Ravi Kishan: నేనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నా: ‘రేసు గుర్రం’ నటుడు

కెరీర్‌ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై స్పందించారు బాలీవుడ్‌ నటుడు రవి కిషన్‌ (Ravi Kishan). తానూ క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు చెప్పారు. 

Published : 27 Mar 2023 16:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెరీర్‌ తొలినాళ్లలో తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ షాకింగ్‌ ఆరోపణలు చేశారు నటుడు, భాజపా నేత రవి కిషన్‌ (Ravi Kishan). గతంలో ఓ మహిళ తనని ఇబ్బందిపెట్టాలని చూసిందని, ప్రస్తుతం ఆమెకు సమాజంలో పేరు, పలుకుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన నగ్మాతో రిలేషన్‌ గురించీ స్పందించారు.

‘‘ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను. ఇబ్బందికర పరిస్థితులు చవి చూశాను. క్యాస్టింగ్‌ కౌచ్‌ పరిస్థితులు సినీ పరిశ్రమలో సాధారణం. నేనూ అలాంటి పరిస్థితినే చూశా. ఒకానొక సమయంలో ఓ మహిళ నా వద్దకు వచ్చి ‘ఈ రాత్రి మనం కాఫీకి వెళ్దాం’ అని అడిగింది. నాకెందుకో అనుమానం వచ్చి.. సున్నితంగా తిరస్కరించా. అయితే, ఆమె ఎవరూ అనేది నేనిప్పుడు చెప్పను. ఎందుకంటే ప్రస్తుతం ఆమెకు సోసైటీలో ఎంతో పేరు ఉంది’’ అని రవికిషన్‌ వివరించారు. అనంతరం నగ్మాతో తాను రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో వచ్చిన వార్తలపై స్పందించారు. ‘‘నటీనటులు కలిసి వరుసగా కొన్ని సినిమాల్లో నటిస్తే వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తుంటాయి. వాస్తవానికి అవన్నీ ప్రచారాలు మాత్రమే. మేము కలిసి నటించిన చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ కావడంతో మళ్లీ మా కాంబో రిపీట్ అవుతూ వచ్చింది. మేమిద్దరం స్నేహితులం. మా మధ్య మంచి అనుబంధం ఉందంతే. అలాగే, అందరికీ తెలుసు మేమిద్దరం కలిసి సినిమాలు చేసేటప్పటికే నాకు వివాహమైందని’’ అని ఆయన వెల్లడించారు. బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలోనూ సినిమాలు చేసిన ఆయన.. ‘రేసుగుర్రం’తో  తెలుగువారికి పరిచయమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని