Rana: అక్కడి వాళ్లకు నా ఊరు కూడా తెలియదు.. నెపోటిజంపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా సోనీలివ్‌ వేదికగా ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘నిజం’ (Nijam). తాజాగా ఈ కార్యక్రమంలో రానా, నాని పాల్గొని... నెపోటిజం (Nepotism)పై మాట్లాడారు.  

Updated : 24 Feb 2023 11:01 IST

హైదరాబాద్‌: బంధుప్రీతి (Nepotism).. గత కొంతకాలంగా ఇది సినీ పరిశ్రమ(Cinema Industry)లో హాట్‌ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. టాలెంట్‌ ఉన్నప్పటికీ కొత్తవాళ్లకు అవకాశాలు రావడం లేదని ఎన్నో సందర్భాల్లో  పలువురు సినీ విశ్లేషకులు, నెటిజన్లు విమర్శలు చేశారు. తాజాగా ఇదే అంశంపై తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు నటులు రానా, నాని. నెపోటిజం అనేది కొంతవరకూ మాత్రమే ఉపయోగపడుతుందని, టాలెంట్‌ లేకపోతే.. ఇక్కడ నెట్టుకురావడం కుదరదని రానా (Rana) తెలిపారు.

‘‘తెలుగులో నటుడిగా పరిచయమైనప్పుడు.. నేను ఈ పరిశ్రమకు చెందిన వ్యక్తినే. బాలీవుడ్‌లో తొలిసారి నటించినప్పుడు.. నేనెవరినో సరిగ్గా అక్కడివాళ్లకు తెలియదు. నా ఊరు కూడా వాళ్లకు తెలియదు. దక్షిణాది నుంచి వచ్చాను కాబట్టి, నాది చెన్నై అనుకునేవారు. నా దృష్టిలో వారసత్వం అనేది కేవలం మనల్ని పరిచయం చేయడానికే ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఒక్కసారిగా మనం స్టార్స్‌ కాలేం. ఇక, ఏదో ఒకరోజు ప్రాంతీయంగా ఉన్న సినిమా పరిశ్రమలన్నీ కలిసి ఇండియన్‌ సినీ ఇండస్ట్రీగా మారుతుందని పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలోనే అనుకున్నాను. తొమ్మిదేళ్లపాటు నా మాట ఎవరూ నమ్మలేదు. కానీ, ఇప్పుడు చూస్తే మనమంతా ఒక్కటి అయిపోయాం’’

‘‘ఒక వ్యక్తి.. తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లకపోతే అది తప్పు. మా కుటుంబాన్ని ఒక ఉదాహరణ తీసుకుంటే.. తాతయ్య ఒక రైతు. ఊర్లో ఉన్న రైస్‌ మిల్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో చెన్నైకు చేరుకుని ఇటుకల వ్యాపారం మొదలుపెట్టి.. నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి వచ్చారు. సుమారు 45 ఏళ్ల పాటు సినిమాలు చేశారు. ఆయన ఇద్దరి కుమారులు పరిశ్రమలోకి వచ్చారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఒకవేళ నేను ఆ లెగసీని ముందుకు తీసుకువెళ్లలేకపోతే.. అది తప్పు అవుతుంది. నా కుటుంబానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే, లెగసీని కొంతమంది మాత్రమే చూస్తారు. వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు అందరికీ తెలియవు. విజయ వాహిని, ఏవీఎం స్టూడియోస్‌, ముంబయిలో రెండు పెద్ద స్టూడియోలు ఉన్నట్టుండి కనుమరుగయ్యాయి. దాని వారసత్వాన్ని ఆ కుటుంబం వాళ్లు ముందుకు కొనసాగించలేకపోవడమే దానికి ప్రధాన కారణం’’ అని రానా (Rana) వివరించారు.

అనంతరం నాని (Nani) మాట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో నెపోటిజాన్ని ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు ఫాలో కావడం లేదు. సినిమాలు చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. నాని మొదటి సినిమాని లక్షమంది చూశారు. చరణ్‌ మొదటి సినిమాని కోటి మంది చూశారు. చూసిన వాళ్లే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోంది. మీకు ఏం కావాలో వాళ్లు అది ఇస్తున్నారంతే’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు