
Raviteja: అయ్యో.. రవితేజకి హిట్ క్యారెక్టర్ మిస్సయిందే!
ఇంటర్నెట్ డెస్క్: తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. టైం లూప్ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో పాత్రతోపాటు పోలీసు ఆఫీసర్ ‘ డీసీపీ ధనుష్కోటి’ పాత్ర కూడా ఎంతో కీలకం. ఈ పాత్రను నటుడు, దర్శకుడు ఎస్.జె సూర్య పోషించారు. ఈ చిత్రంలో హీరో కంటే ‘ధనుష్కోటి’ పాత్ర బాగా హిట్ అయింది. దీంతో ఎస్.జె. సూర్యకి మంచి పేరొచ్చింది. నిజానికి ‘ధనుష్కోటి’ పాత్ర కోసం చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు మొదట టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజను సంప్రదించారట. గతంలో రవితేజ పలు తెలుగు సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించడం.. అవన్నీ హిట్ కొట్టడంతో ఆ పాత్రకు చక్కగా సరిపోతారని దర్శకుడు భావించి సంప్రదింపులు జరిపారు. రవితేజకి కథ కూడా బాగా నచ్చిందట. కానీ.. షూటింగ్ డేట్స్ కుదరకపోవడంతో ఆయన ఈ సినిమాలో నటించలేకపోయారు. అలా రవితేజకు ఒక తమిళ బ్లాక్బ్లాస్టర్ హిట్ చిత్రంలో నటించే అవకాశం చేజారింది. అయితే, ‘మానాడు’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తే ధనుష్కోటి పాత్రలో నటించేందుకు రవితేజ ఆసక్తి కనబర్చినట్లు సమాచారం.
రవితేజ డేట్స్ కుదరకపోవడంతో వెంకట్ ప్రభు.. ఆ పాత్రకి అరవింద్ స్వామిని తీసుకోవాలనుకున్నారు. కథ వినగానే ఆయన కూడా నటించేందుకు ఒప్పుకున్నారట. కానీ, సెట్స్ మీదకు వెళ్లే సమయానికి అరవింద్ స్వామి ఇతర సినిమాలతో బిజీగా ఉండటం.. కొన్ని పాత్రల కోసం ఆయన వేషధారణ మారిపోవడంతో కుదరలేదు. ఆఖరికి ఎస్.జె సూర్య నటించి.. ఆ పాత్రకు న్యాయం చేశారని వెంకట్ ప్రభు వెల్లడించారు.