Tollywood: వరుస కడుతున్నాయ్‌ వినోదాలు

కొత్త సినిమాల విడుదల తేదీల్ని ఖరారు చేయడం... ఆ తర్వాత ఆ ప్రణాళికలన్నీ కరోనాతో తారుమారు కావడం... రెండేళ్లుగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితే! మూడోదశ కరోనాతో మరోమారు విడుదల తేదీల వ్యవహారం గందర గోళంగా మారిపోయిన విషయం తెలిసిందే.

Updated : 03 Feb 2022 07:39 IST

మరిన్ని చిత్రాల విడుదల ఖరారు

కొత్త సినిమాల విడుదల తేదీల్ని ఖరారు చేయడం... ఆ తర్వాత ఆ ప్రణాళికలన్నీ కరోనాతో తారుమారు కావడం... రెండేళ్లుగా అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితే! మూడోదశ కరోనాతో మరోమారు విడుదల తేదీల వ్యవహారం గందర గోళంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ దశ కరోనా కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఆయా చిత్రబృందాలు మళ్లీ కొత్త సినిమాల విడుదలలపై వ్యూహాలు రచించాయి. టాలీవుడ్‌లో కొన్ని చిత్రబృందాలు రెండు చొప్పున   విడుదల తేదీల్ని ఖరారు చేస్తే... కొన్ని సినిమాలు మాత్రం పక్కా వచ్చేస్తున్నాం అని చెప్పేస్తున్నాయి. మూడు రోజులుగా అగ్ర తారల సినిమాలు ఒకదానివెంట మరొకటి విడుదల పక్కా చేసేస్తున్నాయి. బుధవారం దఫా విడుదల తేదీలు   ఖరారయ్యాయి. అందులో మోహన్‌బాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ మొదలుకొని గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ వరకు పలు చిత్రాలున్నాయి.


మార్చ్‌ 11న ‘రాధేశ్యామ్‌’

పాన్‌ ఇండియా చిత్రాలన్నీ పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్న సంగతిని ప్రకటిస్తుంటే, ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ బృందం నుంచి మాత్రం స్పందన కనిపించలేదు. దాంతో ఆ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఎట్టకేలకి చిత్రబృందం బుధవారం విడుదల తేదీని ఖరారు చేసింది. మార్చ్‌ 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ప్రేమకీ, విధికీ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. ప్రభాస్‌కి జోడీగా పూజాహెగ్డే నటించిన విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. యు.వి.క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్‌, సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌, మిథున్‌, అనూ మాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస.


18న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’

మోహన్‌బాబు కథానాయకుడిగా డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విషయాన్ని మోహన్‌బాబు ట్విటర్‌ ద్వారా బుధవారం ప్రకటించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌తో కలిసి 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన చిత్రమిది. శ్రీకాంత్‌, తనికెళ్ల భరణి, అలీ, వెన్నెల కిషోర్‌, పృథ్వీరాజ్‌, రఘుబాబు, రాజా రవీంద్ర, రవిప్రకాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే బాధ్యతని కూడా నిర్వర్తించారు. ఇళయరాజా సంగీతం అందించారు. అజిత్‌ కథానాయకుడిగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వలీమై’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. బోనీకపూర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళంతోపాటు హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


కరోనా కరుణిస్తే... పక్కా

గోపీచంద్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. రాశీ ఖన్నా కథానాయిక. జీఏ2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. బన్నీ వాస్‌ నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పకులు. కరోనా కరుణిస్తే ఈ చిత్రాన్ని మే 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాలోని తొలి పాటని ఇటీవలే విడుదల చేశారు. పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్‌... దేవుడు జీవుడు భక్తులు అగరత్తులు అన్నీ పక్కా కమర్షియల్‌... అంటూ సాగే ఆ పాటని ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. జీవితం గురించి, పుట్టుక, చావు గురించి అద్భుతమైన సాహిత్యం ఈ పాటలో ఉంటుందని దర్శకుడు మారుతి చెప్పారు. జేక్స్‌ బిజోయ్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.


కథా బలమున్న చిత్రం ‘సురభి 70ఎంఎం’

అక్షత శ్రీనివాస్‌, వినోద్‌, ఉషాంజలి, శ్లోక, అనిల్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సురభి 70ఎంఎం’. హిట్టు బొమ్మ.. అన్నది ఉపశీర్షిక. గంగాధర వై.కె తెరకెక్కించారు. కె.కె.చైతన్య నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మంచి కథా బలమున్న చిత్రమిది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో ప్రేమకథలు, కుటుంబ కథలు ఉన్నాయి’’ అన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని