Regina: అయ్యయ్యో.. ఆ ఫొటోలు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఉన్నాయి: రెజీనా

తాను సినిమాలో నటించే తొలినాళ్లలో చాలా తక్కువ పారితోషికం ఇచ్చే వారని, అయినా కూడా కష్టపడి పనిచేసేదాన్ని

Updated : 15 Sep 2022 17:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను సినిమాలో నటించే తొలినాళ్లలో చాలా తక్కువ పారితోషికం ఇచ్చే వారని, అయినా కూడా కష్టపడి పనిచేసేదాన్ని అని కథానాయిక రెజీనా (Regina Cassandra) అన్నారు. నివేదా థామస్‌తో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం ‘శాకిని డాకిని’. సుధీర్‌ వర్మ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తన కెరీర్‌, సినిమాలు, తొలినాళ్లలో ఎదురైన పరిస్థితుల గురించి రెజీనా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

అలా ఉండకూడదని అప్పుడే తెలిసింది!

‘‘ఎస్‌ఎంఎస్‌’ (శ్రుతి మనసులో శివ) తో తెలుగు ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టా. అప్పట్లో నా సినిమాలు, డేట్స్‌ అన్నీ మా అమ్మే చూసుకునేది. పాత్రల విషయంలో కొన్నిసార్లు మా అమ్మతో వాదించినా, షూటింగ్‌కు మాత్రం ఇబ్బంది పెట్టకుండా వెళ్లేదాన్ని. అప్పట్లో నాకు చాలా తక్కువ పారితోషికం ఇచ్చేవారు. ఎందుకో నాకు తెలిసేది కాదు. ఒక ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చిన తర్వాత అసలు విషయం అర్థమైంది. అప్పట్లో నాకు వ్యక్తిగత మేకప్‌, హెయిర్‌ స్టైలిస్ట్‌ ఉండేవారు కాదు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక రోజు ఓ రేడియో ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లా. రేడియో ఇంటర్వ్యూ కదాని, వెళ్లే ముందు తలస్నానం చేసి, జుట్టు సరిగా తుడుచుకోకుండానే వెళ్లా. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఫొటోలు తీసుకుంటామని అన్నారు. నేనూ సరేనన్నా. ఆ ఫొటోలు వెబ్‌సైట్స్‌లో వచ్చిన తర్వాత కానీ, నాకు అసలు విషయం అర్థమైంది. అస్సలు నేను హీరోయిన్‌లాగానే లేను. అయ్య బాబోయ్‌.. ఆ ఫొటోలు ఇప్పటికీ ఇంటర్నెట్‌లో ఉన్నాయి.  ప్రమోషన్స్‌కు మేకప్‌ లేకుండా వెళ్లకూడదని అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అనేక విషయాలను నేర్చుకున్నా. రెమ్యునరేషన్స్‌, ఎంచుకునే పాత్రలు ఇలా ప్రతి విషయంలో నా ముద్ర ఉండేలా చూసుకున్నా. 2011 నుంచి వ్యక్తిగత మేకప్‌, హెయిర్‌స్టైలిస్ట్‌ లేకుండా ఏ ప్రమోషన్స్‌కు వెళ్లలేదు’’

ఆ పాత్ర వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చింది

‘‘దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లే వాళ్లు మంచి పాత్రతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు. ‘ఏక్‌ లడిఖీ కో దేఖాతో ఐసా లగా’లో లెస్బియన్‌ రోల్‌ చేసి బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాను. ఆ పాత్ర చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక రోజు దర్శకురాలు షెల్లీ కాల్‌ చేసి, వేరే చిత్రానికి ఆడిషన్‌ కోసం పిలిచింది. ఆ ఆడిషన్‌ పూర్తయిన తర్వాత ఈ సినిమాలో పాత్ర కోసం సరిపోతానని ఆమెకు అనిపించింది. వెంటనే కథ, పాత్రను వివరించింది. 15-20 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పింది. ఆ తర్వాత షెల్లీ చెన్నై వచ్చి, మొదటి సన్నివేశం డైలాగ్‌ నుంచి చివరి సీన్‌ డైలాగ్‌ వరకూ పూర్తి స్క్రిప్ట్‌ చెప్పింది. అప్పుడు నా పాత్ర చాలా బాగా అర్థమైంది. ఆ నిర్ణయం చాలా కఠినమైంది. నా కెరీర్‌లో ఆ తరహా పాత్ర ఎప్పుడూ చేయలేదు. దక్షిణాది నుంచి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న నాకు ఈ పాత్ర వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు. కానీ, అన్ని చిత్రాల్లాగానే ఇది ఒకటి అనుకుని ఈ పాత్ర చేశా. కానీ, ఎంత బరువైన పాత్ర చేశానో నాకు అప్పుడు తెలియదు. ఏదో వెళ్లాను కొన్ని సీన్లు చేశాను. సినిమా విడుదలైంది’’

‘‘నా నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. కానీ, కొందరు యువతుల నుంచి నాకు లెటర్స్‌ కూడా వచ్చాయి. తమ తల్లిదండ్రుల దగ్గర మనసు విప్పి మాట్లాడటానికి నా పాత్ర ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు. ‘నిజమేనా’ అని అనిపించింది. ఒక బాలిక అయితే, నా పాత్రతో పెద్ద పుస్తకమే రాసింది. ‘ఏక్‌ లడికీ కో దేఖాతో ఐసా లగా’లో లెస్బియన్‌ కమ్యూనిటీని ఎదుర్కొంటున్న పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేశాం. ఇక సినిమా విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. నేనెప్పుడూ బాధపడలేదు. ఇప్పటికీ ఆ పాత్ర చేసినందుకు సంతోషంగానే ఉన్నా. ప్రస్తుతం సోషల్‌మీడియా యుగంలో ఉన్నాం. నేనెప్పుడూ వ్యూహాత్మకంగా పనిచేయలేదు. నా కెరీర్‌లో హిట్‌ ఫ్యాక్టర్‌ ఎప్పుడూ పనిచేయలేదు, కష్టపడి పనిచేయడమే నాకు తెలుసు’’ అని రెజీనా చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts