Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్‌ ఉద్వేగం.. వీడియో వైరల్‌

అలనాటి విలక్షణ నటుడు రావు గోపాలరావు(Rao GopalRao), ఆయన కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). అప్పట్లో రావుగోపాలరావు టైమింగ్‌ని...

Updated : 27 Jun 2022 10:58 IST

హైదరాబాద్‌: అలనాటి విలక్షణ నటుడు రావు గోపాలరావు(Rao GopalRao), ఆయన కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). అప్పట్లో ఆయన టైమింగ్‌ని తాను ఇష్టపడ్డానని.. ఇప్పుడు వాళ్లబ్బాయి రావు రమేశ్‌(Rao Ramesh) నటన తనకెంతో నచ్చుతోందని చిరు అన్నారు. ‘పక్కా కమర్షియల్‌’(Pakka Commercial) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా చిరు పాల్గొన్నారు.

‘‘రావుగోపాలరావుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నేను చిన్నమామయ్య అని పిలిచేవాడిని. ఎందుకంటే, మా మామయ్య అల్లు రామలింగయ్య, రావు గోపాలరావులది అన్నదమ్ముల అనుబంధం. ఆయనకూ నేనంటే ఎంతో ప్రేమ. వాళ్లింటి నుంచి తరచూ నా కోసం భోజనం తీసుకువచ్చేవారు. వంకాయ కూరని శ్రీదేవి బుగ్గల్లా, చికెన్‌ని మరొకవిధంగా అన్వయించి చెప్పి.. తినేవరకూ ఊరుకునేవారు కాదు. అత్తయ్య(రావు గోపాలరావు సతీమణి) ప్రత్యేకంగా తులసీచారు చేసి పంపించేవారు. మా మధ్య అంతటి ఆత్మీయత ఉంది. వాళ్ల నాన్న స్ఫూర్తితో రావురమేశ్‌ సినీ రంగంలోకి వచ్చారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ గొప్ప నటుడు అయ్యారు. తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ.. ఉత్తమమైన పాత్రలు వేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. రమేశ్‌.. అత్యున్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. అలాగే నా సినిమాల్లోనూ నటించాలి’’ అని చిరు అన్నారు. చిరు మాటలతో రావురమేశ్‌ ఉద్వేగానికి గురయ్యారు. చిరు కాళ్లకు నమస్కరించి.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.

గోపీచంద్‌(Gopi Chand) హీరోగా నటించిన సరికొత్త ఎంటర్‌టైనర్‌ ‘పక్కా కమర్షియల్‌’(Pakka Commercial). మారుతి (Maruthi) దర్శకుడు. ఫన్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా జులై 1న విడుదల కానుంది. రాశీఖన్నా, సత్యరాజ్‌, రావురమేశ్‌, ప్రవీణ్‌ తదితరులు నటించారు. గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

పక్కా కమర్షియల్‌ ప్రీ రిలీజ్‌ వేడుక.. చిత్రమాలిక



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని