Rana Naidu: రానా నాయుడు టీజర్‌.. అదరగొట్టేసిన వెంకీ, రానా

దగ్గుబాటి హీరోలు వెంకటేశ్‌ (Venkatesh), రానా (Rana) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). యాక్షన్‌, క్రైమ్‌ నేపథ్యంలో సిద్ధమైన...

Published : 24 Sep 2022 13:10 IST

హైదరాబాద్‌: దగ్గుబాటి హీరోలు వెంకటేశ్‌ (Venkatesh), రానా (Rana) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). యాక్షన్‌, క్రైమ్‌ నేపథ్యంలో సిద్ధమైన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా నటించారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ‘రానా నాయుడు’ టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా షేర్‌ చేసింది. ‘సాయం కావాలా?’ అనే రానా సంభాషణలతో మొదలైన ఈటీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘మీ సాయం గురించి మేమెంతో విన్నాం. సెలబ్రిటీ ఎవరైనా సమస్యల్లో ఉంటే.. వాళ్లు నీకే ఫోన్‌ చేస్తారు. ఫిక్సర్‌ ఫర్‌ ది స్టార్స్‌’, ‘రానా భాగమయ్యాడంటే అది భారీ కుంభకోణమే అయి ఉంటుందని ఈ నగరం మొత్తం చెప్పుకొంటోంది’ అనే సంభాషణలు రానా పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా ఉన్నాయి.

రానా తండ్రి పాత్రలో వెంకీ వృద్ధుడిగా కనిపించిన తీరు ఔరా అనిపించేలా ఉంది. టీజర్‌ చివర్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మెప్పించేలా సాగాయి. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు. లోకోమోటీవ్‌ గ్లోబల్‌ మీడియా పతాకంపై సుందర్‌ ఆరోన్‌ నిర్మించారు. ఇందులో సుర్వీన్‌ చావ్లా, సుశాంత్‌ సింగ్‌, ఆశిష్‌ విద్యార్థి, గౌరవ్‌ చోప్రా, సుచిత్రా పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు