Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో తొలగింపునకు కారణం అదే!

‘రానా నాయుడు’ (Rana Naidu) తెలుగు ఆడియోను ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) తొలగించింది. సాంకేతిక సమస్య కారణంగానే తెలుగు ఆడియోను తొలగించినట్లు తెలిపింది. త్వరలోనే మళ్లీ తెలుగు ఆడియోను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Updated : 31 Mar 2023 14:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరోలు వెంకటేశ్‌ (Venkatesh), రానా (Rana) కలిసి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) వేదికగా మార్చి 10న తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు ఆడియోను నెట్‌ఫ్లిక్స్‌ తొలగించింది. ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో.. ఆ సిరీస్‌ను చూడాలనుకున్న తెలుగు ప్రేక్షకులకు నిరాశ ఎదురైనట్టైంది. దీనిపై ఇప్పటికే పలువురు నెటిజన్లు మీమ్స్‌ క్రియేట్‌ చేసి, వైరల్‌ చేస్తున్నారు.  అసభ్య పదజాలం, అశ్లీల దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయంటూ తెలుగు వెర్షన్‌కి సంబంధించి ట్రోల్స్‌ రావడం వల్లే సంస్థ తీసేసి ఉంటుందని కొందరు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగానే తొలగించినట్లు ఆడియోను తొలగించినట్లు తెలిసింది. వీలైనంత త్వరలో ఆడియోను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

విడుదలైన నాటి నుంచే తెలుగులో ఈ సిరీస్‌ విమర్శలు ఎదుర్కొంటోంది. ‘అగ్ర హీరోలు అయి ఉండి ఇలాంటి అడల్డ్‌ కంటెంట్‌ని ప్రోత్సహించడం తగునా?’ అంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రశ్నలు లేవనెత్తారు. ఓటీటీలో ప్రసారమయ్యే వాటికీ సెన్సార్‌ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు, ఈ సిరీస్‌పై పాజిటివ్‌ స్పందన ఉంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’ టాప్‌ 10 జాబితాలో ఈ సిరీస్‌ ఒకటిగా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని