Ranga Ranga Vaibhavanga: నమ్మకంగా చెబుతున్నా.. ఆ సీన్స్‌ అదిరిపోతాయ్‌: గిరీశాయ

ఇగో లేకపోతే ఏ బంధమైనా ‘రంగ రంగ వైభవంగా’లా ఉంటుందని దర్శకుడు గిరీశాయ అన్నారు. తాను దర్శకత్వం వహించిన...

Published : 28 Aug 2022 01:27 IST

హైదరాబాద్‌: ఇగో లేకపోతే ఏ బంధమైనా ‘రంగ రంగ వైభవంగా’లా ఉంటుందని దర్శకుడు గిరీశాయ అన్నారు. తాను దర్శకత్వం వహించిన ‘రంగ రంగ వైభవంగా’లో సుమారు 20 సీన్లు అదిరిపోతాయని ఆయన చెప్పుకొచ్చారు. వైష్ణవ్‌ తేజ్‌, కేతికా శర్మ జంటగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ముచ్చటించేందుకు గిరీశాయ, నటీనటులు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

స్క్రీన్‌పై యాక్టింగ్‌తో అదరగొట్టేస్తారు? అలాంటిది ఇంటర్వ్యూల్లో కెమెరా ముందుకు రాగానే ఎందుకు సైలెంట్‌గా ఉంటారు?

వైష్ణవ్ తేజ్‌‌: ఇంటర్వ్యూల్లో మీరు నన్ను చూస్తారు. అదే సినిమాలో అయితే నేను పోషించిన పాత్రను చూస్తారు.

మెగా హీరోతో సినిమా చేయాలనే ఉద్దేశంతో వైష్ణవ్‌ని ఎంపిక చేసుకున్నారా? లేదా మీ కథకు సరిపోతాడని ఎంచుకున్నారా?

గిరీశాయ: నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. తెలుగులో నా తొలి చిత్రం మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్‌తో జరగడం నిజంగానే అదృష్టం. దేవుడిచ్చిన వరం. ‘ఆదిత్య వర్మ’ చేస్తున్నప్పుడు ఓసారి వైష్ణవ్‌ని చూశా. ఆయన నా కథకు సరిపోతారనిపించింది. ఓ ఫ్రెండ్‌ సాయంతో వైష్ణవ్‌ని కలిసి 2020 ఫిబ్రవరిలోనే కథ చెప్పా. కరోనా కారణంగా సినిమా ప్రారంభం కావడం ఆలస్యమైంది.

ఆయన మీ కుటుంబానికి అభిమాని అని కథ చెప్పిన తర్వాతే తెలిసిందా?

వైష్ణవ్ తేజ్‌‌: కథ ప్రారంభించడానికి ముందే తాను చిరంజీవి, పవన్‌కల్యాణ్‌కు పెద్ద అభిమానినని చెప్పారు. షూటింగ్‌లోనూ ఎన్నో విషయాలు పంచుకున్నారు.

గిరీశాయ: పశ్చిమగోదావరి జిల్లాలో మాది ఓ గ్రామం. చిన్నప్పుడు మా ఊర్లో వీధి సినిమాలు వేసేవారు. చిరంజీవి సినిమాలు ప్రదర్శించినప్పుడు మా బ్యాచ్‌ మొత్తానికి ఓ రూల్‌ ఉంటుంది. ఊర్లో ఉన్న పువ్వులన్నీ కోసుకువచ్చి సినిమా ప్లే అవుతున్నప్పుడు విసురుతుండాలి. ‘దొంగ మొగుడు’ సినిమా వేసినప్పుడు.. మరోసారి ప్రదర్శించమని చెప్పి పువ్వులు విసిరాం. 

ఇది మీ మూడో సినిమా. ఇప్పటివరకూ చేసిన ముగ్గురు హీరోల్లో మీరు గమనించిన విషయాలేమిటి?

కేతికాశర్మ: మొదటి హీరో ఆకాశ్‌ పూరీ నాకంటే వయసులో చిన్నవాడు. అతనితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. రెండో సినిమా నాగశౌర్యతో చేశా. ఆయన నాకంటే పెద్దవాడు. మంచి వ్యక్తి. ఇదినా మూడో సినిమా. వైష్ణవ్‌ నాతోటి వాడు. మేమిద్దరం టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంటాం.

సినిమాకి ఈ టైటిల్‌ పెట్టడానికి కారణం ఏమిటి?

గిరీశాయ: కథ రాసిన తర్వాత ఓ సారి నందు అనే ఫ్రెండ్‌ని కలిశా. దీని గురించి చర్చించా. కథ విన్నాక అతను.. ‘ఈ సినిమాకి రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ ఉంటే బాగుంటుందన్నాడు. సినిమా మొదలయ్యాక టైటిల్‌ విషయంలో ఎంతో ఆలోచించాం. చివరికి నా ఫ్రెండ్‌ చెప్పిన టైటిల్‌నే ఫిక్స్‌ చేశా. టైటిల్‌ క్రెడిట్‌ మొత్తం అతనిదే.

ఈ కథ చేయడానికి కారణమేమిటి?

వైష్ణవ్ తేజ్‌‌: ఏ కథనైనా నేను ప్రేక్షకుడిగానే వింటా. ఈ కథ వింటున్నప్పుడు ఓ ప్రేక్షకుడిగా ఆనందించా. కథ బాగా నచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వచ్చి చాలా రోజులైందనిపించింది.

రాధ పాత్ర మీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందనుకోవచ్చా?

కేతికాశర్మ: నేను అలా అనుకోవడం లేదు. కాకపోతే, సినిమాలో ఇష్టమైన వాళ్లు ఏం అడిగినా రాధ ఇచ్చేస్తుంటుంది. నిజ జీవితంలో నేనూ అంతే.

‘‘ఫస్టాఫ్‌లో 10 సీన్స్‌, సెకండాఫ్‌లో 10 సీన్స్‌కు విజిల్స్‌ పడతాయి. కాన్ఫిడెంట్‌గా చెబుతా. ఒక ఫైట్‌ ఉంటుంది. అందులో వైష్ణవ్‌ చెప్పే డైలాగ్‌లకు అందరూ ఆపకుండా విజిల్స్‌ వేస్తారు’’  - గిరీశాయ

షూట్‌ ప్రారంభించినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? వీళ్లిద్దరూ ఎలా చేస్తారా? అని కంగారు పడ్డారా? 

గిరీశాయ: మా సినిమా ప్రారంభమయ్యే సమయానికి ‘ఉప్పెన’ రిలీజ్‌ అయిపోయింది. ఆ సినిమాలో వైష్ణవ్‌ పాత్రకు ఈ సినిమాలో ఆయన రోల్‌కు చాలా తేడా ఉంటుంది. ఫస్ట్‌ డే ఆయనపై ఓ ఫన్నీ సీన్‌ చేశాం. అది షూట్‌ చేసినప్పుడే తెలిసింది ఆయన బ్లడ్‌లో ఓ స్వింగ్‌ ఉంది యాక్షన్‌ చెప్పినప్పుడు అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. కేతిక కూడా డైలాగ్స్‌ బాగా నేర్చుకుంటుంది. హావభావాలు కూడా అడిగి తెలుసుకుంటుంది.

షూట్‌ ఎన్నిరోజులు చేశారు?

గిరీశాయ: 70 రోజులు. హైదరాబాద్‌, వైజాగ్‌, అరకులో చేశాం.

కేతికని ఈ సినిమా కోసం ఎంచుకోవడానికి కారణమేమిటి?

గిరీశాయ: చాలా మంది హీరోయిన్స్‌ని అనుకున్నా కానీ కేతికను చూశాక. ఆమె నా సినిమాలో రాధ పాత్రకు సరిగ్గా సరిపోతుందనిపించింది. ఆమె కళ్లు చాలా బాగుంటాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని