Renu Desai: నా కుమార్తె కన్నీళ్లు మిమ్మల్ని వెంటాడతాయి: రేణు దేశాయ్‌

తనను అవమాన పరిచేలా ఉన్న మీమ్స్‌ను చూసి తన కుమార్తె ఆద్య ఎంతో ఏడ్చిందని సినీ నటి రేణు దేశాయి అన్నారు. అలాంటి మీమ్స్‌ రూపొందించిన వారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు.   

Updated : 26 Jun 2024 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తన సతీమణి అనా లెజినొవా(Anna Lezhneva), పిల్లలు అకీరా నందన్‌ (Akira Nandan), ఆద్యలతో సరదాగా దిగిన ఫొటో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. క్యూట్‌ ఫొటో అంటూ అభిమానుల నుంచి సోషల్‌ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. అయితే ఆ ఫొటోను ఉపయోగించి సినీ నటి రేణు దేశాయ్‌ (Renu Desai)ను అవమానపరిచేలా కొందరు వ్యక్తులు మీమ్స్‌ రూపొందించారు. దీంతో మీమ్స్‌ రూపొందించిన వారిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కొంతమంది వ్యక్తులను చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్టు చేశారు. 

‘‘ఆ ఫొటోను నేను ఏ విధంగా క్రాప్‌ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని మీమ్స్‌, జోక్‌లు పేల్చే భయంకరమైన వ్యక్తులూ.. మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్‌స్టాలో చూసి నా కుమార్తె విపరీతంగా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్‌మీడియా, ఇంటర్నెట్‌ అకౌంట్లను సులభంగా యాక్సెస్‌ చేసి, విచక్షణ లేని వ్యక్తులుగా ఎదుగుతున్న తీరును చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తోంది. ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి. పొలినా, మార్క్‌ సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్‌తో ప్రభావితం అవుతారు. ఇలాంటి మీమ్‌ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్టు చేయడానికి ముందు వంద సార్లు ఆలోచించాను. అయితే నా కుమార్తె కోసం, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో ఉంచుకొని పోస్టు చేశాను’’ అని రేణు దేశాయ్‌ పేర్కొన్నారు.

జూన్‌ 12న ఏపీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం పవన్‌ తన భార్య, పిల్లలతో కలిసి మంగళగిరిలోని నివాసానికి బయలుదేరారు. అయితే మధ్యలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి వారు సరదాగా ఫొటో దిగారు. ఈ ఫొటోను జనసేన పార్టీ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్‌ అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని