Regina: అందర్నీ ఇలాగే ప్రశ్నిస్తారా..? రిపోర్టర్‌పై రెజీనా ఫైర్‌

‘నటీనటులందర్నీ మీరు ఇలాంటి ప్రశ్నలే అడుగుతారా?’ అంటూ రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు నటి రెజీనా (Regina). నిజ జీవితానికి, సినిమాకు మధ్య చాలా వ్యత్యాసం.....

Published : 07 Sep 2022 11:02 IST

హైదరాబాద్‌: రెజీనా, నివేదా థామస్‌ (Nivetha Thamos) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని డాకిని’ (Saakini Daakini). ఈ సినిమా ప్రెస్‌మీట్‌ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో భాగంగా ఓ విలేకరి.. ‘మేడమ్‌ ఈ సినిమాలో మీరు ఓసీడీ(అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉన్నట్లు కనిపించారు. నిజ జీవితంలో కూడా మీకు అలా ఓసీడీ ఉందా?’ అని ప్రశ్నించాడు. విలేకరి అడిగిన ప్రశ్నతో రెజీనా ఇబ్బందికి గురయ్యారు. ‘‘అందర్నీ మీరు ఇలాగే ప్రశ్నిస్తారా? సినిమాలో మేము కేవలం నటిస్తున్నామంతే. పాత్ర డిమాండ్‌ చేయడం వల్లే మేము అలా చేస్తాం. మీ వద్ద ఇలాంటి ప్రశ్నలే ఉన్నాయా? అమ్మాయిల్ని చాలా గొప్పగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అలాంటిది మీరిలా నా పాత్ర, ఓసీడీ గురించి అడుగుతున్నారేంటి? వ్యక్తిగతంగా నేను శుభ్రత ఇష్టపడే వ్యక్తిని. ఓసీడీ లాంటి సైకలాజికల్‌ డిజార్డర్‌ నాకేమీ లేదు’’ అని రెజీనా బదులిచ్చారు.

రెజీనా ఆగ్రహాన్ని అర్థం చేసుకొన్న విలేకరి.. ‘‘మేడమ్‌ నేను అడిగిన ఉద్దేశం వేరు. కరోనా తర్వాత అందరూ పరిశుభ్రత ఎక్కువగా పాటిస్తున్నారు కదా. అలాగే, మీరు కూడా పరిశుభ్రంగా ఉండటానికి ఇష్టపడతారా? అనేది నా ఉద్దేశం’’ అని వివరణ ఇచ్చారు. ఇదే ప్రెస్‌మీట్‌లో విలేకర్ల ఫోన్లు వరుసగా రింగ్‌ కావడంతో రెజీనా కొంత అసహనానికి గురైనట్లు కనిపించారు. ‘‘నేను సీరియస్‌గానే ఈ ప్రశ్న అడుగుతున్నాను. ప్రెస్‌మీట్‌లో పాల్గొనేటప్పుడు మీరందరూ ఫోన్లు సైలెంట్‌లో పెట్టుకోరా?’’ అని ఆమె ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని