Rashmika: బాబోయ్‌.. ‘సామి సామి’ స్టెప్‌ ఇక వేయలేను..: రష్మిక

Rashmika: ‘పుష్ప’ సినిమాలోని ‘సామి సామి’ పాటకు సిగ్నేచర్‌ స్టెప్‌ ఇక వేయలేనని కథానాయిక రష్మిక చెప్పుకొచ్చారు.

Updated : 21 Mar 2023 22:04 IST

ముంబయి: అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ (sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రష్మిక (Rashmika Mandanna) కథానాయిక. తెలుగుతో పాటు, హిందీలోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఇక ఈ సినిమాలోని పాటలు మాస్‌ను ఓ ఊపు ఊపేశాయి. బన్ని-రష్మిక ఆడి పాడిన ‘సామి సామి’ పాట అయితే, యువతను విశేషంగా ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లోనూ అనేకమంది కవర్‌సాంగ్స్‌, రీల్స్‌ చేశారు. ఈ సినిమా విడుదలకు ముందూ తర్వాత ఎక్కడకు వెళ్లినా అభిమానులు రష్మికను ‘సామి సామి’ స్టెప్‌ వేయమనేవారు. ఆమె కూడా ప్రతి ఈవెంట్‌లో వేస్తూనే ఉండేవారు. ఇక నుంచి ఆమె ఆ స్టెప్‌ వేయలేరట. తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు.

‘మీతో సామి సామి పాటకు డ్యాన్స్‌ చేయాలనుకుంటున్నా. చేయొచ్చా’ అని ఓ అభిమాని రష్మికను అడిగాడు. ఆ ట్వీట్‌కు రష్మిక బదులిస్తూ.. ‘‘సామి సామి’ స్టెప్‌ను ఇప్పటికే ఎన్నోసార్లు చేశా. ఇది ఇలాగే కొనసాగితే, నేను ముసలిదాన్ని అవగానే నా నడుములో సమస్యలు వస్తాయేమో. ఈ స్టెప్‌ ఎందుకు వేయాలి? మనం కలిసినప్పుడు ఏదైనా కొత్తగా చేద్దాం’’ అని సమాధానం ఇచ్చింది.

‘పుష్ప: ది రైజ్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో దీనికి కొనసాగింపు తెరకెక్కుతున్న ‘పుష్ప: ది రూల్‌’ను మరింత పకడ్బందీగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. ‘పుష్ప2’లో రష్మిక కూడా కనిపించనుంది. ఆమెతో పాటు, ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ, ధనుంజయ పాత్రలు పార్ట్‌2లో కీలకం కానున్నాయి. వీటితో పాటు మరికొన్ని కొత్త పాత్రలు కూడా దర్శనమిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. మరోవైపు రష్మిక ఈ ఏడాది ‘మిషన్‌ మజ్ను’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పుష్ప2’ (Pushpa2) తో పాటు, రణ్‌బీర్‌కపూర్‌, సందీప్‌ వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘యానిమల్‌’ (Animal) చిత్రంలోనూ రష్మిక నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని