Rashmika: కిక్కిరిసిన అభిమానుల ఎదుట రష్మిక డ్యాన్స్.. దిష్టి తీసిన విజయ్‌

విజయ్‌-రష్మిక జంటగా నటించిన చిత్రం ‘వారిసు’. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇటీవల ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

Updated : 03 Jan 2023 07:45 IST

చెన్నై: ‘రంజితమే రంజితమే’.. ‘వారిసు’ (Varisu) సినిమాలోని ఈ పాట గత కొంతకాలంగా నెట్టింటిని షేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ పాటకు లైవ్‌లో డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు నటి రష్మిక (Rashmika). జానీతో కలిసి ఆమె చేసిన డ్యాన్స్ చూసి అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అయ్యారు. మరోవైపు నటుడు విజయ్‌ (Vijay) ఆమెను మెచ్చుకొంటూ దిష్టి తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

విజయ్‌ - రష్మిక జంటగా నటించిన చిత్రం ‘వారిసు’. తెలుగులో ఇదే చిత్రాన్ని ‘వారసుడు’ (Vaarasudu) పేరుతో విడుదల చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. ఇటీవల ఈ సినిమా ఆడియో రిలీజ్‌ వేడుక చెన్నైలో వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తాజాగా ‘వారిసు’ ఆడియో ఫుటేజీని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో విజయ్‌ మాట్లాడుతూ సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఆయా నటీనటులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. దిల్‌రాజు మంచి వ్యక్తి అని, దర్శకుడు వంశీ టేక్‌ వెంటనే ఓకే చేయరంటూ సరదాగా నవ్వులు పూయించారు. రష్మిక మంచి నటి అని, తెరపైన బయటా ఒకేలా ఉంటుందని మెచ్చుకుంటూ ఆమెకు దిష్టి తీశారు. అనంతరం అభిమానులను ఉద్దేశిస్తూ.. ఎన్నో ఏళ్ల నుంచి తనను ప్రేమిస్తోన్న అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పారు. అభిమానులను తాను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ‘‘జీవితంలో ఎలాంటి విషయమైనా సరే మీతో మీరే పోటీ పడండి. అలా పోటీ పడినప్పుడే మీరు మరింత వృద్ధి చెందుతారు’’ అంటూ అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు.

ఇదే వేడుకల్లో కొరియోగ్రాఫర్‌ జానీతో కలిసి ‘రంజితమే’ పాటకు రష్మిక స్టెప్పులేసి అలరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘గిల్లి’ తర్వాత నుంచి నేను విజయ్‌కు వీరాభిమానిని అయిపోయాను. ఆయన నటించిన సినిమాలు చూస్తూ ఈలలు వేసి గోల చేసేదాన్ని. ఆయనతో యాక్ట్‌ చేయాలనే నా కల ఈ సినిమాతో తీరింది. సినిమా షూట్‌ జరిగినన్ని రోజులు ఆయన్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నా. సెట్‌లో ఉన్నంతసేపు ఆయన్నే చూస్తూ.. నవ్వుతూ ఉండేదాన్ని. విజయ్‌ సర్‌.. మీతో మళ్లీ సినిమా చేసే అవకాశం వచ్చినా ఇలాగే చూస్తూ ఉండిపోయేలా ఉన్నాను. లైక్‌ యూ సర్‌’’ అని పేర్కొన్నారు. ‘‘విజయ్‌ సినిమాకి మ్యూజిక్‌ అందించాలనే నా కోరిక 27 ఏళ్లకు తీరింది. ఈ క్షణాలను నేను ఎన్నటికీ మర్చిపోను’’ అంటూ సంగీత దర్శకుడు తమన్‌ కన్నీటి పర్యంతమయ్యారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని