Updated : 25 Apr 2022 10:02 IST

RamCharan: ఒత్తిడి లేదు..బాధ్యత పెరిగింది

‘మగధీర’కు ముందు.. ఆ తర్వాత.. ‘రంగస్థలం’కు ముందు ఆ తర్వాత.. ఇలా సినిమా సినిమాకీ ఇంతింతింతై అన్నట్లు ఒక్కో మెట్టూ ఎదుగుతున్నాడు రామ్‌చరణ్‌. వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో జాతీయ స్థాయి కథానాయకుడిగా మారారు. ఇప్పుడాయన తన తండ్రి చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ కోసం తెర పంచుకున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన చిత్రమిది. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో   విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు రామ్‌చరణ్‌. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..

ఓ దైవ ఆశీర్వాదం

‘‘నేను.. కొరటాల శివ కలిసి సినిమా చేయాలని ‘మిర్చి’ సమయం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం. సాధ్యపడలేదు. అనుకోకుండా మా ప్రయాణమిలా ‘ఆచార్య’ వైపు మలుపు   తిరగడం.. నాన్నతో ఆయన సినిమా చేయడం.. ఈ చిత్రంలో నేనూ నాన్నతో తెర పంచుకునే అవకాశం రావడం.. అంతా ఓ దైవ ఆశీర్వాదంలా జరిగిపోయింది. నిజానికి ‘రంగస్థలం’ తర్వాత నేను కొరటాలతోనే సినిమా చేయాల్సి ఉంది. అదే సమయంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ అవకాశమొచ్చింది. అయితే నేను ‘మీ సినిమా చకచకా చేసేసి రాజమౌళి చిత్రంలోకి అడుగు పెడతాన’ని కొరటాలతో అన్నా. ఆయన వద్దన్నారు. తర్వాత కొరటాల శివతో చేయడానికి నాన్న ముందుకు రావడం.. వెంటనే ‘ఆచార్య’ కథ కుదరడం చకచకా జరిగిపోయాయి’’.

అసలు ఊహించలేదు

‘‘నిజానికి నేనీ చిత్రంలోకి నిర్మాతగానే ప్రవేశించాను. దీంట్లో నాకొక పాత్ర ఉంటుందని అసలు ఊహించలేదు. మొదట్లో నాది, పూజాది 15నిమిషాల నిడివి ఉన్న అతిథి పాత్రలే. అయితే స్క్రిప్ట్‌ని మెరుగు దిద్దే ప్రయత్నంలో ఆ పాత్రల నిడివి 40నిమిషాల వరకు చేరింది. అలా మావి పూర్తి నిడివి ఉన్న పాత్రలుగా మారాయి. వాస్తవానికి ఆ   15నిమిషాల పాత్ర చేయడానికే రాజమౌళి నాకు అవకాశమిస్తారో లేదో? అనుకున్నా. అలాంటిది      45నిమిషాల నిడివి ఉన్న పాత్ర చేయడానికి ఒప్పుకొన్నారు. అందుకే ‘ఆచార్య’ విషయంలో తొలుత రాజమౌళికే కృతజ్ఞతలు తెలపాలి.    వాస్తవానికి ఈ ఆచార్య, సిద్ధ పాత్రలు ఏ ఇద్దరు హీరోలు కలిసి చేసినా సూపర్‌ హిట్టే. అయితే నాన్న   నేను కలిసి చేయడం వల్ల మా ఇద్దరి రిలేషన్‌ ఆ పాత్రలకు మరింత బలం చేకూర్చినట్లయింది.
ఎంతో ప్రత్యేకం..

‘‘ఆచార్య’లో నాన్న  చేసిన పాత్ర.. నేను పోషించిన సిద్ధ పాత్ర.. వేటికవే విభిన్నంగా ఉంటాయి. నేనిందులో గురుకులం విద్యార్థిని. అహింస పాటించే వ్యక్తిని. అయితే ధర్మం దారి తప్పినప్పుడు సిద్ధలోని సీరియస్‌ కోణం బయటకొస్తుంది. నాన్నది మాత్రం ఆరంభం నుంచి ఫైటర్‌ తరహా పాత్రే. మా ఇద్దరి దారులు వేరైనా కలిసేది ఒకే కారణం కోసం. అదేంటన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ద్వితీయార్ధమంతా నా పాత్ర కనిపిస్తుంది. ఈ చిత్రంలో నాన్నతో కలిసి పని చేసిన  అనుభవం మాత్రం చాలా ప్రత్యేకం. 30ఏళ్లుగా నాన్నతో కలిసి ఉన్నది ఒకెత్తైతే.. ఈ 25రోజుల్లో ఆయనతో కలిసి పని చేసింది ఒకెత్తు. నటుడిగా ఎన్నో గొప్ప విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. నిజ జీవితంలో నాన్నతో నేను కలిసి గడిపే సమయం చాలా తక్కువ. ఆయన ఉదయం 7గంటలకు సెట్స్‌కు వెళ్తే.. మళ్లీ సాయంత్రం 6 గంటల తర్వాతే నాకు కనిపిస్తారు. అలాంటిది ఈ షూటింగ్‌ సమయంలో ఉదయం 6గం.ల నుంచి రాత్రి వరకు ఆయనతో గడపడమన్నది చాలా ప్రత్యేకంగా గుర్తుండిపోయింది’’.


ఆ ఆలోచనలున్నాయి

‘‘ఆచార్య’ని ఇప్పుడే బాలీవుడ్‌లో విడుదల చేయాలని ఏమీ అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి తగ్గట్లుగా చేయాల్సిన నిర్మాణాంతర పనులు చాలా ఉన్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ వెంట వెంటనే రావడం వల్ల ఆ పనులు కాస్త ఆలస్యమయ్యాయి. ప్రస్తుతానికి సినిమాని దక్షిణాదిలో విడుదల చేసి.కొన్నాళ్ల తర్వాత హిందీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. మంచి కథలు వస్తే నేరుగా బాలీవుడ్‌లో చేయడానికీ సిద్ధమే. నా బ్యానర్‌లో పవన్‌ బాబాయ్‌. ఆయన బ్యానర్‌లో నేను కచ్చితంగా చేయాలన్న ఆలోచనలైతే ఉన్నాయి.


‘‘ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఇప్పటికే 60రోజుల చిత్రీకరణ పూర్తయింది. దీని తర్వాత గౌతమ్‌ తిన్ననూరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తా. ఇది వరకు పాన్‌ ఇండియా సినిమా అంటే హిందీ సినిమానే అనడం.. అక్కడి హీరోల గురించే చెప్పడం  జరిగేది. ఇప్పుడు మన సినిమాలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయం నాపై మరింత బాధ్యతను పెంచింది. ఇకపై ఏది పడితే అది కాకుండా బాగా దృష్టి పెట్టి కథలు ఎంచుకోవాల్సి ఉంది. దీన్ని ఒత్తిడిగా ఏమీ  అనుకోవట్లేదు.. మంచి బాధ్యతగానే భావిస్తున్నా. ’’


‘నేను మామూలుగా ఏడాది ఆరంభంలో నా పుట్టినరోజు తర్వాత.. అలాగే సంవత్సరం చివరిలోనూ స్వామి దీక్ష తీసుకుంటాను. దీన్ని కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా ఆచరిస్తూ వస్తున్నా. ఈ ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల తర్వాత దీక్ష తీసుకున్నా. తారక్‌ ఎప్పట్నుంచో మాల వేసుకోవాలని అంటున్నారు. తనకీ ఈ ఏడాది కుదిరింది. ’’Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts