Rana Naidu Review: రివ్యూ: రానానాయుడు (వెబ్‌సిరీస్‌)

Rana Naidu Review: రానా, వెంకటేశ్‌ కీలక పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’ ఎలా ఉందంటే?

Updated : 11 Mar 2023 16:51 IST

Rana Naidu Review: వెబ్‌సిరీస్‌: రానానాయుడు; నటీనటులు: రానా, వెంకటేశ్‌, సుచిత్ర పిళ్లై, గౌరవ్‌ చోప్రా, సుర్విన్‌ చావ్లా, అభిషేక్‌ బెనర్జీ, ఆదిత్య మేనన్‌ తదితరులు; సంగీతం: సంగీత్‌-సిద్ధార్థ్‌; సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి; ఎడిటింగ్‌: నినద్‌ ఖనోల్కర్‌, మానన్‌ అశ్విన్‌ మెహతా; రచన: కర్మన్య అహుజ, అన్నే మోదీ, బీవీఎస్‌ రవి, వైభవ్‌ విశాల్‌, కరణ్‌ అన్షుమన్‌; స్క్రీన్‌ప్లే: బీవీఎస్‌ రవి; నిర్మాత: పెరల్‌ గిల్‌, సుందర్‌ అరోన్‌, సుమిత్‌ శుక్లా; దర్శకత్వం: సుప్రన్‌ వర్మ, కరణ్‌ అన్షుమన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

కథానాయకులు, నటీనటులకు దొరికిన సరికొత్త మాధ్యమ వేదిక ఓటీటీ. తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి. సినిమాలకు దీటుగా ఓటీటీ సంస్థలు సైతం వెబ్‌సిరీస్‌లు తెరకెక్కిస్తున్నాయి. అగ్ర హీరోలు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. వెంకటేశ్‌, రానా కలిసి నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘రానానాయుడు’. ఈ సిరీస్‌ ప్రకటనతోనే మంచి ఆసక్తి ఏర్పడింది. మరి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉంది? (Rana Naidu Review) బాబాయ్‌-అబ్బాయి కలిసి ఎలా నటించారు?

కథేంటంటే: బాలీవుడ్‌లో ఏ సెలబ్రిటీకి సమస్య వచ్చినా పరిష్కరించే ఏకైక వ్యక్తి రానా నాయుడు (రానా). భార్య, ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్‌. సరిగ్గా అదే సమయంలో జైలు నుంచి బయటకు వస్తాడు రానా తండ్రి నాగా నాయుడు (వెంకటేశ్‌). రానాకు తండ్రి అంటే అస్సలు పడదు. అతడి వల్ల తన కుటుంబంలో సమస్యలు వస్తాయని ఆందోళనగా ఉంటాడు. మరి నాగానాయుడు వచ్చిన తర్వాత రానా జీవితంలో చోటు చేసుకున్న మార్పులేంటి? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? (Rana Naidu Review) తండ్రీకొడుకుల మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? నాగా నాయుడి కొడుకులైన తేజ్‌ నాయుడు (సుశాంత్‌ సింగ్‌), జఫ్ఫానాయుడు (అభిషేక్‌ బెనర్జీ) పరిస్థితి ఏంటి? తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇప్పటి వరకూ వెంకటేశ్‌ అంటే ఫ్యామిలీ ఆడియెన్స్‌ హీరో అనే ముద్ర ఉంది. మధ్య మధ్యలో కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. అయినా ఎక్కడా పరిధులు దాటలేదు. ఇక విభిన్న కథలు, వైవిధ్య పాత్రలతో ప్రేక్షకులను అలరించే నటుడిగా రానాకు పేరుంది. అలాంటి వీరి నుంచి ఒక వెబ్‌సిరీస్‌ వస్తుందంటే, చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, వాటన్నింటికీ భిన్నంగా ఇలాంటి ఒక బోల్డ్‌, అడల్ట్‌ సిరీస్‌ను ఎలా ఒప్పుకొన్నారో వారికే తెలియాలి. బలమైన కంటెంట్‌, ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురి చేసే కథాగమనం ఉంటే నిడివి ఎంత ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో సిరీస్‌లు నిరూపించాయి. కుటుంబమంతా కలిసి సినిమాలకు వెళ్లే రోజులు తగ్గిపోయి, ఇంట్లో కూర్చొని ఓటీటీల్లో వెబ్‌సిరీస్‌లు చూసే కాలమిది. ముఖ్యంగా వెంకటేశ్‌లాంటి వారు నటిస్తే, వాటికి ఫ్యామిలీ ఆడియెన్స్‌ నుంచి ఇంకాస్త ఆదరణ ఉంటుంది. కానీ, కేవలం ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ‘రానా నాయుడు’ తీర్చిదిద్దిన విధానం ఏమాత్రం మెప్పించదు.

మొత్తం పది ఎపిసోడ్స్‌లో కథకు, ఎమోషన్స్‌కు కనెక్ట్‌ అయ్యేవి ఐదారు మాత్రమే. అవి కూడా కుటుంబంతో కలిసి చూడలేం. పాత్రలు వాటి నేపథ్యం, పరిచయానికి మొదటి ఎపిసోడ్‌ను వాడుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత రెండు మూడు ఎపిసోడ్స్‌ కేవలం కథాగమనాన్ని ముందుకు నడిపించడం కోసం రాసుకున్నవే. ముఖ్య పాత్రలకు సబ్‌ప్లాట్స్‌ పెట్టి ఆయా ఎపిసోడ్‌లను లాగించారు. మళ్లీ ఆ పాత్రలు తర్వాత ఎక్కడా కనిపించవు. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఒక శృంగార సన్నివేశం (అసహజం), పాత్రల మధ్య అక్రమ సంబంధాలు, వ్యవహారిక భాషలో కూడా వాడలేని అసభ్య పదజాలాన్ని దట్టించిన ఈ సన్నివేశాలన్నీ సిరీస్‌లో కనిపిస్తాయి.(Rana Naidu Review) తన అక్రమ సంబంధాల గురించి నాగా నాయుడు కన్న కొడుకులతోనే చెప్పడం, వాళ్లను కూడా ‘మందు కొట్టండి, అక్రమ సంబంధాలు పెట్టుకోండి’ వంటి సూచనలు చేయడం వీక్షకుల్ని ఇబ్బందికి గురిచేస్తాయి.

సినీ పరిశ్రమ, కొందరు డబ్బున్న వ్యక్తుల కుటుంబాల్లో వ్యవహారాలన్నీ ఎలా నడుస్తాయి? తాము ఇష్టపడేవారు ఇంకెవరితో తిరుగుతారన్న విషయాలను తెలుసుకోవడానికి ‘స్పై’లను ఎలా ఉపయోగిస్తారు? ఒకరి గుట్టు మరొకరు రాబట్టేందుకు రానా నాయుడులాంటి వ్యక్తులు ఎలా పనిచేస్తారు? వాళ్లకు డబ్బులు ఎలా అందుతాయి? తదితర విషయాలను చూపించిన తీరు చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. స్వామిజీలు, మహరాజ్‌ల ముసుగులో కొందరు వ్యక్తులను చిన్నారులను లైంగికంగా ఎలా వేధిస్తారు? ఆ తర్వాత ఆ చిన్నారుల జీవితాలు ఎంత నరకప్రాయంగా ఉంటాయి? జీవితాంతం వాళ్లు ఎంత మానసిక క్షోభను అనుభవిస్తారు? చర్చించిన తీరు బాగుంది.

ఆరో ఎపిసోడ్‌ నుంచి చివరి వరకూ రాసుకున్న సన్నివేశాలు, కథాగమనం మాత్రం ఒక టెంపోలో సాగుతాయి. పాత్రల మధ్య సంఘర్షణ, తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. మధ్యలో వచ్చే శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం పంటికింద రాయిలా కలుక్కుమనిపిస్తాయి. తొమ్మిదో ఎపిసోడ్‌లో వచ్చే ట్విస్ట్‌ సిరీస్‌కు హైలైట్‌. ఇక నాగా నాయుడు అంటే రానా నాయుడికి ఎందుకు కోపం? అస్తమానం తండ్రిని ఎందుకు ద్వేషిస్తూ ఉంటాడు? అనేది అర్థంకాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్న ప్రేక్షకుడికి అప్పటికి గానీ అసలు విషయం అర్థం కాదు.(Rana Naidu Review) అందులోనూ బలమైన ఎమోషన్‌ లేదు. సిరీస్‌ను ముగించిన తీరూ ఏమంత గొప్పగా లేదు. పైగా దీనికి కొనసాగింపు ఉంటుందని చివర్లో రానా పాత్ర ద్వారా చెప్పించారు. ఈ వీకెండ్‌లో ఏదైనా వెబ్‌సిరీస్‌ చూడాలంటే నిడివి భరిస్తే ‘రానా నాయుడు’ ప్రయత్నించవచ్చు. కానీ, ఒక అలర్ట్‌.. కుటుంబంతో కలిసి చూసే సిరీస్‌ అయితే కాదు.

ఎవరెలా చేశారంటే: ఈ సిరీస్‌కు రానా నాయుడు, నాగా నాయుడు రెండు మూలస్తంభాలు. సిరీస్‌ మొత్తం రానానాయుడు సెంట్రిక్‌గానే సాగుతుంది. ఆ పాత్రలో రానా చక్కగా నటించారు. తండ్రి అంటే ద్వేషించే వ్యక్తిగా, కుటుంబం కోసం ఆరాటపడే ఫ్యామిలీ మ్యాన్‌గా ఆయన నటన బాగుంది. భార్య అంటే ఎంతో ప్రేమ ఉన్న రానా.. తన దగ్గరకి కోరి కొందరు అమ్మాయిలు వచ్చినా తిరస్కరిస్తాడు. కానీ, ఒక సన్నివేశంలో మాత్రం అతడి పాత్ర కూడా స్థాయి దిగజారిపోతుంది. తండ్రిని చంపమని చెప్పిన తర్వాత తను పడే మనోవేదనను కంటితోనే పలికించారు రానా. రానాకు గతంలో ఎదురైన అనుభవం తెలిసిన తర్వాత ఆ పాత్ర పడే బాధ సిరీస్‌ చూస్తున్న ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తుంది. (Rana Naidu Review) నాగా నాయుడిగా తండ్రి పాత్రలో వెంకటేశ్‌ చక్కగా నటించారు. వయసుకు తగిన పాత్ర. వెంకీ మొత్తం సినీ కెరీర్‌ ఒకవైపు, ఒక్క నాగా నాయుడి పాత్ర మరోవైపు ఉంటుంది. ఆ పాత్రను తీర్చిదిద్దిన మేరకు తన హావభావాలు, నటనతో మెప్పించారు. ఈ సిరీస్‌లో ఒక వైల్డ్‌ వెంకటేశ్‌ను చూస్తారు. అయితే, ఆయన నోటి నుంచి వచ్చే అసభ్య పదజాలం వింటుంటే ‘మన వెంకీమామేనా’ అనిపిస్తుంది.  సినీ నటుడు ప్రిన్స్‌గా గౌరవ్‌ చోప్రా, రానా నాయుడు భార్యగా సుర్విన్‌ చావ్లా, తేజ్‌ నాయుడుగా సుశాంత్‌ సింగ్‌, జఫ్పా నాయుడిగా అభిషేక్‌ బెనర్జీ, మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సూర్యగా ఆశిష్‌ విద్యార్థి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా సిరీస్‌ బాగుంది. సంగీత్‌-సిద్ధార్థ్‌ నేపథ్య సంగీతం ఓకే. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. డార్క్‌ టోన్‌, నైట్‌ విజువల్స్‌ చాలా బాగా చూపించారు. ఎడిటర్స్‌ నినద్‌ ఖనోల్కర్‌, మానన్‌ అశ్విన్‌ మెహతాలు తమ పనికి ఏమాత్రం న్యాయం చేయలేదు. అనవసర సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా.. ఒక్కో ఎపిసోడ్‌ను 45 నిమిషాలకు పైగానే వదిలేశారు. ప్రతి పాత్రతోనూ అసభ్య పదజాలం పలికించడం ఏమాత్రం బాగుండదు. ఆ పదజాలం ప్రభావం చిన్నారులపై ఎలా ఉంటుందో సిరీస్‌లోనే ఒక సీన్‌ ఉంటుంది. మరి అంతలా ఎలా రాశాలో రచయితలకే తెలియాలి. ప్రేక్షకులను మెప్పించేలా సిరీస్‌ను తీర్చిదిద్దడంలో దర్శకులు సుప్రన్‌ వర్మ, కరన్‌ అన్షుమన్‌లు కొంతవరకే సఫలమయ్యారు. రానా, వెంకటేశ్‌లాంటి వైవిధ్య నటులు పైగా దగ్గుబాటి కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే సిరీస్‌లో నటిస్తున్నప్పుడు వారి నుంచి మంచి నటనను రాబట్టుకోవచ్చు. (Rana Naidu Review) వారి మధ్య ఫేస్‌ టు ఫేస్‌ సన్నివేశాలను క్రియేట్‌ చేసి అభిమానులనే కాదు, సాధారణ ప్రేక్షకులను సైతం మెప్పించవచ్చు. కానీ, ఆ పని అస్సలు చేయలేదు. తండ్రీ కొడుకుల పాత్రల మధ్య బలమైన సంఘర్షణ ఎక్కడా కనిపించదు. పైగా శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలంతో సన్నివేశాలను నింపేశారు. ప్రతిదానికీ కొన్ని పరిమితులు ఉంటాయి. చివరి ఎపిసోడ్స్‌, ‘పద్మ వ్యూహాన్ని ఛేదించేటప్పుడు సొంత వాళ్లను ఎదుర్కోవాలి. నువ్వు ఎవరి కోసం యుద్ధం చేస్తున్నావో వాళ్లు కూడా నీవాళ్లే’ వంటి కొన్ని సంభాషణలు మాత్రమే బాగున్నాయి.

బలాలు: + వెంకటేశ్‌, రానా నటన; + చివరి ఎపిసోడ్స్‌

బలహీనతలు: - శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం; - మొదటి ఐదు ఎపిసోడ్స్‌; - నిడివి

చివరిగా: ‘రానా నాయుడు’.. ‘A’ సినిమాకు ఎక్కువ.. ఎమోషన్స్‌కు తక్కువ (Rana Naidu Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని