Repeat Review: రివ్యూ: రిపీట్‌

Repeat Review: నవీన్‌చంద్ర, మధుబాల కీలక పాత్రల్లో అరవింద్‌ శ్రీనివాసన్‌ తీసిన ‘రిపీట్‌’ ఎలా ఉందంటే?

Published : 01 Dec 2022 16:05 IST

Repeat Review: చిత్రం: రిపీట్‌; నటీనటులు: నవీన్ చంద్ర, మధుబాల, అచ్యుత్ కుమార్, మీమీ గోపి, స్మృతి వెంకట్, సత్యం రాజేష్, పూజా రామచంద్రన్ తదితరులు; సినిమాటోగ్రఫీ: పీజీ ముత్తయ్య; ఎడిటింగ్‌: అరుళ్‌ సిద్ధార్థ్‌; నిర్మాత: విజయ్‌ పాండే, దర్శకుడు: అరవింద్‌ శ్రీనివాసన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

ఒక భాషలో విజయవంతమైన  చిత్రాన్ని మరొక భాషలో రీమేక్‌ చేయడం సహజం. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇది జరిగేదే. అయితే, ఓటీటీ వినియోగం పెరిగాక, డబ్బింగ్‌తో సరిపెట్టేస్తున్నారు. కానీ, ఇప్పటికీ కొన్ని చిత్రాలు రీమేక్‌ అవుతున్నాయి. అలా తమిళ్‌లో ఘన విజయం సాధించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘డెజావు’. తెలుగులో దీన్నే ‘రిపీట్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. (Repeat Review) ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి? నవీన్‌ చంద్ర ఎలా నటించారు?

కథేంటంటే: రచయిత సుబ్రహ్మణ్యం (అచ్యుత్‌ కుమార్‌) రాసిన నవలలో మాదిరిగానే నిజ జీవితంలోనూ నేరాలు జరుగుతుంటాయి. తాను రాసినట్లే ఆ నేరాలు జరుగుతుండటంతో కొందరు వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే, సుబ్రహ్మణ్యం మద్యం తాగి ఉన్నాడని భావించిన పోలీసులు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. దీంతో మరుసటి రోజు మరొక అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయి డీజీపీ ఆశ (మధుబాల) కుమార్తె కావడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటారు. దీంతో అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ విక్రమ్‌ (నవీన్‌ చంద్ర) రంగంలోకి దిగుతాడు. మరి విక్రమ్ ఈ కేసును ఎలా ఛేదించాడు? (Repeat Review) ఇంతకీ ఆ కిడ్నాప్‌లు చేస్తోంది ఎవరు? రచయిత సుబ్రహ్మణ్యం రాసిన నవలలోని అంశాలు నిజం ఎలా అవుతున్నాయి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: పైన చెప్పుకొన్నట్లు ఒక భాషలో మంచి టాక్‌ తెచ్చుకున్న సినిమాను మరొక భాషలో రీమేక్‌ చేస్తున్నారంటే మాతృభాషలో దొర్లిన తప్పులను సరి చేసుకుంటూ తీయాలి. అదనపు ఆకర్షణలు జోడించే అవకాశమూ లభిస్తుంది. కానీ, తమిళంలో ‘డెజావు’ తీసిన దర్శకుడు అరవింద్‌ శ్రీనివాసన్‌ ఆ విషయాలను పెద్దగా పట్టించుకోకుండా, తమిళ్‌ టు తెలుగు కాపీ పేస్ట్‌ చేశారు. నటీనటులు ముఖ్యంగా, నవీన్‌చంద్ర ఒక్కరిని మార్పు చేశారేమో అనిపిస్తుంది. రచయిత నవలలో రాసినట్లుగానే ఒకదాని తర్వాత ఒక కిడ్నాప్‌ జరుగుతుండటం ప్రథమార్ధం ఆసక్తిగా సాగుతుంది. పోలీసులు కూడా ఎవరు ఈ కిడ్నాప్‌లు చేస్తున్నారు? అని ఇన్వెస్టిగేషన్‌ చేసే విధానమూ ఉత్కంఠగా ఉంటుంది. అయితే, అవే కిడ్నాప్‌లు వరుసగా జరుగుతుండటంతో చూసిన సన్నివేశాలనే మళ్లీ చూశామా? అన్న ఫీలింగ్‌ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఫస్ట్‌హాఫ్‌లో అక్కడక్కడా ఒకట్రెండు ట్విస్ట్‌లు మెప్పిస్తాయి. ద్వితీయార్ధానికి వచ్చే సరికి పరుగులు పెట్టాల్సిన కథనం, స్టేషన్‌ దగ్గర ఆగే రైలులా నెమ్మదై పోతుంది. అయితే, పతాక సన్నివేశాలకు వచ్చే సరికి రొటీన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌నకు మారిపోయినా, ఆ సన్నివేశాలను ప్రధాన పాత్రలకు కనెక్ట్‌ చేసిన విధానం పర్వాలేదనిపిస్తుంది. అయితే, వాటిని మరింత బలంగా, ఆసక్తిగా రాసుకుని ఉంటే బాగుండేది. ఈ వీకెండ్‌లో క్రైమ్ థ్రిల్లర్‌ చూడాలనుకుంటే ‘రిపీట్‌’ ప్రయత్నించవచ్చు.

ఎవరెలా చేశారంటే: పోలీస్‌ ఆఫీసర్‌ విక్రమ్‌గా నవీన్‌ చంద్ర సరిగ్గా సూటయ్యారు. అండర్ కవర్ పోలీస్‌గా కేసు ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా చక్కగా నటించారు. గతంలో పోలీస్‌ పాత్రలు చేసి ఉండటంతో ఇందులో విక్రమ్‌ పాత్ర కోసం పెద్దగా కష్టపడలేదు. చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయారు. మధుబాల, అచ్యుత్‌ కుమార్‌, ‘సత్యం’ రాజేశ్‌, పూజా రామచంద్రన్‌ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. జిబ్రాన్‌ నేపథ్య సంగీతం పలు సన్నివేశాలను ఎలివేట్‌ చేసింది. మొదటి నుంచి చివరి వరకూ కొన్ని సన్నివేశాల్లో వాడిన థీమ్‌ ఆయా సీన్స్‌లో గాఢతను పెంచింది. ముత్తయ్య సినిమాటోగ్రఫీ, అరుళ్‌ ఎడిటింగ్‌ ఓకే. నిడివి కూడా తక్కువే. దర్శకుడు అరవింద్‌ శ్రీనివాసన్‌ తమిళ చిత్రాన్నే తెలుగులో తీశారు. అందులో జరిగిన పొరపాట్లను ఇందులో మెరుగుపరిచి, క్లైమాక్స్‌ మరింత బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. అయితే, అక్కడక్కడా వచ్చే ట్విస్ట్‌లు మాత్రం మెప్పిస్తాయి.

బలాలు: + నవీన్‌ చంద్ర; + ప్రథమార్ధం, కొన్ని ట్విస్ట్‌లు

బలహీనతలు: - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు; - మాతృకలో మార్పులు చేయకపోవడం

చివరిగా: ‘రిపీట్‌’.. ఒక్కసారి చేయొచ్చు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇదీ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని