Renu Desai: సంతోషం కంటే బాధే ఎక్కువ

ఇన్‌స్టా వేదికగా కొవిడ్‌ బాధితులకు తనకు చేతనైనంత చేయూతనందిస్తునప్పటికీ సంతోషం కంటే కూడా ఎక్కువగా బాధకు లోనవుతున్నట్లు నటి రేణూదేశాయ్‌ తెలిపారు. తరచూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూదేశాయ్‌‌....

Published : 23 May 2021 16:46 IST

నటి రేణూదేశాయ్‌

హైదరాబాద్‌: కొవిడ్‌ బాధితులకు తనవంతు చేయూతనందిస్తునప్పటికీ సంతోషం కంటే కూడా ఎక్కువగా బాధకు లోనవుతున్నట్లు నటి రేణూదేశాయ్‌ తెలిపారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూదేశాయ్‌‌ గడిచిన 15 రోజుల నుంచి ఆసరా కోసం ఎదురుచూస్తున్న వారికి తనవంతు సాయం చేస్తున్నారు. ఆసుపత్రులలో పడకలు ఏర్పాటు చేయించడం, అవసరమైన వారికి ఆక్సిజన్‌ సిలిండర్లు, ఇతర మెడికల్‌ వసతులను సిద్ధం చేయడంలో ఆమె తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయం గురించే తను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు.

‘‘గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో కేవలం ఇంటిపట్టునే ఉండి పిల్లలతో సరదాగా సమయం గడిపాను. నేను డైరెక్ట్‌ చేయనున్న ప్రాజెక్ట్‌పై వర్క్ చేశాను. ఎవరైనా ఆర్థిక సాయం కావాలని అడిగితే చేతనైనంత సాయం చేశాను. కానీ ఈ ఏడాది పరిస్థితులు మరెంతో దారుణంగా ఉన్నాయి. ఆక్సిజన్‌ అందక రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని వార్తల్లో చూసి నాకు చేతనైనంత సాయం చేద్దామని ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాను. ఆ సమయంలో కేవలం 25 నుంచి 30 మంది మాత్రమే సాయం కోసం వస్తారని భావించాను. కానీ మొదటిరోజే నాకు సుమారు 100 పైగా మెస్సేజ్‌లు వచ్చాయి. అవన్నీ చూసి షాకయ్యాను’’

‘‘అదే సమయంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు ఒక టీమ్‌గా ఫామ్‌ అయ్యి నాకు సాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అలా, నాకు వచ్చిన మెస్సేజ్‌లు ఏ ప్రాంతానికి చెందినవి అయితే ఆ ప్రాంతానికి చెందిన మా టీమ్‌ సభ్యులకు చెప్పి బాధితులకు తగినంత సాయం చేస్తున్నాను. కానీ సాయం పొందేలోపే కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాటి వల్ల ప్రతిక్షణం కుంగుబాటుకు లోనవుతున్నాను. ఒక్కోసారి ఏడ్చేస్తున్నాను కూడా. మేము చేసిన సాయం పొంది ఎవరైనా ఆరోగ్యంగా తిరిగి వస్తే వెంటనే మాకు థ్యాంక్స్‌ చెబుతూ మెస్సేజ్‌లు పెడుతున్నారు. దానికి సంతోషించినప్పటికీ.. మిగిలిన వాళ్లని కాపాడలేకపోయామే అనే బాధే నాకు ఎక్కువగా అనిపిస్తుంది’ అని రేణూ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని