Dhamaka: మరోసారి ట్రెండ్‌ అవుతున్న ‘పల్సర్‌ బైక్‌’ పాట..

రవితేజ, శ్రీలీల నటించిన సినిమా ‘ధమాకా’ (Dhamaka). ఇందులోని పల్సర్‌ బైక్‌ పాట 100 మిలియన్ల వ్యూవ్స్‌ను సొంతం చేసుకుంది. 

Published : 26 May 2023 16:14 IST

హైదరాబాద్‌: గతేడాది చివర్లో ‘ధమాకా’తో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు మాస్‌ హీరో రవితేజ. ఆ సినిమాతో మాస్‌ ప్రేక్షకులను అలరించి భారీ కలెక్షన్లను సొంతం చేసుకున్నారు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన సంగీతం హైలైట్‌గా నిలిచింది. సినిమా విడుదలైనప్పుడే కాదు నేటికీ ఈ సినిమాలోని పాటలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. తాజాగా మరోసారి ఇందులోని పల్సర్‌ బైక్‌ పాట నెట్టింట టాప్‌లో నిలిచింది.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పల్సర్‌ బైక్‌ పాటను రీమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. రవితేజ, శ్రీలీల (Sreeleela) ఈ పాటకు వేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ పాటకు 100మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ఈ విషయంపై ఆనందాన్ని తెలుపుతూ మూవీ టీం ట్వీట్‌ చేసింది. దీంతో మరోసారి సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో ఆ పాట టాప్‌లో నిలిచింది. ప్రస్తుతం రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో (Tiger Nageswara Rao) నటిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్టూవర్ట్‌పురం దొంగగా పోలీస్‌ రికార్డులకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నటి రేణూ దేశాయ్‌ (Renu Desai) హేమలతా లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో నటిస్తున్నారు. రవితేజ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమాగా రానున్న ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని