Rashikhanna: దయచేసి.. ఆ వార్తలు ఇకనైనా ఆపండి: రాశీఖన్నా

దక్షిణాది చిత్రపరిశ్రమలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, ఇక్కడ తన టాలెంట్‌కు దగ్గ రోల్స్‌ రాలేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి రాశీఖన్నా వ్యాఖ్యలు చేశారని గత కొన్నిరోజుల నుంచి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి...

Published : 06 Apr 2022 14:42 IST

నెటిజన్లను రిక్వెస్ట్‌ చేసిన నటి

హైదరాబాద్‌: దక్షిణాది చిత్రపరిశ్రమలో తాను ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నానని, ఇక్కడ తన టాలెంట్‌కు దగ్గ రోల్స్‌ రాలేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి రాశీఖన్నా వ్యాఖ్యలు చేశారని గత కొన్నిరోజుల నుంచి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో దక్షిణాది సినీ ప్రియులు ఆమెపై గుర్రుగా ఉన్నారు. రాశీఖన్నాకు వ్యతిరేకంగా వరుస పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తన గురించి వస్తోన్న నెగటివ్‌ ప్రచారంపై ఎట్టకేలకు ఆమె పెదవి విప్పారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ‘‘దక్షిణాది చిత్ర పరిశ్రమను దూషిస్తూ నేను వ్యాఖ్యలు చేశానంటూ కొన్ని అసత్య ప్రచారాలు నెట్టింట వైరల్‌గా మారాయి. భాష ఏదైనా సరే.. ప్రతి పరిశ్రమ, నేను చేసే ప్రతి సినిమాపై నాకెంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ ప్రచారాలను ఇకనైనా ఆపండి’’ అని రాశీఖన్నా రాసుకొచ్చారు. ‘మద్రాస్‌ కేఫ్‌’ అనే బాలీవుడ్‌ చిత్రంతోనే రాశీ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా పరాజయం పొందడంతో ఆమె దక్షిణాదివైపు అడుగులేశారు. ఇక్కడ వరుస విజయాలు అందుకుని గ్లామర్‌ డాల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఆమె మరలా బాలీవుడ్‌ చిత్రంలో నటించారు. ‘రుద్ర’ అనే పేరుతో విడుదలైన ఈ సినిమా రాశీకి అక్కడ మంచి మార్కులు పడేలా చేసింది. ‘రుద్ర’ విజయం అనంతరం పలు ఆంగ్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాశీ.. సౌత్‌ ఇండస్ట్రీ గురించి వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని