RDX Movie Review: రివ్యూ: ఆర్‌డీఎక్స్‌.. మలయాళంలో రూ.80 కోట్లు వసూలు చేసిన మూవీ ఓటీటీలో వచ్చేసింది!

RDX Movie Review in telugu: మలయాళంలో విడుదలై బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన ‘ఆర్‌డీఎక్స్‌’ ఓటీటీలో వచ్చేసింది. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది?

Updated : 25 Sep 2023 16:18 IST

RDX Movie Review in telugu; చిత్రం: ఆర్‌డీఎక్స్‌; నటీనటులు: షానీ నిగమ్‌, ఆంటోనీ వర్గీస్‌, నీరజ్‌ మాధవ్‌, లాల్‌, బాబు ఆంటోనీ, మహిమా నంబియార్‌, మలాల్‌ పార్వతి, బిజు తదితరులు; సంగీతం: శ్యామ్‌ సి.ఎస్‌.; సినిమాటోగ్రఫీ: అలెక్స్‌ జె.పులికల్‌; ఎడిటింగ్‌: చమన్‌ ఛాకో; నిర్మాత: సోఫియా పాల్‌; స్క్రీన్‌ప్లే: ఆదర్శ్‌ సుకుమారన్‌, సుభాష్‌ రషీద్‌; కథ, దర్శకత్వం: నిహాస్‌ హిదయనాథ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

రికొత్త కథలతో ప్రయోగాత్మక సినిమాలను తీయడమే కాదు, అప్పుడప్పుడు మాస్‌ కమర్షియల్స్‌తోనూ అలరిస్తుంటుంది మలయాళ చిత్ర పరిశ్రమ. ఇటీవల అక్కడి యువతను విశేషంగా ఆకట్టుకున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆర్‌డీఎక్స్‌: రాబర్ట్‌, డానీ, జేవియర్‌’. ఓనం పండగ సందర్భంగా కేరళలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.80కోట్లకు పైగా వసూళ్లను సాధించి, మాలీవుడ్‌ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్‌-5లో ఒకటిగా నిలిచింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. (RDX Movie Review in telugu)

కథేంటంటే: కొచ్చిలో ఏటా కార్నివాల్‌ జరుగుతుంటుంది. స్థానికంగా ఉండే ప్రజలందరూ వచ్చి చర్చిలో ప్రార్థనలు జరిపి, సంబరాల్లో పాల్గొంటారు. ఈ కార్నివాల్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించే బాధ్యత అక్కడ సామిల్‌ ఓనర్‌ అయిన ఫిలిప్‌ (లాల్‌)ది. కార్నివాల్‌లో భాగంగా సంగీత కచేరీ జరుగుతుండగా, ఇద్దరు ఆగంతకులు వచ్చి నానా హంగామా చేస్తారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ డ్యాన్స్‌ చేయమంటూ బలవంత పెట్టడంతో ఫిలిప్‌, ఆంటోనీ మాస్టర్‌ (బాబూ ఆంటోనీ)లు వారిని వద్దని వారిస్తారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు ఆగంతకులకు తోడు మరో నలుగురైదుగురు వచ్చి గొడవ పడతారు. తన తండ్రి ఫిలిప్‌తో కొందరు గొడవ పడటాన్ని గమనించిన డానీ (ఆంటోనీ వర్ఘీస్‌) అక్కడికి వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే, వాళ్లు అవేమీ పట్టించుకోకుండా ఫిలిప్‌ను తోసేయడంతో డానీ కోపంతో వాళ్లను చితక్కొడతాడు. దీంతో ఆ ఆగంతకులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి వారంతా ముసుగులు వేసుకొచ్చి డానీ, అతడి కుటుంబాన్ని తీవ్రంగా కొట్టి గాయపరుస్తారు. ఇంతకీ డానీ కుటుంబంపై దాడి చేసింది ఎవరు?కేవలం ఈ కార్నివాల్‌లో జరిగిన గొడవ కారణంగానే దాడి చేశారా? లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? త‌న కుటుంబంపై దాడి జ‌రిగిన విషయం తెలిసిన ఫిలిప్ మ‌రో కొడుకు రాబ‌ర్ట్ (షేన్ నిగ‌మ్‌) కొచ్చికి తిరిగి వచ్చి ఏం చేశాడు? తన అన్న డానీ, ప్రాణ స్నేహితుడు జేవియ‌ర్‌ (నీర‌జ్ మాధ‌వ్‌)తో క‌లిసి ఆ గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉంది: రాబర్ట్‌(R), డానీ(D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ‘ఆర్‌డీఎక్స్‌’. సాధారణంగా ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో సినిమాలంటే లవ్‌, ఎమోషన్స్‌, ఫ్యామిలీ, కామెడీ ఇలా పలు అంశాలు మేళవించి ఉంటాయి. ఇవే పెట్టి తీస్తే, ‘ఆర్‌డీఎక్స్‌’ కూడా ఒక రొటీన్‌ సినిమా అయిపోయేది. ఈ కథకు మార్షల్‌ ఆర్ట్స్‌ అనే మరో పార్శ్వాన్ని జోడించి, యువతను ఆకట్టుకునేలా యాక్షన్‌ సీన్స్‌ను తీర్చిదిద్దడంలో దర్శకుడు నహస్‌ హిదయత్‌ విజయం సాధించాడు. కథ కొత్తది కాకపోయినా, దానిని ప్రజెంట్‌ చేసిన విధానం కాస్త డిఫరెంట్‌గా ఉంది. (RDX Movie Review in telugu) డానీ కుటుంబాన్ని పరిచయం చేస్తూ వారిపై దాడి సంఘటనతో త్వరగానే కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. ఇంతకీ దాడి చేసిన వాళ్లు ఎవరు? అనే విచారించే క్రమంలో ఫ్లాష్‌ బ్యాక్‌ మొదలు పెట్టాడు. చదువులు పూర్తి చేసుకుని, ఉద్యోగ ప్రయత్నం చేయకుండా మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుంటున్న ముగ్గురు స్నేహితుల కథకు కాస్త కామెడీ, ఇంకాస్త ప్రేమ జోడించడంతో పాటు, యువతను ఆకట్టుకునే మాస్‌ మసాలా అంశాలైన యాక్షన్‌ మోడ్‌ను కాస్త బాగానే దట్టించాడు. ఫ్లాష్‌ బ్యాక్‌లో రాబర్ట్‌ ప్రేమకథ కాస్త సాగదీసినట్లు అనిపించినా, విరామ సన్నివేశాల ముందు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ చూస్తే గూస్‌బంప్స్‌ ఖాయం. ఈ గొడవ తర్వాత ఫిలిప్‌ తన కొడుకు రాబర్ట్‌ను బెంగళూరు పంపించేయడంతో కథ మళ్లీ వర్తమానానికి వస్తుంది. ఇక్కడి నుంచి స్నేహితులతో కలిసి డానీ కుటుంబంపై దాడి చేసిన వారిని కనిపెట్టడం, వారిని తాట తీయడం, ఇలా ప్రతి సీన్‌ హైపిచ్‌లో వెళ్తూ ఉంటుంది. ప్రీక్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌. నాన్‌చాక్‌తో ఆంటోనీ మాస్టర్‌ రంగంలోకి దిగి చేసే ఫైట్‌ ఒళ్లుగగురుపొడుస్తుంది.

ఎవరెలా చేశారంటే:  రాబర్ట్‌, డానీ, జేవియర్‌ పాత్రల్లో షేన్‌ నిగమ్‌, ఆంటోనీ వర్ఘీస్‌, నీరజ్‌ మాధవ్‌ ఒదిగిపోయారు. మూడు పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఇచ్చాడు దర్శకుడు. వాళ్లు కూడా తమ పాత్రల్లో అంతే లీనమై నటించారు. ముఖ్యంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో ముగ్గురూ అదరగొట్టారు. ఒకరు బాక్సింగ్‌, మరొకరు కరాటే, ఇంకొకరు నాన్‌చాక్‌తో చేసిన విన్యాసాలు థియేటర్‌లో అయితే, విజిల్స్‌ వేయించి ఉంటాయి. (RDX Movie Review in telugu) అదే సమయంలో భావోద్వేగాలపరంగా మూడు పాత్రలకు మంచి మార్కులు పడతాయి. కథానాయికల పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. మిగిలిన వాళ్లు పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా సినిమా ఎలా ఉంది: టెక్నికల్‌గా ‘RDX’ ఓ డిఫరెంట్‌ బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేసిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌. కేజీయఫ్ స్టంట్ మాస్ట‌ర్స్ అన్బుఅరివు డిజైన్ చేసిన యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ సినిమాకే హైలైట్‌. (RDX Movie Review in telugu) విరామానికి ముందు కార్నివాల్‌లో జరిగే యాక్ష‌న్ ఎపిసోడ్‌, విల‌న్‌ను ఫాలో అవుతూ త‌మ‌కు తెలియ‌కుండా అత‌డి ఉచ్చులో హీరోలు ఇద్ద‌రు చిక్కుకోవ‌డం, వారిని జేవియ‌ర్ రక్షించే ప్రీ క్లైమాక్స్ యాక్ష‌న్ సీక్వెన్స్‌తో పాటు చివరిలో ఆంటోనీ మాస్టర్‌ రంగంలోకి దిగి చేసే యాక్షన్‌ అదుర్స్‌.  ఇలాంటి సీన్స్‌ వెండితెరపై చూస్తే వచ్చే మజానే వేరు.

సంగీతం: శ్యామ్‌ సి.ఎస్‌. నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఎలివేట్‌ అవ్వడానికి అదే కారణం. ‘అఖండ’కు తమన్‌ ఏ స్థాయిలో అయితే నేపథ్య సంగీతం అందించాడో శ్యామ్‌ సి.ఎస్‌. ‘ఆర్‌డీఎక్స్‌’కు కూడా అదే స్థాయి సంగీతం అందించాడు.

సినిమాటోగ్రఫీ బై అలెక్స్‌ జె.పులికల్ టాప్‌ నాచ్‌. లైటింగ్‌ ఎఫెక్ట్‌, యాక్షన్‌ సీన్స్‌లో కెమెరా మూవీంగ్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌లో రాబర్ట్‌ను విలన్‌ గ్యాంగ్‌లో ఒకడు గుండెలపై తంతాడు. రాబర్ట్‌ ఎదురుగా ఉన్న కుర్చీలో పడి వెనక్కి అలా వెళ్తూ పడిపోయేడేమో అని ప్రేక్షకుడు అనుకుంటున్న సమయంలో అతని ఫేస్‌పై నుంచి డానీ, జేవియర్‌లను చూపించిన సీన్‌కు విజిల్స్‌ అంతే. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యం కావడంతో పంచింగ్‌ షాట్స్‌ వచ్చినప్పుడు కెమెరా మూమెంట్స్‌కు వావ్‌ అనాల్సిందే!

ఎడిటింగ్‌: పెద్దగా కట్‌ చేయడానికి కూడా ఏమీ లేదు. యాక్షన్‌ సీన్స్‌కు ఎక్కువ సమయం కేటాయించారు. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో లవ్‌ట్రాక్‌ కాస్త స్లో అంతే. దర్శకుడు నహస్‌ హిదయత్‌ ఒక రొటీన్‌ యూత్‌ఫుల్‌ కథకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యం జోడించి సరికొత్తగా చూపించడంలో మంచి విజయం సాధించాడు. ముఖ్యంగా కథలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కథలో అంతర్భాగంగా చూపించిన తీరు బాగుంది.

ఎవరు చూడొచ్చు..: రొటీన్‌కు భిన్నంగా ఒక యూత్‌ఫుల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చూడాలనుకునేవారిని RDX అస్సలు నిరాశపరచదు. కుటుంబంతో కలిసి కూడా నిరభ్యంతరంగా వీక్షించవచ్చు. థియేటర్‌లో విడుదలైన సినిమా కాబట్టి నిబంధనలకు లోబడే సెన్సార్‌ జరిగింది. (RDX Movie Review) ఎలాంటి అసభ్యతకు తావులేదు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా కేవలం మలయాళ భాషలోనే స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌ ఉన్నాయి. త్వరలోనే తెలుగు ఆడియోను జత చేస్తామని నెట్‌ఫ్లిక్స్‌ చెబుతోంది. అందుకు సంబంధించిన అప్‌డేట్‌ రాగానే ఈనాడు సినిమా ఓటీటీ విభాగంలో అందిస్తాం.

  • బలాలు
  • + షేన్‌ నిగమ్‌, ఆంటోనీ వర్ఘీస్‌, నీరజ్‌ మాధవ్‌ల నటన
  • + యాక్షన్‌ ఎపిసోడ్స్‌
  • + దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం
  • బలహీనతలు
  • - ఫ్లాష్‌ బ్యాక్‌లో లవ్‌ట్రాక్‌
  • - కొత్తదనం లేని కథ
  • చివరిగా: ఓనంకు థియేటర్‌లో పేలిన ‘ఆర్‌డీఎక్స్‌’ ఇప్పుడు ఓటీటీలోనూ పేలింది!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు