Rashmika: ప్రేమ, పెళ్లిపై స్పందించిన రష్మిక

పుష్ప’తో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్న భామ రష్మిక. టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లతో ప్రస్తుతం కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మపై ఎంతోమంది యువత మనసు పారేసుకుంటున్నారు....

Updated : 17 Feb 2022 13:13 IST

కాబోయేవాడి గురించి ఏం చెప్పారంటే..

హైదరాబాద్‌: ‘పుష్ప’తో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్న భామ రష్మిక. టాలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో వరుస ప్రాజెక్ట్‌లతో ప్రస్తుతం కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మపై ఎంతోమంది యువత మనసు పారేసుకుంటున్నారు. పలువురు నెటిజన్లు ఆమెను ఆరాధిస్తూ పోస్టులూ పెడుతున్నారు. ఆమె ఎలాంటి వ్యక్తిని ఇష్టపడుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు.

‘‘ప్రేమను వర్ణించడం కష్టం. ఎందుకంటే అది పూర్తిగా భావోద్వేగాలకు సంబంధించింది. నా దృష్టిలో ప్రేమంటే.. ఒకరికొకరు గౌరవం, సమయాన్ని ఇచ్చిపుచ్చుకోవడం. ఒకరిపై మరొకరికి పూర్తి నమ్మకం ఏర్పడటం. ఈ భావోద్వేగాలన్నీ రెండు వైపుల నుంచి ఉన్నప్పుడే వాళ్ల ప్రేమ విజయం సాధిస్తుంది. కేవలం ఒక వ్యక్తి నుంచే ఉంటే అది ఎలా సక్సెస్‌ అవుతుంది’’ అని ఆమె ప్రశ్నించారు. అనంతరం వివాహంపై స్పందిస్తూ.. ‘‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌? అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే నేను ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదు. ఎందుకంటే, నేనింకా చిన్నపిల్లనే. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, మనం ఎవరితోనైతే సంతోషంగా, సురక్షితంగా ఉంటామో వాళ్లనే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే బాగుంటుంది’’ అని ఆమె తన మనసులోని మాట బయటపెట్టారు.

కన్నడలో తెరకెక్కిన ‘కిర్రాక్‌పార్టీ’తో రష్మిక ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్‌శెట్టితో ఆమెకు నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అనుకోని కారణాల వల్ల వాళ్లిద్దరి మధ్య బ్రేకప్‌ జరగడంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే రష్మిక-విజయ్‌ దేవరకొండతో ప్రేమలో ఉందంటూ.. వాళ్లిద్దరూ ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని