లు, సందేశం మెప్పిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: గోపీచంద్ క‌నిపించిన విధానం బాగుంది. స్టైల్‌గా క‌నిపిస్తూ, యాక్ష‌న్ ఘ‌ట్టాల్లోనూ, పాట‌ల‌తోనూ మెప్పించాడు. కానీ ఆయ‌న పాత్ర‌లో ఏమాత్రం కొత్త‌ద‌నం లేదు.  జ‌గ‌పతిబాబుని ఈ మ‌ధ్య ప్ర‌తినాయ‌కుడిగానే ఎక్కువ‌గా చూస్తున్నాం. కానీ ఇందులో సాత్వికంగా క‌నిపిస్తూ రాజారామ్ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఆయ‌న పాత్ర‌ని మ‌లిచిన విధానం బాగుంది. డింపుల్ హ‌యాతి పాట‌ల‌కే ప‌రిమితం. డ్యాన్స్‌లు బాగా చేశారు.  ఖుష్బూ  పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించారు. అలీ, వెన్నెల కిశోర్‌, స‌త్య‌, గెట‌ప్ శ్రీను, స‌ప్త‌గిరి గ్యాంగ్ చేసిన హంగామా ఏమాత్రం న‌వ్వించ‌దు.  త‌రుణ్ అరోరా, నాజ‌ర్, రాజా ర‌వీంద్రతోపాటు క‌ల‌క‌త్తా విల‌న్లు త‌దిత‌రులు అల‌వాటైన పాత్ర‌ల్లోనే క‌నిపించారు.  క‌ల‌క‌త్తా రౌడీలు, లోక‌ల్ రౌడీలు ఇలా బోలెడంత విల‌న్ గ్యాంగ్ ఉన్నా ఆ పాత్ర‌లన్నీ  తేలిపోయాయి. దాంతో హీరోయిజం కూడా పెద్ద‌గా పండ‌లేదు. (rama banam review) సాంకేతికంగా సంగీతం, కెమెరా, క‌ళ‌ విభాగాల ప‌నితీరు మెప్పిస్తుంది. కొన్ని స‌న్నివేశాలు రిచ్‌గా క‌నిపించాయి. ‘సాక్ష్యం’ త‌ర్వాత సుదీర్ఘ‌మైన విరామం తీసుకుని ఈ సినిమా చేసిన ద‌ర్శ‌కుడు శ్రీవాస్ త‌న ప‌నితీరుతో ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు.  పాత క‌థ‌ని, అంతే మూస ప‌ద్ధ‌తుల్లో చెప్పారు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది

  • బ‌లాలు
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • + సంప్ర‌దాయ ఆహార నేప‌థ్యం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కొత్త‌ద‌నం లేని క‌థ, క‌థ‌నాలు
  • - ఆస‌క్తి రేకెత్తించ‌ని స‌న్నివేశాలు

చివ‌రిగా: ఈ ‘రామబాణం’ గురితప్పింది!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు