Updated : 14 Jul 2022 15:39 IST

Regina: ఆ స్వీట్‌ కోసం ‘ప్రెగ్నెంట్‌’నని అబద్ధం చెప్పా..!: రెజీనా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ వైపు గ్లామర్‌ పాత్రల్లో మెప్పిస్తూ, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో సత్తా చాటి మంచి నటిగా దూసుకుపోతున్నారు రెజీనా (Regina Cassandra). దాదాపు పదేళ్ల క్రితం ‘ఎస్‌.ఎమ్‌.ఎస్‌’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఆమె ఎన్నో సినిమాల్లో కథానాయికగా ప్రేక్షకుల్ని అలరించారు.‘అ..!’, ‘ఎవరు’ లాంటి సినిమాల్లో విభిన్నమైన రోల్స్‌తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. ఇటీవల మెగాస్టార్‌తో కలిసి స్టెప్పులేసి కుర్రకారు గుండెల్లో కల్లోలం రేకెత్తించారు. ‘ప్రేక్షకులకు వర్సటైల్‌ నటిగా నేను గుర్తుండిపోవాలి’ అంటూ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ప్రేక్షకులతో అనేక విషయాలను పంచుకోవడానికి వచ్చారు రెజీనా. మరి ఆమె చెప్పిన ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

వెల్‌కమ్‌ టు ‘ఆలీతో సరదాగా’ పాప..! (నవ్వుతూ) ఈ పాప ఎవరు?

రెజీనా: థ్యాంక్స్‌ అండీ...తమిళంలో నా మొదటి సినిమా ‘కేడి బిల్లా కిలాడి రంగ’. అందులో శివ కార్తికేయన్‌తో కలిసి నటించా. నా పాత్ర పేరు ‘పాప’. అప్పట్లో ఆ రోల్‌ బాగా ఫేమస్‌ అయ్యింది. ఇప్పటికీ నన్ను చెన్నైలో ‘పాప’ అనే పిలుస్తారు.

మీ పేరులో ఏదో విశేషం ఉందట! ఏంటది?

రెజీనా: మా అమ్మ క్రిస్టియన్‌. నాన్న ముస్లిం. నా అసలు పేరు ‘రెజీనా’. నేను ఆరేళ్ల వయసులో ఉండగా అమ్మానాన్న విడిపోయారు. మా అమ్మ తిరిగి క్రిస్టియన్‌గా కన్వర్ట్‌ అయ్యి నా పేరుకు ‘కసాండ్రా’ జత చేశారు. నాకు ఈ పట్టింపులేమీ ఉండవు. చర్చి, మసీద్‌, గుడి.. ఇలా ఎక్కడికైనా వెళ్తా.

అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? మీ మొదటి సినిమా ఏంటి?

రెజీనా: నా 14ఏళ్ల వయస్సులో ‘కాండ నాల్ ముదల్‌’ అనే తమిళ సినిమాలో హీరోయిన్‌ చెల్లి పాత్ర చేశా. అదే నా మొదటి సినిమా. హీరోయిన్‌గా అయితే తెలుగులో వచ్చిన ఎస్‌.ఎమ్‌.ఎస్‌ (శివ మనసులో శ్రుతి)

‘ఎస్‌.ఎమ్‌.ఎస్‌’ చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది?

రెజీనా: అప్పటికి నేను కొన్ని తమిళం, కన్నడ సినిమాల్లో నటించా. ఇంకా షార్ట్‌ ఫిల్మ్స్‌, యాడ్స్‌లోనూ చేశా. నేను హీరోయిన్‌గా నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ ఒకటి అప్పట్లో బాగా వైరల్‌ అయ్యింది. వాటిని చూసి ‘ఎస్‌.ఎమ్‌.ఎస్‌’ డైరెక్టర్‌ తాతినేని సత్య ఆడిషన్‌కి పిలిచారు. అదే సమయంలో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమా ఆడిషన్‌కి దర్శకుడు శేఖర్‌ కమ్ముల పిలిచారు. సోలో హీరోయిన్‌ రోల్‌ నాకు నచ్చి ‘ఎస్‌.ఎమ్‌.ఎస్‌’ ఆడిషన్‌కి వెళ్లి సెలక్టయ్యాను.

ఇప్పటివరకు ఎన్ని భాషల్లో నటించారు?

రెజీనా: తెలుగు, తమిళం, కన్నడ ఇంకా హిందీలో కూడా నటించాను. హిందీలో సోనమ్‌ కపూర్‌కి జోడీగా లెస్బియన్‌ పాత్రలో నటించాను. ఇంకా ‘రాకెట్‌ బాయ్స్‌’ అనే హిందీ వెబ్‌సిరీస్‌లోనూ నటించా. 

నటనపై ఆసక్తి ఎలా కలిగింది? చిన్నతనం నుంచే నటించడానికి కారణమేంటి?

రెజీనా: చిన్నప్పటి నుంచి నేను బాగా యాక్టివ్‌. స్కూల్‌లో లీడర్‌ కూడా. సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలో పాల్గొనేదాన్ని. ఆ చురుకుదనమే నన్ను నటనవైపు నడిపించింది. హీరోయిన్‌గా అవకాశం వచ్చినప్పుడు ‘నేను ప్రేక్షకులకు నచ్చితే కంటిన్యూ చేస్తా లేదంటే సైకాలజీ చదువుతా’ అని అమ్మకు చెప్పా. అలా సినిమాల్లో కొనసాగుతున్నా.

స్కూల్లో, కాలేజీల్లో అబ్బాయిలను కొట్టేవారట?కొంతమందికి వార్నింగ్‌లు కూడా ఇచ్చారట?

రెజీనా: నేను ఫస్ట్‌ నుంచి డామినేటింగ్‌ అమ్మాయిని. నా ఫస్ట్‌ స్టాండర్డ్‌లో ఒక అబ్బాయి బుగ్గ గిల్లాడని అమ్మతో చెబితే ‘నువ్వేం ఏం చేయగలవో అది చెయ్‌’ అని చెప్పింది. ఆ తరువాతి రోజే ఆ అబ్బాయిని కొట్టేశా. ఇంకా ప్రపోజ్‌ చేయడానికి వచ్చిన అబ్బాయిలపై కూడా సీరియస్‌ అయ్యేదాన్ని. అప్పుడే తెలిసింది నా బలం ఏంటనేది. ఒకసారి ఆగ్రాలో షూటింగ్‌ జరుగుతుండగా కెమెరాకు అడ్డొచ్చిందని చిన్న కుక్కపిల్లను ఒకతను కాలితో తన్నాడు. కోపం పట్టలేక అతడిని కొట్టాశా. అతడు లోకల్‌ పర్సన్‌. పెద్ద గొడవే జరిగింది.

ప్రస్తుతం ఒక వెబ్‌సిరీస్‌లో నటించారట?ఆ విశేషాలేంటి?

రెజీనా: ‘అనన్యాస్‌ ట్యుటోరియల్’లో నటించాను. ఆర్కా మీడియా సమర్పణలో వచ్చిందది. మొదటిసారి తెలుగు ఓటీటీలో, హారర్ జోనర్‌లో తీసిన ఈ వెబ్‌సిరీస్‌లో ఒక ప్రయోగాత్మక పాత్ర చేశా. నాకు మొదటినుంచి వైవిధ్యమున్న పాత్రలు చేయడమంటేనే ఇష్టం. అందుకే ఎంచుకుని మరీ పాత్రలు చేస్తున్నా.

‘ఆచార్య’లో స్పెషల్‌ సాంగ్‌ చేశారు.. చిరంజీవి పక్కన డ్యాన్స్‌ ఎలా అనిపించింది?

రెజీనా: మెగాస్టార్‌తో డ్యాన్స్‌ అంటే మామూలు విషయం కాదు కదా (నవ్వుతూ)! అవకాశం రాగానే చాలా సంతోషంగా అనిపించింది. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. ఇప్పటికీ ఆయనలా యాక్టివ్‌గా స్టెప్పులేయడం అందరికీ సాధ్యం కాదు.

ఒక స్వీట్ కోసం ప్రెగ్నెంట్‌ అని అబద్ధం చెప్పారట! అదెప్పుడు?

రెజీనా: (నవ్వుతూ) ఊరికే అబద్ధాలు చెప్పం కదండీ. కర్ణాటకలో హిల్ స్టేషన్‌ దగ్గరలోని ఒక హోటల్‌లో ఉన్నా. నాకు అక్కడ దొరికే ‘మిస్తీ దోయి’ అనే స్వీట్‌ చాలా ఇష్టం. సడెన్‌గా అది తినాలనిపించి బయటకు వచ్చా. రాత్రి 11గంటలు అవుతోంది. అక్కడ షాప్స్‌ ఏమీ లేవు. ఒక షాప్‌ క్లోజ్‌ చేస్తుంటే అక్కడికి వెళ్లి అడిగాను. వాళ్లు ఇది క్లోజింగ్‌ టైం.. కుదరదన్నారు.‘ప్లీజ్‌ సర్‌! ప్రెగ్నెంట్‌ని..’ అని అబద్ధం చెప్పా. అలా చెప్పి ఆ స్వీట్‌ కొనుక్కుని తిన్నా.

మీకు ‘అతిశుభ్రత’ అని తెలిసింది. దాని సంగతేంటి?

రెజీనా: అవును.. నాతో ఎప్పుడూ హైజీన్‌ కిట్‌ ఉంటుంది. చివరికి టాయిలెట్‌ పేపర్‌ కూడా నా కిట్‌లో ఉంటుంది. అమ్మాయిలు కచ్చితంగా అతిశుభ్రత పాటించాలి. అప్పుడే కొన్ని ఇబ్బందులు వారికి ఎదురవ్వవు.

ఈ వైవిధ్యమున్న పాత్రలు చేయడానికి కారణం అవకాశాల కోసమా?పారితోషికమా? లేకా పాత్ర నచ్చి చేస్తున్నారా?

రెజీనా: నాకు మొదటి నుంచి ప్రయోగాలు చేయడమంటే ఇష్టం. పద్నాలుగేళ్ల వయస్సులోనే ప్రెగ్నెంట్‌గా నటించా. నన్ను నేను వర్సటైల్‌ నటిగా గుర్తించుకోవటాన్ని ఇష్టపడతాను. ‘అ!’ సినిమాలో అటువంటి రోల్‌ చేయడం వెనుక కారణం అదే. నాకు అటువంటి రోల్స్‌ ఇంకా వస్తున్నాయంటే కారణం అదే. నేను నటించగలనని వాళ్లు నమ్ముతున్నారు.

మీరు మంచి ఆహారప్రియులని విన్నాం..నిజమేనా?

రెజీనా: అవును.. నేనెక్కడికి వెళ్లినా అక్కడి స్పెషల్‌ ఫుడ్‌ రుచి చూడటం అలవాటు. అలా చైనీస్‌, జపనీస్‌, కొరియన్‌, ఫ్రెంచ్‌.. ఇలా అన్ని డిష్‌లు ట్రై చేశా. సౌత్‌ ఇండియా ఫుడ్‌లో నా ఆల్‌ టైం ఫేవరెట్‌ ‘దోశ’. మూడు పూటలా తినమన్నా సరే తినేస్తా.

మీరు నటించేటప్పుడు క్యారెక్టర్‌లో జీవించడానికి  పాటలు వింటారట?

రెజీనా: అవును.. నేను కొత్తగా ట్రై చేసిన అలవాటది. మూడ్‌ని త్వరగా మార్చేది మ్యూజిక్‌ అని నమ్ముతాను. అందుకే నా రోల్‌ ఏంటో తెలుసుకుని ఆ మూడ్‌ కోసం పాటలు వినడంలో మునిగిపోతాను. తక్కువగా ట్రై చేస్తాను.. అన్ని సార్లూ కాదు.

మీ నటనని మీ అమ్మ ఎప్పుడైనా ప్రశంసించారా? 

రెజీనా: నాకు మా అమ్మే పెద్ద క్రిటిక్‌. ఎప్పుడూ నా సినిమాలను చూస్తూ నా నటనను గమనిస్తారు. నా హెయిర్‌ స్టైల్‌ నుంచి డ్యాన్స్‌ వరకూ అన్ని విషయాలపైనా చర్చిస్తారు.

మీకు నచ్చే తెలుగు హీరోలు ఎవరు?

రెజీనా: చిరంజీవి గారు... ఆయన తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఇంకా అల్లు అర్జున్‌. రజనీకాంత్‌ నా ఆల్‌టైం ఫేవరెట్‌.

చాలా సినిమాల్లో నటించారు కదా?ఫలానా డైరెక్టర్‌ సినిమాలో నటించాలనే కోరికేమైనా ఉందా?

రెజీనా: నేను నటించిన దర్శకుల్లో నాకు ప్రవీణ్‌ సత్తారు వర్కింగ్‌ స్టైల్‌ నచ్చుతుంది. ఇంకా రాజమౌళి డైరెక్షన్‌లో నటించాలని నా కోరిక. ఎందుకంటే ఆయన తీసే సినిమాల్లో నటనకు ఆస్కారం ఉంటుంది.

ఇండస్ట్రీలో మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?

రెజీనా: ఇండస్ట్రీలో నాకు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ తక్కువే. రకుల్ ప్రీత్‌తో క్లోజ్‌గా ఉంటా. ఇంకా సందీప్‌ కిషన్‌, సాయితేజ్‌ వీళ్లతోనే ఎక్కువ టచ్‌లో ఉంటాను.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని