అవకాశం వస్తే.. పాక్‌ చిత్రాల్లోనూ నటిస్తా : స్టార్‌ హీరో

తనకు పాకిస్థాన్‌ చిత్రబృందంతో పనిచేయాలని ఉందని బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్‌(Ranbir Kapoor) అన్నారు. కళకు, కళాకారులకు సరిహద్దులు ఉండవని ఆయన చెప్పారు. 

Updated : 13 Dec 2022 12:41 IST

హైదరాబాద్‌: బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరైన రణబీర్‌ కపూర్‌(Ranbir Kapoor) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల జరిగిన రెడ్‌ సీ ఇంటరన్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(Red Sea International Film Festival)లో పాల్గొని.. వెరైటీ ఇంటర్నేషనల్‌ వాన్‌గార్డ్‌ యాక్టర్‌ అవార్డును(Variety International Vanguard Actor Award) అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సౌదీ అరేబియాలో జరిగిన ఈ కార్యక్రమంలో రణబీర్‌ మీడియాతో మాట్లాడుతూ ఇతర దేశాల నటీనటులతో పనిచేయడమంటే తనకు ఆసక్తి అని చెప్పాడు. అలాగే పాకిస్థాన్‌ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటిస్తారా..? అనే ప్రశ్నకు ‘కళకు, కళాకారులకు సరిహద్దులు ఉండవు. ప్రస్తుతం నేను సౌదీ అరేబియాలో ఉన్నాను. ఈ దేశ పరిశ్రమలతోనూ పనిచేయాలని అనుకుంటున్నాను. కావాలంటే ఇప్పుడే ఓ చిత్రానికి సైన్‌ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అవకాశం ఇస్తే పాకిస్థాన్‌ చిత్రబృందంతో పనిచేయడానికి కూడా నేను ఇష్టపడతాను. సౌదీ వేదికగా మనం సినిమాలు చేయొచ్చు. అక్టోబర్‌లో విడుదలైన ‘ది లెజెండ్‌ ఆఫ్‌ మౌలా జట్‌’(The Legend of Maula Jatt) అనే పాకిస్థాన్‌ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మధ్య కాలంలో బిగ్గెస్ట్‌ హిట్‌లలో ఈ సినిమా ఒకటి.  ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరూ గతంలో భారతీయ చిత్రాల్లోనూ నటించారు’ అని రణబీర్‌ కపూర్‌ అన్నాడు. ఇక ఈ స్టార్‌ యాక్టర్‌ చివరిగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మస్త్ర’లో శివ పాత్రతో మెప్పించాడు. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి యానిమల్‌(Animal) చిత్రంలో నటిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని