Ramarao On Duty Review: రివ్యూ: రామారావు ఆన్ డ్యూటీ

రవితేజ నటించిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ఎలా ఉందంటే..?

Updated : 29 Jul 2022 14:26 IST

Ramarao On Duty review: చిత్రం: రామారావు ఆన్‌ డ్యూటీ; నటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సార్‌పట్ట’ ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు; సంగీతం: సామ్ సీఎస్‌; ఛాయాగ్రహ‌ణం: సత్యన్ సూర్యన్; కూర్పు: ప్రవీణ్ కెఎల్; క‌ళ‌: సాహిసురేష్; నిర్మాత: సుధాకర్ చెరుకూరి; నిర్మాణ సంస్థలు: ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీమ్‌వర్క్స్; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ; విడుద‌ల తేదీ‌: 29-07-2022

మాస్ హీరో సినిమా విడుద‌ల‌వుతోందంటే చాలు చిత్ర ప‌రిశ్రమ బోలెడ‌న్ని ఆశ‌ల‌తో బాక్సాఫీస్‌ వైపు చూస్తోంది. మునుప‌టిలా థియేట‌ర్ నిండుతుందా?ఎప్పట్లా సంద‌డి క‌నిపించేనా అని! ప్రేక్షకుల్ని ఇదివ‌ర‌క‌టిలా ఉత్సాహంగా థియేట‌ర్‌కి తీసుకొచ్చే సినిమాల్లేక, రాక కొన్నాళ్లుగా బాక్సాఫీసు క‌ళ త‌ప్పింది‌! ఈ వారం మాస్ హీరో ర‌వితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుద‌లైంది. ప్రచార చిత్రాలు ఆస‌క్తిని రేకెత్తించాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది?రవితేజ ప్రభుత్వ అధికారిగా ఏం చేశారు?

క‌థేంటంటే: రామారావు (ర‌వితేజ‌) ఓ డిప్యూటీ క‌లెక్టర్‌. నిజాయ‌తీగా విధులు నిర్వర్తిస్తాడ‌ని పేరు. అనుకోకుండా త‌న సొంత ఊరికి బదిలీ అవుతాడు. చిత్తూరు జిల్లాల్లోని ఆ ఊరిని కేంద్రంగా చేసుకుని ఎర్రచంద‌నం మాఫియా అక్రమాలకి పాల్పడుతుంటుంది. చిన్నప్పట్నుంచి త‌నతో క‌లిసి చ‌దువుకున్న మాలిని (ర‌జీషా విజ‌య‌న్‌) క‌ష్టంలో ఉంద‌ని తెలుసుకుని రామారావు ఆమె దగ్గరికి వెళ‌తాడు. ఆమె భ‌ర్త మిస్సింగ్ అని, అత‌న్ని వెతక‌డం కోసం వెళ్లిన మావ‌య్య కూడా ప్రమాదంలో మ‌ర‌ణించాడ‌ని తెలుసుకుంటాడు. ఆమెకి సాయం చేయాల‌ని రంగంలోకి దిగుతాడు రామారావు. ఈ క్రమంలో ఎర్రచంద‌నం మాఫియా వెలుగులోకి వ‌స్తుంది. మాలిని భ‌ర్తలాగే, ఆ ఊరికి చెందిన మ‌రో 20 మంది పేద‌ల్ని ఆ మాఫియా బ‌లి తీసుకుంద‌ని ప‌సిగ‌డ‌తాడు.  మ‌రి ఆ మాఫియాని రామారావు ఎలా బ‌య‌టికి లాగాడు? ఆ క్రమంలో ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయనేదే సినిమా.

ఎలా ఉందంటే: 1990 ద‌శ‌కంలో సాగే ఓ ప‌రిశోధ‌నాత్మక క‌థ ఇది. కాలం ఏదైనా కావొచ్చు కానీ,  ఇలాంటి నేర నేప‌థ్యంతో కూడిన క‌థ‌ల్లో ఓ వేగం క‌నిపించాలి. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త రేకెత్తాలి. ఈ రెండూ మిస్ అయిన సినిమా ఇది. ఇక్కడ కథానాయ‌కుడు ర‌వితేజ కాబ‌ట్టి ఆయ‌న శైలి, మాస్ అంశాల‌కి సంబంధించిన లెక్కలు చూసుకుంటూ ఈ క‌థ‌ని న‌డిపిన‌ట్టు అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి క‌థ‌ల్ని మాస్ హీరోలతో ప‌క్కాగా తీస్తే ఆ ఫ‌లితం, ప్రేక్షకుల్లో క‌లిగే ఆ అనుభూతి వేరుగా ఉంటాయి. కానీ, ద‌ర్శకుడు హీరో ఇమేజ్‌నీ, వాస్తవిక‌త‌తో కూడిన ఈ క‌థ‌నీ బ్యాలెన్స్ చేయ‌లేక‌పోయాడు. హీరోయిజం ఎపిసోడ్‌తో క‌థ‌ని మొద‌లుపెట్టాడు ద‌ర్శకుడు. ప్రథ‌మార్ధంలో కుటుంబ నేప‌థ్యం, మాలినితో ప్రేమ‌, ఆమె పెళ్లి త‌దిత‌ర స‌న్నివేశాల‌తో సినిమా అస‌లు క‌థ‌లోకి వెళ్లడానికి చాలా స‌మ‌యం తీసుకుంటుంది. రాహుల్ రామ‌కృష్ణ ఎపిసోడ్ త‌ర్వాతే క‌థలో సీరియ‌స్‌నెస్ క‌నిపిస్తుంది. ద్వితీయార్ధంలో అస‌లు నిందితుల్ని ఎలా బ‌య‌టికి తీసుకొచ్చాడు? ఆ స‌న్నివేశాలు ఎంత ఆస‌క్తిక‌రంగా ఉన్నాయ‌న్నదే సినిమాకి కీల‌కం. ఆ విష‌యంలో ద‌ర్శకుడు అక్కడక్కడా త‌న ప్రభావం చూపించారు కానీ, అవి సినిమాకి స‌రిపోలేదు. సినిమాలో సంభాష‌ణ‌లు ఎక్కువ‌గా వినిపిస్తాయే త‌ప్ప‌, క‌థ క‌థ‌నాలు మాత్రం ఎంత‌కీ ముందుకు సాగుతున్నట్టు అనిపించ‌దు. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ స‌న్నివేశాలు మెప్పిస్తాయి. క‌థ‌ని ముగించిన తీరు దీనికి సీక్వెల్ కూడా ఉంద‌నే సంకేతాల్ని పంపుతుంది.

ఎవ‌రెలా చేశారంటే: ర‌వితేజ, వేణు త‌ప్ప మిగ‌తా ఎవ్వరికీ ఇందులో బ‌ల‌మైన పాత్రలు లేవు. ప‌క్కా మాస్ క‌థ‌ల్లోలాగా కాకుండా ఇందులో రవితేజ ఒక ప్రభుత్వాధికారి కావ‌డంతో అందుకు త‌గ్గట్టుగానే క‌నిపించాల్సి వ‌చ్చింది. దాంతో ఆయ‌న న‌ట‌న‌లో హుషారు త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. ఆయ‌న చేసిన పోరాట ఘ‌ట్టాలు ఆక‌ట్టుకుంటాయి. సీఐ జ‌మ్మి ముర‌ళిగా వేణు సంద‌డి చేశారు. కానీ, ఆయ‌నకి డ‌బ్బింగే అంత‌గా అత‌క‌లేదు. క‌థానాయిక ర‌జీషా విజ‌య‌న్‌, దివ్యాంశ కౌశిక్ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో క‌నిపిస్తారు. న‌రేశ్‌, నాజ‌ర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ప‌విత్ర లోకేశ్‌, పృథ్వీ, శ్రీ, అర‌వింద్ కృష్ణ‌... ఇలా ప‌లువురు న‌టులు క‌నిపించినా ఏ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉండ‌దు. స‌త్యన్ సూర్యన్ కెమెరా ప్రభావం చూపించింది. స్వత‌హాగా ర‌చ‌యిత అయిన ద‌ర్శకుడు శరత్‌ మండ‌వ ఎక్కువ సంభాష‌ణ‌లైతే రాసుకున్నారు కానీ, క‌థ‌ని న‌డిపిన విధానం మాత్రం మెప్పించ‌దు. నిర్మాణం బాగుంది.

బ‌లాలు
+
ద్వితీయార్ధం
+ పోరాట ఘ‌ట్టాలు

బ‌ల‌హీన‌త‌లు
-
క‌థ‌, క‌థ‌నం
బ‌లంగా లేని పాత్రలు

చివ‌రిగా: రామారావు డ్యూటీ చేశాడు కానీ..!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని