Bheemla Nayak: పవన్‌ ప్రభావం చాలా ఉంది: రానా

ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ‘భీమ్లా నాయక్‌’ తర్వాత మరోలా ఉంటాయని నటుడు రానా అన్నారు.

Updated : 24 Feb 2022 14:20 IST

హైదరాబాద్‌: ఇప్పటివరకూ తాను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ‘భీమ్లా నాయక్‌’ తర్వాత మరోలా ఉంటాయని నటుడు రానా అన్నారు. ఈ సినిమా తర్వాత పవన్‌ ప్రభావం తనపై చాలా ఉంటుందని చెప్పుకొచ్చారు. పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకుడు. బుధవారం జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకలో ఆయన మట్లాడారు. ‘‘ఈ సినిమాతో చాలా మంది మేధావులతో కలిశా. నేను నటుడినై 12 ఏళ్లు అయింది. కానీ, ఇప్పటి వరకూ హీరోను కాలేకపోయాను. నేను చాలా మంది సూపర్‌స్టార్‌తో చేశా. పవన్‌కల్యాణ్ వాళ్లందరికీ భిన్నం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే, కల్యాణ్‌గారి ప్రభావంతో మరొకలా ఉంటాయి. త్రివిక్రమ్‌గారు లేకపోతే ఈ సినిమా లేదు. సినిమాకు అన్ని విధాలా సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. భారతదేశానికి హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మారుస్తామని హామీ ఇస్తున్నాం’’ అని రానా అన్నారు.

‘భీమ్లానాయక్‌’కు వెన్నెముక త్రివిక్రమ్‌

దర్శకుడు సాగర్‌ కె.చంద్ర మాట్లాడుతూ.. ‘‘నల్గొండ నుంచి దర్శకుడు అవుదామని వచ్చా. నిజంగా ఇదొక అద్భుత ఘట్టం. పంజా ఆడియో ఫంక్షన్‌ జరుగుతోంది. పాస్‌ ఉంటే వెళ్దామని ప్రయత్నిస్తే మూడుసార్లు తోసేశారు. ఇప్పుడు అదే పవన్‌కల్యాణ్‌ సినిమాకు దర్శకత్వం వహించి ఇక్కడ మాట్లాడుతున్నా. నా చుట్టూ ఉన్న మంచి వాళ్ల వల్ల ఇది జరిగింది. రానా ఎప్పుడూ అదే ఎనర్జీతో పనిచేస్తారు. నేను మరొకరిలా బతకాలి అని అనుకుంటే అది రానాలాగే. ఈ సినిమాలో నటించి నటీనటులకు ధన్యవాదాలు. నాగవంశీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్రివిక్రమ్‌ ఈ ప్రాజెక్టుకు వెన్నెముక. ఆయన లేకపోతే ‘భీమ్లానాయక్‌’ లేదు. మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. మీకెప్పుడూ నా హృదయంలో గురువు స్థానం ఉంటుంది. పవన్‌కల్యాణ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని అన్నారు.

వేడుకనుద్దేశించి తలసాని మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుకకు రావటం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమ పట్ల సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపుతుంటారు. పరిశ్రమకు సంబంధించి ఏదైనా సమస్య మా దృష్టికి వస్తే వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటారు. సింగిల్‌ విండో, 5వ షో, టికెట్‌ ధరలు.. ఇలా అన్ని విషయాల్లోనూ సానుకూలంగా స్పందించారు. చిత్ర పరిశ్రమ బాగుండాలనేదే మా ఆకాంక్ష. పవన్‌ కల్యాణ్‌కు రోజురోజుకూ క్రేజ్‌ పెరుగుతుందేగానీ తగ్గడంలేదు. జానపద కళాకారులకు  ఆయన అవకాశం ఇవ్వడమనేది అభినందించాల్సిన విషయం. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలి’’ అని ఆకాంక్షించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు మాగంటి గోపీనాథ్‌.

‘‘2017లో అనుకోకుండా సినిమా రంగంలో అడుగుపెట్టా. ‘భీమ్లా నాయక్‌’ చిత్రంతో నటిగా మరోసారి పుట్టాననిపిస్తోంది. ఇలాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించటం నాకెంతో సంతోషంగా ఉంది. లైట్‌బాయ్‌ నుంచి దర్శకనిర్మాతల వరకూ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని కథానాయిక సంయుక్త మేనన్‌ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని