renu desai: ఆ మాటలు విని విసిగిపోయా.. మీ మైండ్‌సెట్‌ మార్చుకోండి: రేణు దేశాయ్‌

పవన్‌కల్యాణ్‌తో విడాకుల విషయమై తనపై తరచూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లకు రేణు దేశాయ్‌ స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు.

Published : 22 Jun 2024 00:15 IST

హైదరాబాద్‌: తనని దురదృష్టవంతురాలని పిలుస్తుండటం చాలా బాధగా ఉందని, అలా పిలవొద్దని చెప్పి చెప్పి అలసిపోయానని సినీ నటి రేణు దేశాయ్‌ (Renu Desai) అన్నారు. పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) నుంచి విడాకులు తీసుకున్న దగ్గరి నుంచి ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ఏ పోస్ట్‌ పెట్టినా, కొందరు నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఓ దశలో ఈ వ్యవహారం తారస్థాయికి చేరడంతో ఆమె కామెంట్‌ సెక్షన్‌ కూడా హైడ్‌ చేశారు. అయినా.. పలువురు వ్యక్తులు రేణుదేశాయ్‌ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు, ఆయన ఏపీ ఉపముఖ్యమంత్రి పదవితో పాటు, పంచాయతీరాజ్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో కొందరు రేణుదేశాయ్‌పై మళ్లీ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు.

‘మీరు దురదృష్టవంతురాలు మేడమ్‌’ అంటూ వ్యంగ్యంగా ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. దీనికి రేణు దేశాయ్‌ స్పందిస్తూ ‘నేను ఎలా దురదృష్టవంతురాలినో చెప్పగలరా. మీ సమాధానం కోసం వేచి చూస్తున్నా’అని రిప్లై ఇచ్చారు. తాజాగా ఆస్క్రీన్‌ షాట్‌లను పంచుకుంటూ..  ‘దురదృష్టవంతురాలు అనే మాట నన్ను ఎంతగానో బాధిస్తోంది. నా భర్త నన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకుంటే, కొంతమంది వ్యక్తులు సంవత్సరాలుగా అలా కామెంట్‌ చేస్తుండటం బాధగా ఉంది. ఆ మాటలు విని విని విసిగొచ్చింది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడిపెడుతున్నారు. నా జీవితంలో ఇప్పటివరకూ నాకు దక్కిన ప్రతి విషయానికి నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నా. అలాగే, నాకు లేని వాటి గురించి నేనెప్పుడూ బాధపడలేదు. విడాకులు తీసుకున్నంత మాత్రాన స్త్రీ, పురుషులు దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు. కేవలం వాళ్ల వైవాహిక జీవితం మాత్రమే ముందుకు సాగలేదు’’ అని రేణూ దేశాయ్ పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్‌ కింద కామెంట్‌ పెడుతూ, ‘మనం 2024లో ఉన్నాం. ఒకరి అదృష్టాన్ని అతడు/ఆమె విడాకుల కారణంగానో లేదా చనిపోయిన భాగస్వామితో పోల్చి చెప్పడంతోనో ఇకనైనా ఆపండి. ఇప్పటికైనా సమాజం మారాలి. విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడండి. వారి ప్రతిభ, శ్రమ ఆధారంగా గుర్తింపునివ్వండి. పాతవాటిని తవ్వుకుంటూ చేసే ఆలోచనల్ని పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి’’ అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. పవన్‌కల్యాణ్‌కు దూరంగా ఉంటున్న ఆమెపై ఇకనైనా విమర్శలు చేయడం ఆపాలంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని