‘కేజీయఫ్‌2’లో నా పాత్ర అలా ఉంటుంది: రవీనా

‘కేజీయఫ్‌2’లో తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ప్రశాంత్‌ నీల్‌ కథ చెప్పిన వెంటనే ఆ సన్నివేశాలన్నీ తన ముందు కదలాడాయని

Published : 08 Jan 2021 11:44 IST

‘కేజీయఫ్‌2’లో తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ప్రశాంత్‌ నీల్‌ కథ చెప్పిన వెంటనే ఆ సన్నివేశాలన్నీ తన ముందు కదలాడాయని బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ అన్నారు. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కేజీయఫ్‌2’. సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావురమేశ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రమికా సేన్‌ పాత్రలో రవీనా టాండన్‌ కనిపించనుంది. ఈ నేపథ్యంలో ‘కేజీయఫ్‌2’ గురించి పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

యశ్‌తో తొలిసారి పనిచేయడం ఎలా  అనిపించింది?

రవీనా టాండన్‌: మాటల్లో చెప్పలేను. యశ్‌ మంచి వ్యక్తి మాత్రమే కాదు, ప్రతిభావంతుడు. చక్కని నటుడు. అతనితో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను.

‘కేజీయఫ్‌2’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

రవీనా టాండన్‌: ఇందులో నాది పవర్‌ఫుల్‌ పాత్ర. రమికాసేన్‌గా కనిపిస్తా. దర్శకుడు ఈ పాత్రను కాస్త వైవిధ్యంగా  తీర్చిదిద్దారు. ఒక సన్నివేశంలో ప్రవర్తించినట్లు మరో సన్నివేశాల్లో ఉండదు. రమికాసేన్‌ ఎందకలా చేస్తోందో ఎవరూ ఊహించలేరు కూడా. అంతకు మించి నేనేమీ చెప్పలేను.

అభిమానుల నుంచి ఏమైనా సందేశాలు వచ్చాయా?

రవీనా టాండన్‌: ‘కేజీయఫ్‌2’ కోసం సినీ అభిమానులు ఎలా ఎదురు చూస్తున్నారో.. నా అభిమానులు కూడా అలాగే చూస్తున్నారు. నేను ఈ సినిమాలో నటిస్తున్నానని చెప్పినప్పటి నుంచి ఆ ఆసక్తి ఇంకా ఎక్కువైంది.  నా అభిమానుల మనస్సుల్లో నిలిచిపోయే పాత్ర అవుతుంది.

మీరు కూడా యాక్షన్‌ సన్నివేశాలు చేశారని టాక్‌ నిజమేనా?

రవీనా టాండన్‌: కాస్త ఆగండి... (నవ్వుతూ)! ఇంకొన్నాళ్లు ఓపిక పడితే, స్క్రీన్‌పై చూడొచ్చు.

‘కేజీయఫ్‌2’లో రమికాసేన్‌ పాత్ర కోసం ప్రశాంత్‌ నీల్‌ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమనిపించింది.

రవీనా టాండన్‌: ప్రశాంత్‌ నీల్‌ వచ్చి కథ చెప్పగానే నాకు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. అప్పటివరకూ నేను ‘కేజీయఫ్‌:  చాప్టర్‌1’ చూడలేదు. చూసిన తర్వాత ఇంత అద్భుతంగా ఎలా తీశారా? అనిపించింది. ఆయన కథ చెప్పిన తీరు, చాప్టర్‌2లో నా పాత్ర అన్నీ వరుసగా కళ్ల ముందు కదిలాయి. ఈ సినిమాకు నో చెప్పడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించలేదు. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశాను.

ప్రశాంత్‌ నీల్‌, హోంబలే ఫిల్మ్స్ తో పనిచేయడం మీకెలా అనిపించింది?

రవీనా టాండన్‌: ప్రశాంత్‌ పనిచేసే తీరు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. పైకి నెమ్మదస్తుడిగా కనిపించినా, ఆయనలో ఆలోచనల ప్రవాహం సాగుతూ ఉంటుంది. సినిమాకు సంబంధించి ఆయన కనే కలలు, ఆలోచనలు.. సామాన్యులకు  కూడా అందవు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని