Ramyakrishna: ఏం జరిగిందో.. ఆమెనే అడగండి

ఓ షోలో నటి రమ్యకృష్ణ తనని కించపరిచేలా మాట్లాడారంటూ వనితా విజయ్‌కుమార్‌ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రమ్యకృష్ణ కారణంగానే తాను ఆ షో నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె పరోక్షంగా....

Updated : 05 Jul 2021 12:01 IST

నటి వ్యాఖ్యలపై రమ్యకృష్ణ సమాధానం

చెన్నై: ఓ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రమ్యకృష్ణ తనని కించపరిచేలా మాట్లాడారంటూ నటి వనితా విజయ్‌కుమార్‌ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రమ్యకృష్ణ కారణంగానే తాను ఆ షో నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె పరోక్షంగా ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై రమ్యకృష్ణ స్పందించారు.

‘‘డ్యాన్స్ రియాల్టీ షో షూటింగ్‌ సమయంలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని ముందు వనితాని అడిగి తెలుసుకోండి. నాకు తెలిసినంతవరకూ ఇదేం పెద్ద విషయం కాదు. ఇప్పటికీ మీరు ఈ విషయంపై స్పందించమని కోరితే.. ‘నో కామెంట్‌’ అనే చెబుతాను’’ అని రమ్యకృష్ణ అన్నారు.

రమ్యకృష్ణ న్యాయనిర్ణేతగా ఉన్న ఓ సెలబ్రిటీ డ్యాన్స్ రియాల్టీ షోలో వనితా విజయ్‌కుమార్‌ కంటెస్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్‌లో డ్యాన్స్‌ సరిగ్గా చేయలేదంటూ వనితకు తక్కువ మార్కులు ఇచ్చారు. దీంతో భావోద్వేగానికి గురైన ఆమె.. ట్విటర్‌ వేదికగా ఆ షోకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ‘ఇకపై డ్యాన్స్‌ షోలో భాగం కావాలనుకోవడం లేదు. మన కంటే సీనియర్‌ అయిన వ్యక్తి ప్రతివిషయంలో మనల్ని కించపరుస్తూ, చులకనచేస్తూ మాట్లాడితే తట్టుకోవడం కష్టం. జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు అనుభవించి.. ముగ్గురు పిల్లల్ని సంరక్షించుకుంటున్న నా గురించి వ్యాఖ్యలు చేయడం బాధగా ఉంది. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఒక మహిళ మరొక మహిళకు అండగా ఉండాలి’ అని వనితా విజయ్‌కుమార్‌ పోస్ట్‌ పెట్టారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా రమ్యకృష్ణ స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని