Rashmika: నేను అర్థం చేసుకున్నాను.. ఐశ్వర్యా రాజేశ్‌ మాటలపై స్పందించిన రష్మిక

ఐశ్వర్యా రాజేశ్‌ (Aishwarya Rajesh) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రష్మిక (Rashmika) స్పందించింది. ఐశ్వర్యను తాను అర్థం చేసుకున్నట్లు తెలిపింది.

Published : 19 May 2023 15:07 IST

హైదరాబాద్‌: రష్మికను (Rashmika Mandanna) ఉద్దేశిస్తూ ఐశ్వర్యా రాజేశ్‌ (Aishwarya Rajesh) చేసిన వ్యాఖ్యలు కొన్నిరోజులుగా వైరలవుతోన్న విషయం తెలిసిందే. దీనిపై సోషల్‌ మీడియాలో వీళ్లిద్దరి అభిమానులు తెగ స్పందిస్తున్నారు. ‘పుష్ప’లో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్రపై ఐశ్వర్యా రాజేశ్‌  తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ మాటలపై నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఆమె ఒక ప్రకటన విడుదల చేసింది. 

తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై రష్మిక స్పందిస్తూ ట్వీట్‌ చేసింది. ‘‘మై లవ్‌.. నాకు ఇప్పటి వరకు ఈ విషయం గురించి తెలీదు. నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నువ్వు ఈ విషయంలో ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీపై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవి ఎప్పటికీ ఉంటాయి. తాజాగా విడుదలైన నీ ‘ఫర్హానా’ (Farhana) చిత్రం చాలా బాగుంది. ఆల్‌ ది బెస్ట్‌’’ అని పేర్కొంది.

అసలేం జరిగిందంటే.. ఐశ్వర్యా రాజేశ్‌ నటించిన సరికొత్త చిత్రం ‘ఫర్హానా’ ప్రచారంలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో మాట్లాడుతూ.. ‘పుష్ప’లో రష్మిక, ‘దసరా’లో కీర్తి సురేశ్‌ పోషించిన పాత్రలు తనకు బాగా సెట్‌ అవుతాయని చెప్పింది. అలాంటి పాత్రల్లో నటించాలని ఉందనే తన కోరికను బయటపెట్టింది. ఈ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారాయి. దీనిపై ఐశ్వర్య వివరణ ఇచ్చింది. ‘‘దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ సినిమాలో రష్మిక అభినయాన్ని అవమానించేలా మాట్లాడినట్లు వార్తలు సృష్టించారు. ‘పుష్ప’లో రష్మిక వర్క్‌ నుంచి నేను ప్రేరణ పొందాను. అలాగే నాతోటి నటీనటులపై ఎంతో గౌరవం ఉంది. నా వ్యాఖ్యలకు దురుద్దేశాలను రుద్ది వదంతులు సృష్టించడం మానండి’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని