భళ్లాలదేవుడు మళ్లీ కండలు పెంచుతున్నాడా..?

ప్రస్తుతం చేతిలో అరడజనుకుపైగా సినిమాలతో తీరిలేకుండా ఉన్నాడు రానా దగ్గుబాటి. ఒకేసారి టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి తెరపై కనువిందు చేసేందుకు సిద్ధమయ్యాడు.

Updated : 03 Jan 2021 17:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం చేతిలో అరడజనుకుపైగా సినిమాలతో తీరికలేకుండా ఉన్నాడు రానా దగ్గుబాటి. ఒకేసారి టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి తెరపై కనువిందు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉండగా.. బాహుబలిలో కండలు తిరిగిన భారీ దేహంతో కనిపించిన ఈ భళ్లాలదేవుడు.. తర్వాతి సినిమా కోసం కఠినమైన డైట్‌ను పాటిస్తూ సన్నగా మారాడు. అయితే.. ఇప్పుడు మళ్లీ శరీరాకృతిని మార్చే పనిలో పడ్డట్లుగా కనిపిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత రానా హాఫ్‌హ్యాండ్స్‌ టీషర్ట్‌లో కనిపించడమే ఇందుకు కారణం. కండలు చూపిస్తూ దిగిన ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘లోడింగ్‌ ’అని రాసుకొచ్చాడు. మళ్లీ భళ్లాలదేవుడిగా మారేందుకు సన్నద్ధమవుతున్నాడని చెప్పేందుకు ఈ ఫొటో సంకేతమన్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.

కాగా.. ఈ పోస్టుకు నటి తాప్సీ పన్ను ‘స్లో అండ్‌ స్టడీ బిగ్‌ మ్యాన్‌’ అంటూ కామెంట్‌ చేసింది. దానికి.. అవును.. అంటూ రానా స్పందించాడు. హీరో అడవి శేష్‌ కూడా రానా ఫొటోపై కామెంట్‌ చేశారు. ఇందులో భాగంగా కొంతమంది అభిమానులకు రానా రిప్లై ఇచ్చారు. ‘ఏంటి అన్నా.. బ్లూటిక్‌ ఉంటేనే రిప్లై ఇస్తావా’ అని ప్రశ్నించగా.. అలాంటి రూల్‌ ఏం లేదు అంటూ రానా స్పందించారు.

(పాత చిత్రం)

ఇటీవల ఆయన నటించిన ‘అరణ్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అడవిని రక్షించే ఓ ఆదివాసిగా కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళంలో ‘కాడన్‌’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రభు సాలమన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రబృందం ఇప్పటికే రానా లుక్‌ విడుదల చేసింది. అది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. జోయా హుస్సేన్‌, విష్ణు విశాల్‌, సామ్రాట్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈరోస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా.. మలయాళం హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కు తెలుగులో వస్తున్న రీమేక్‌లో పవన్‌ కల్యాణ్‌తో కలిసి రానా తెరపై కనిపించనున్నాడు. వీటితో పాటు ‘విరాటపర్వం’, ‘1945’, ‘హిరణ్యకశ్యప’ సినిమాకు రానా పచ్చజెండా ఊపి 2021లో హంగామా చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇదీ చదవండి..

యుగానికొక్కడు సీక్వెల్‌లో ఆ హీరో ఫిక్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని