Rana: మళ్లీ అలాంటి స్టార్‌ హీరోలనే చూడాలని ప్రేక్షకులు అనుకోవడం లేదు: రానా

రానా దగ్గుబాటి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద సవాలును తెలిపారు. నిర్మాత నుంచి నటుడిగా ఎందుకు మారారో చెప్పారు.

Updated : 07 Jun 2023 11:20 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా (Rana Daggubati). భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యభరితమైన హీరోగా ఎదిగారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు గురించి తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

‘‘ప్రేక్షకులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. దాని తగినట్లు సినిమాల్లో మార్పులు రావాలి. హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) వంటి నటులు స్టార్‌ హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రేక్షకులు కొత్తగా వచ్చేవారిలో మరో హృతిక్‌ రోషన్‌ను లేదంటే మరో షారుక్‌ ఖాన్‌ను చూడాలని అనుకోవడం లేదు. ఎప్పుడు మీలో ఓ ప్రత్యేకత ఉండాలని వారు అనుకుంటారు. అలా ఉంటే మరోదాని గురించి ఆలోచించే అవకాశమే ఉండదు. ఇక సినీ ఇండస్ట్రీలో ‘బాహుబలి’ (Bahubali) ఓ అద్భుతమని చెప్పాలి. దాని తర్వాత సినిమాని చూసే విధానం మారింది. రానున్న సినిమాలకు అది మార్గాన్ని చూపింది’’ అని అన్నారు.

ఇక తన జీవితంలో ఎదురైన అతి పెద్ద సవాలు గురించి రానా వివరించారు. ‘‘నేను నటుడిని కాక ముందు పెద్ద సవాలును ఎదుర్కొన్నాను. నిర్మాతగా మారాలా.. లేదంటే నటుడిని అవ్వాలా.. అని చాలా ఆలోచించాను. 2005లో మొదటిసారి నిర్మాతగా మారి ‘బొమ్మలాట’ (Bommalata) అనే సినిమాను తీశాను. దానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. కానీ, ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. చిన్న సినిమాలు విడుదలవ్వాలంటే ఎంత కష్టపడాలో అప్పుడే అర్థం చేసుకున్నాను. నాకు నచ్చిన కొన్ని కథలను తెరకెక్కించాలని ఎంతోమంది దర్శకులను, టెక్నిషియన్స్‌ను కలిశాను. కొత్త కథలను తీసుకురావాలంటే సినీ పరిశ్రమలో ఎంతో కష్టమని అర్థం చేసుకున్నాను. అందుకే యాక్టర్‌ని అయ్యాను’’ అని తెలిపారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు