Ravanasura review: రివ్యూ: రావ‌ణాసుర‌

Ravanasura review: రవితేజ కథానాయకుడిగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘రావణాసుర’ ఎలా ఉందంటే?

Updated : 07 Apr 2023 20:34 IST

Ravanasura review: చిత్రం: రావణాసుర; నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు; కథ, సంభాష‌ణ‌లు: శ్రీకాంత్ విస్సా; సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్; ఎడిటింగ్‌: నవీన్ నూలి; ప్రొడక్షన్ డిజైనింగ్‌: డి.ఆర్. కె. కిరణ్; నిర్మాతలు: అభిషేక్ నామా, రవితేజ; స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ; బ్యానర్‌: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్; విడుద‌ల‌: 07-04-2023

వ‌రుస విజ‌యాల‌తో జోరు ప్రదర్శిస్తున్న క‌థానాయ‌కుడు ర‌వితేజ‌ (Ravi teja). ‘ధ‌మాకా’, ‘వాల్తేరు వీర‌య్య’ త‌ర్వాత ర‌వితేజ చేసిన మ‌రో చిత్రం ‘రావ‌ణాసుర‌’. ఐదుగురు కథానాయిక‌లు... నెగిటివ్ టైటిల్‌తో ఆస‌క్తిని రేకెత్తించింది. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మ‌రిన్ని  అంచ‌నాల్ని పెంచాయి. మ‌రి సినిమా ఎలా ఉంది? (Ravanasura review) ర‌వితేజ విజ‌య ప‌రంప‌ర‌ని కొన‌సాగించే చిత్రం అవుతుందా లేదా?

క‌థేంటంటే: ర‌వీంద్ర అలియాస్ ర‌వి (ర‌వితేజ) ఓ జూనియ‌ర్ లాయ‌ర్‌. క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా పేరు తెచ్చుకున్న క‌న‌క మహాల‌క్ష్మి (ఫ‌రియా అబ్దుల్లా) దగ్గర ప‌నిచేస్తుంటాడు. హారిక (మేఘ ఆకాష్‌) త‌న తండ్రిపై ప‌డిన ఓ హ‌త్య కేసుని వాదించాల‌ని కోరేందుకు క‌న‌క మ‌హాల‌క్ష్మి దగ్గరికి వ‌స్తుంది. ఆమె ససేమిరా ఒప్పుకోన‌ని చెబుతుంది. కానీ, చూడ‌గానే ఆమె అందానికి ఫిదా అయిన ర‌వి... ఎలాగైనా క‌న‌క మహాల‌క్ష్మిని ఒప్పిస్తాన‌ని హారికకి మాట ఇచ్చి రంగంలోకి దిగుతాడు. ఆ కేసు ఒప్పుకొన్నాక ఏం జ‌రిగింది? ఈ కేసుని ఎవ‌రు గెలిచారు? (Ravanasura review) ఇంత‌కీ ఆ హ‌త్య చేసిందెవ‌రనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: నేర నేప‌థ్యంతో కూడిన థ్రిల్లర్‌ ఇది. ఒక‌ప్పుడు ఇలాంటి క‌థ‌లు ప‌రిమిత వ్యయంతో కూడిన సినిమాల్లోనే క‌నిపించేవి. కానీ, ఇప్పుడు వాటి రేంజ్ పెరిగింది. మాస్ హీరోలు కూడా ఇలాంటి క‌థ‌లు చేయ‌డంపై ఆస‌క్తి చూపిస్తున్నారు. ర‌వితేజ ఇలాంటి ఓ నెగిటివ్ టైటిల్‌తోనూ, వ్యతిరేక ఛాయ‌ల‌తో కూడిన ఈ  పాత్రతో సినిమా చేయ‌డమే అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచింది. ఆ ఆస‌క్తికి తగ్గట్టుగానే సినిమా ప్రారంభం అవుతుంది. ఓ దారుణహత్య... దాని వెన‌క ప‌రిశోధ‌న నేప‌థ్యం ప్రేక్షకుడిని వెంట‌నే క‌థ‌లో లీనం చేస్తుంది. నిజానికి ఇలాంటి క‌థ‌ల్లో కామెడీ, పాట‌ల్లాంటివి అంత‌గా అత‌క‌వు. కానీ ఇక్కడ హీరో ర‌వితేజ. ఆయ‌న సినిమా అంటే కొన్ని వాణిజ్యాంశాలు తప్పనిసరి అన్న లెక్కలు అలాగే ఉండిపోయాయి. (Ravanasura review) ర‌వితేజ‌, హైప‌ర్ ఆది, ఫ‌రియా అబ్దుల్లా మ‌ధ్య స‌న్నివేశాలు అందులో భాగ‌మే. అవ‌న్నీ స‌ర‌దా స‌ర‌దాగా సాగుతాయి. హ‌త్య కేసుని ప‌రిశోధించ‌డానికి సీనియ‌ర్ అధికారి హ‌నుమంత‌రావు (జ‌య‌రామ్‌) ఎప్పుడైతే రంగంలోకి దిగుతాడో అప్పటి నుంచి స‌న్నివేశాలు థ్రిల్‌ని పంచడం మొదలు పెడతాయి. మ‌లుపులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. అయితే ఈ సినిమా సాగే ఫార్ములా మాత్రం చాలా సినిమాల్నే గుర్తుకు తెస్తుంది. క‌థానాయ‌కుడు ఏం చేస్తున్నా దాని వెన‌క ఓ కార‌ణం ఉంటుంద‌నీ, అది చివ‌ర్లో ఫ్లాష్‌బ్యాక్‌లో తెలుస్తుంద‌నే ఊహ‌కు తగ్గట్టే సినిమా సాగుతుంది.

అత్యాధునిక సాంకేతిక‌త‌తో ఎలాంటి చిక్కుముడుల్నైనా అవ‌లీల‌ల‌గా ఛేదించి కేసుల్ని ప‌రిశోధిస్తున్న కాలం ఇది. కానీ బోలెడ‌న్ని ఆధారాలు క‌నిపిస్తున్నా ఇందులో హీరో చేయాల‌నుకున్నది చేసేస్తుంటాడు.  సినిమాటిక్ లిబ‌ర్టీ మరీ ఎక్కువ తీసేసుకున్నారు. దర్శకుడు క‌థ‌, క‌థ‌నాల్ని వేగంగా న‌డ‌ప‌డం... ర‌వితేజ న‌ట‌న ప్రేక్షకుడిని అలరిస్తాయి. థ్రిల్లర్‌ సినిమాలు మ‌రీ ఎక్కువ‌గా చూసే ప్రేక్షకుడు లాజిక్‌ల గురించి ఆలోచించొచ్చు కానీ, సామాన్య ప్రేక్షకుడికి క‌థ‌లో మ‌లుపులు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. (Ravanasura review) ప్రొస్థటిక్‌ మేక‌ప్ నేప‌థ్యం బాగున్నా...  ఎక్కువ హత్యల్ని దాని చుట్టూనే మ‌ల‌చ‌డం పెద్దగా కిక్‌ ఇవ్వదు. ఫార్మా మాఫియా చుట్టూ స‌న్నివేశాలు ద్వితీయార్ధానికి కీల‌కం. అయితే ఆ నేప‌థ్యం ప‌రిశోధ‌న‌లో డ్రామాటిక్‌ కాకుండా... ఒకే స‌న్నివేశంతో వెలుగులోకి రావడం కూడా అంత‌గా మెప్పించ‌దు. ఆ త‌ర్వాత స‌న్నివేశాల‌న్నీ  ఊహ‌కు తగ్గట్టే సాగుతుంటాయి. ప‌తాక స‌న్నివేశాల్లో భాగంగా వ‌చ్చే పోరాట ఘ‌ట్టం, అందులో ర‌వితేజ గెట‌ప్ ఆక‌ట్టుకుంటుంది.

ఎవ‌రెలా చేశారంటే: ర‌వితేజ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటాడు. ఆయ‌న పాత్రలో రెండు కోణాలు క‌నిపిస్తాయి. క‌థానాయ‌కుడిగా ఇలాంటి పాత్రతో కొత్త ప్రయత్నం  చేశార‌నుకోవ‌చ్చు.  ఇక పోరాట ఘ‌ట్టాలు, పాట‌ల్లో ఎప్పట్లాగే ఆయ‌న‌దైన  హుషారు క‌నిపిస్తుంది. తెరపైన ఐదుగురు హీరోయిన్లు క‌నిపిస్తారు. (Ravanasura review) అందులో  ఫ‌రియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ ప్రథమార్ధంపై బ‌లంగా ప్రభావం చూపిస్తారు. అనుఇమ్మాన్యుయేల్‌ చిన్న పాత్రలో క‌నిపిస్తారు. సాకేత్ పాత్రలో సుశాంత్, జాను పాత్రలో ద‌క్ష చాలా స‌న్నివేశాల్లోనే క‌నిపిస్తారు. కానీ ఆ పాత్రల్లో బ‌లం లేదు.  పూజిత పొన్నాడ, రావు ర‌మేష్‌, ముర‌ళీశర్మ, జ‌య‌ప్రకాష్ త‌దిత‌రులు చిన్న పాత్రల్లో కనిపించారంతే. ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా జ‌య‌రాం ప‌రిధి మేర‌కు న‌టించారు. ఈ సినిమాలో  హీరోకి బ‌లంగా స‌వాల్‌ని విసిరే పాత్రలు లేక‌పోవ‌డం మైన‌స్.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కెమెరా, సంగీతం విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. ముఖ్యంగా నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ద్వితీయార్ధంలో ఒక థ్రిల్లర్ సినిమాకి త‌గ్గ వేగం క‌నిపించ‌దు. శ్రీకాంత్ విస్సా ర‌చ‌యిత‌గా క‌థ‌, మాట‌ల‌పై ప్రభావం చూపించారు. (Ravanasura review)  దర్శకుడు సుధీర్ వ‌ర్మపై ర‌వితేజ మాస్ ఇమేజే ఎక్కువ‌గా ప్రభావం చూపించిన‌ట్టు అనిపిస్తుంది. స‌హ‌జంగా ఆయ‌న సినిమాల్లో క‌నిపించే క‌థనానికి బ‌దులుగా ఇందులో  మాస్ అంశాలే ఎక్కువ‌గా ప్రభావం చూపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బ‌లాలు: + ర‌వితేజ న‌ట‌న; + క‌థ‌లో మ‌లుపులు; + ప్రథమార్ధం

బ‌ల‌హీన‌త‌లు: - ఊహ‌కు తగ్గట్టు సాగే స‌న్నివేశాలు; - బ‌ల‌మైన విల‌నిజం లేక‌పోవ‌డం

చివ‌రిగా: రావ‌ణాసుర.. అక్కడక్కడా థ్రిల్‌ని పంచుతాడు (Ravanasura review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని