Rashmika:‘వారిసు’లో నేను చేయడానికి ఏమీలేదు.. అయినా ఎందుకు ఒప్పుకొన్నానంటే: రష్మిక

Rashmika: విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘వారిసు’తో తన పాత్రకు స్కోప్‌ లేకపోయినా నటించానని రష్మిక అన్నారు.

Published : 22 Jan 2023 01:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ (Vijay) ‘వారిసు’(Vaarisu)లో తన పాత్రకి కేవలం రెండు పాటలు తప్ప.. నటించడానికి ఏమీ లేదని రష్మిక (Rashmika) అంగీకరించారు. విజయ్ కోసమే తాను ఆ స్క్రిప్ట్‌ ఓకే చేసినట్లు స్పష్టం చేశారు. తాజాగా ఓ ఆంగ్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమెను... ‘‘వారిసు’లో మీ పాత్రకు ఎలాంటి స్కోప్‌ లేనప్పటికీ ఎందుకు ఓకే చేశారు?’ అని విలేకరి ప్రశ్నించింది.

‘‘అవును. అయితే, ఈ కథను ఓకే చేయడమనేది పూర్తిగా నా సొంత నిర్ణయం. ఇష్టప్రకారమే దాన్ని ఓకే చేశాను. విజయ్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ సినిమాలో నటించాను. అందులో నా పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని, కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయని నాకు తెలుసు. అయితే ఆ రెండు పాటల్లోనూ అదరగొట్టేయాలనుకున్నాను. ఇదే విషయాన్ని సినిమా షూట్‌లో ఉన్నప్పుడు విజయ్‌ సార్‌ వద్దకు వెళ్లి సరదాగా చెబుతుండేదాన్ని. ‘సినిమాలో నేను చేయడానికి కేవలం పాటలు తప్ప ఏమీ లేదు సర్‌’ అని జోక్స్‌ వేసేదాన్ని. అన్నీ నాకు తెలిసి  చేసినవే. ఒక నటిగా సినిమా సెట్‌కు వెళ్లి, ఇతరులతో కలిసి పని చేయడం ద్వారా వారి నుంచి చిన్న చిన్న విషయాలను కూడా నేర్చుకునేదాన్ని’’ అని రష్మిక వివరించారు. వారిసు తన పాత్రకు పెద్ద స్కోపు లేకపోయినా ‘జిమిక్కి పొన్ను’, ‘రంజితమే’ పాటల్లో రష్మిక అదరగొట్టింది. ‘నాకు నటించేందుకు పెద్దగా అవకాశం లేకపోయినా, ఇందులో భాగస్వామిని కావాలని అనుకున్నా. ఒక నటిగా అన్ని పాత్రలు నేను చేయాలి. అందుకే ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో నటించా. నా వరకూ నేను సంతృప్తిగానే ఉన్నాను’’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వారిసు’. దిల్‌ రాజు నిర్మాత. ఇదే చిత్రాన్ని ‘వారసుడు’ పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక మరోవైపు రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన తొలి బాలీవుడ్‌ మూవీ ‘మిషన్‌ మజ్ను’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో పాటు రణ్‌బీర్‌ కపూర్‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘యానిమల్‌’తో పాటు, అల్లు అర్జున్ (Allu arjun) ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule )లోనూ రష్మిక నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి జరిగే షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని