Updated : 03 Jul 2022 07:13 IST

Rashi Khanna: మొహమాటం లేకుండా చెప్పాల్సిందే

కథానాయిక రాశిఖన్నా (Rashi Khanna) జోరు కొనసాగుతోంది. తెలుగుతోపాటు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. గోపీ చంద్‌తో (Gopichand) కలిసి ఆమె నటించిన ‘పక్కా   కమర్షియల్‌’(Pakka Commercial) ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో లాయర్‌ ఝాన్సీగా ఆమె సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా  రాశిఖన్నా శనివారం ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు.

‘‘విడుదల రోజు ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటాన్ని ఇష్టపడతాను. అలా ప్రేక్షకుల స్పందనని స్వయంగా చూడొచ్చు. ‘పక్కా కమర్షియల్‌’నీ తొలి రోజు తొలి ఆటని ప్రేక్షకులతో కలిసి చూశా. అంత మంది ఒకేసారి నవ్వుకుంటుంటే చూడటం మంచి అనుభవాన్నిచ్చింది. లాయర్‌ ఝాన్సీ పాత్రని దర్శకుడు చెప్పినప్పుడే నాకు నచ్చింది. ‘ప్రతీ రోజూ పండగే’లో ఏంజెల్‌ ఆర్ణ పాత్ర చూశాక చాలా మంది ‘ఇలాంటి పూర్తిస్థాయి కామెడీ పాత్రలు చేస్తే బాగుంటుంది’ అన్నారు. ‘పక్కా కమర్షియల్‌’ కోసం దర్శకుడు మారుతి అలాంటి పాత్రనే సిద్ధం చేశారు’’.

 ‘‘లాయర్‌ ఝాన్సీ తన పాత్ర కోసం లా చదివేసినట్టుగా, నేనేమీ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కాలేదు. దర్శకుడు మారుతిపై భరోసాతో సెట్‌కి వెళ్లా. ఆ మేనరిజమ్‌ దగ్గర్నుంచి, సంభాషణల వరకు అన్ని విషయాల్లోనూ ఆయన, మా చిత్రబృందం సాయం చేసింది. అయితే ఝాన్సీలాగా నేను  ప్రతి సినిమా కోసం ముందస్తుగా ఎంతో కొంత సన్నద్ధం అవుతుంటా’’.

‘‘సినిమాలో సంభాషణలు అభ్యంతరకంగా ఉన్నాయనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పేయాల్సిందే.  సెట్లో నేను అలా చాలాసార్లు చెప్పా. కొద్దిమంది దర్శకులు వింటారు, కొందరు వినరు. అయినా నా అభ్యంతరాల్ని నేను వ్యక్తం చేస్తూనే ఉంటా. చాలామంది కథానాయికలు కమర్షియల్‌ హీరోయిన్‌ అనే ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తుంటారు. ఆ గుర్తింపుని నేను తొలి అడుగుల్లోనే సొంతం చేసుకున్నా. ఇప్పుడు నటనకి ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెడుతున్నా. రెండు రకాల పాత్రలు చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్‌ చేసుకోవడం ముఖ్యం. కథానాయికగా ఎనిమిదేళ్ల ప్రయాణం నాది. జీవితాల్లో ఎత్తుపల్లాలు సహజం. నా జీవితంలోనూ ఉన్నాయి. నా కెరీర్‌పరంగా సంతోషంగా ఉన్నా’’.

‘‘పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం... ఖాళీ దొరికితే నేను చేసే పనులు ఇవే. కాకపోతే ఈమధ్య సమయమే దొరకడం లేదు. నాకు చరిత్ర అంటే మక్కువ. అది తెలుసుకునే కథా నాయకుడు కార్తి మొఘలుల చరిత్రకి సంబంధించి ఓ పుస్తకం కానుకగా ఇచ్చారు. అది చదవాలి’’.


‘‘నా మాటలపై ఆమధ్య సామాజిక మాధ్యమాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటిపైన నేను ఇదివరకే ఓ స్పష్టతని ఇచ్చా. మనమంతా మనుషులమే కదా. మాటల్ని అర్థం చేసుకునే విధానంలో ఒకొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. అందుకే నా అభిప్రాయం ఇదీ అంటూ వివరణ ఇచ్చేసరికి అర్థం చేసుకున్నారు. వస్తున్న అవకాశాలు, పాత్రల్ని బట్టి ప్రయాణం సాగుతుంటుంది. హిందీలో వెబ్‌ సిరీస్‌ చేశా. ప్రస్తుతం డబ్బింగ్‌ జరుగుతోంది. ‘యోధ’ సినిమా చేశా.  కార్తీతో చేస్తున్న ‘సర్దార్‌’ దాదాపుగా పూర్తయింది. తెలుగులో కొత్తగా మూడు సినిమాలకి సంతకం చేశా. అవి అధికారికంగా బయటికొస్తాయి. నటిగా చేయడానికి ఇంకా చాలా ఉంది. అసలు సిసలు ప్రయాణం ఇప్పుడే మొదలైనట్టుగా ఉంది’’.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని