ఫేస్‌మాష్‌ నుంచి ఫేస్‌బుక్‌ దాకా..

ఫేస్‌బుక్‌.. దేశంలో దీని గురించి తెలియని యువత లేదంటే అతిశయోక్తికాదు. దీని వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరూ అందరికీ సుపరిచితమే. జుకర్‌బర్గ్‌ ఈ ఫేస్‌బుక్‌ను ఎందుకు మొదలు పెట్టాడు.....

Published : 28 Jun 2021 01:14 IST

ప్రేక్షకాలమ్‌

చిత్రం: ది సోషల్‌ నెట్‌వర్క్‌(2010); దర్శకుడు: డేవిడ్‌ ఫించర్‌; స్క్రీన్‌ప్లే: ఆరేన్‌ సోర్కిన్, బెన్‌ మెజ్‌రిచ్‌; నటీనటులు: జెస్సీ ఐసిన్‌బర్గ్, యాండ్రీ గార్‌ఫీల్డ్, జస్టిన్‌ టింబర్‌ లేక్, రూనీ మారా, తదితరులు; సంగీతం: ట్రెంట్‌ రెజ్నర్, అట్టికస్‌ రోజ్‌; సినిమాటోగ్రఫీ: జెఫ్‌ క్రోనెన్‌వెత్‌; నిడివి: 120 నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు: నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్‌

ఫేస్‌బుక్‌.. దేశంలో దీని గురించి తెలియని యువత లేదంటే అతిశయోక్తికాదు. దీని వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరూ అందరికీ సుపరిచితమే. జుకర్‌బర్గ్‌ ఈ ఫేస్‌బుక్‌ను ఎందుకు మొదలు పెట్టాడు? ఎలా ఎదిగాడు? ఆయన చుట్టూ అల్లుకున్న వివాదాలేంటి? అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ ఆసక్తిని బాక్స్‌ఫీసు కాసుల రూపంలోకి మారిస్తే... ‘ది సోషల్‌ నెట్‌వర్క్‌’ సినిమా అవుతుంది. 40 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ చిత్రం 224 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడంతో పాటు... ప్రశంసలూ  అందుకుంది. మూడు ఆస్కార్‌లనూ సొంతం చేసుకుంది. ‘‘కోట్ల మంది స్నేహితులను సంపాదించడానికి కొంతమంది నైనా శత్రువులను చేసుకొని ఉంటాడు’’ అని జుకర్‌బర్గ్‌ గురించి చెబుతూ మొదలయ్యే ఈ చిత్ర విశేషాలు తెలుసుకుందామా?

అదిరిపోయే స్క్రీన్‌ప్లే:

2009లో బెన్‌ మెజ్‌రిచ్‌ రాసిన ‘ది యాక్సిడెంటల్‌ బిలియనీర్‌’ పుస్తకం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ సినిమా నాన్‌లీనియర్‌ స్క్రీన్‌ప్లేలో సాగుతుంది. జుకర్‌బర్గ్‌ ‘ఫేస్‌మాష్‌’ను ‘ది ఫేస్‌బుక్‌’గా మార్చినందుకు వింక్‌లేవోస్‌ల ఫిర్యాదులు, వివరణలు జరుగుతుంటాయి. అదే సమయంలో జుకర్‌బర్గ్‌ సైట్‌ను మార్పులు చేర్పులు చేస్తుంటాడు. మరోవైపు ‘ది ఫేస్‌బుక్‌’ను ‘ఫేస్‌బుక్‌’గా మార్చినందుకు సావరిన్‌ వేసిన పిటీషన్‌పై కోర్ట్‌లో విచారణ జరుగుతుంటుంది. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌ ఎలా అందరికీ చేరువ అయిందనేది చూపిస్తుంటారు. ఇలా మూడు కోణాల్లో కథనం సాగుతుంటుంది.

కథ: హార్వ్‌ర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న మార్క్‌ జుకర్‌బర్గ్‌(జెస్సీ ఐసిన్‌బర్గ్‌)కు కలుపుగోలు తనం తక్కువ. అమ్మాయిలతో మాట్లాడటం అసలు రాదు. ఒకసారి ఎరికా ఆల్‌బ్రైట్‌(రూనీ మారా)ను డేటింగ్‌కు రమ్మని పిలుస్తాడు. ఆమె అతని మాటలను విభేదిస్తుంది. దీంతో ఆల్‌బ్రైట్‌ మీద కోపం తెచ్చుకున్న మార్క్‌... తన బ్లాగ్‌లో ఆమెను కించపరిచేలా వ్యాసం రాస్తాడు. అతని కోపం చల్లారదు. విశ్వవిద్యాలయ సర్వర్‌ను హ్యాక్‌ చేసి ‘ఫేస్‌మాష్‌’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేస్తాడు. అందులో అమ్మాయిల ఫొటోలు ఉంచి.. వాటికి రేటింగ్స్‌ ఇమ్మని విద్యార్థులను కోరతాడు. ఎక్కువ మంది ‘ఫేస్‌మాష్‌’ చూడటంతో విశ్వవిద్యాలయ కంపూటర్లు క్రాష్‌ అయిపోతాయి. దీనిపై విచారణ చేసిన అధికారులు మార్క్‌ను 6 నెలలు సస్పెండ్‌ చేస్తారు. అయితే ఈ విధానం అక్కడే చదువుతున్న ట్విన్స్‌ అయిన కామెరూన్, టేటర్‌ వింక్‌లేవోస్‌లకు నచ్చుతుంది. మార్క్‌ను పిలిచి... ‘ఫేస్‌మాష్‌’ను పెద్ద వెబ్‌సైట్‌లా మారుద్దామని ప్రణాళిక వేసుకుంటారు. వాళ్లను కాదని ‘ది ఫేస్‌బుక్‌’ పేరుతో మార్క్‌ కొత్త వెబ్‌సైట్‌ సృష్టిస్తాడు. దీనికి వెయ్యి డాలర్లు తన స్నేహితుడు ఎడ్వర్డో సావరిన్‌(యాండ్రీ గార్‌ఫీల్డ్‌) పెట్టుబడిగా పెడతాడు. దీనిపై వింక్‌లేవోస్‌ బ్రదర్స్‌ ఆలోచన తమదని యూనివర్సిటీలో ఫిర్యాదు చేస్తారు. ఉమ్మడి స్నేహితుల ద్వారా పరిచయమైన సీన్‌ పార్కర్‌(జస్టిన్‌ డింబర్‌లేక్‌)కు ‘ది ఫేస్‌బుక్‌’ బాగా నచ్చుతుంది. దీన్ని ఇంకా విస్తరించుదామని, తాను పెట్టుబడిగా పెడతానని ముందుకొస్తాడు. ఇది సావరిన్‌కు నచ్చదు. జుకర్‌బర్గ్‌ ఈ విషయాన్ని పట్టించుకోడు. అతని ద్వారా వచ్చిన పెట్టుబడితో... ‘ది ఫేస్‌బుక్‌’ను... ‘ఫేస్‌బుక్‌’గా మార్చి ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరిస్తాడు. సావరిన్‌ దీనిపై గొడవ చేస్తాడు. కోర్ట్‌కు వెళతాడు. ఇదే సమయంలో పార్కర్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులకు పట్టుబడతాడు. ఈ సమస్యలను దాటుకొని జుకర్‌బర్గ్‌ ‘ఫేస్‌బుక్‌’ను అందరికీ ఎలా చేరువ చేశాడు? అతనికి ఉన్న శత్రువులను ఎలా తొలగించుకున్నాడు? యూనివర్సిటీ, కోర్ట్‌ వివాదాలను ఎలా పరిష్కరించుకున్నాడు? అనేది మిగతా కథ.

ప్రశంసలు...పురస్కారాలు: మూడు అకాడమీ అవార్డులు సొంతం చేసుకొన్న దర్శకుడు ఫించర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘ది గేమ్‌’, ‘ఫైట్‌ క్లబ్‌’, ‘మాంక్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందారాయన. సైకలాజికల్‌ థ్రిల్లర్స్‌ తీయడంలో దిట్ట అయిన ఫించర్‌... ‘ది సోషల్‌ నెట్‌వర్క్‌’ కథనీ మనకు థ్రిల్లర్‌గా చెబుతాడు. సన్నివేశాలు వేగంగా పరిగెడుతుంటాయి. 2003-04 సంవత్సరంలో అమెరికా యువత జీవన శైలిని ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించారు. మార్క్‌ జుకర్‌బర్గ్‌గా నటించిన జెస్సీ ఐసిన్‌బర్గ్‌ అద్భుతంగా నటించాడు. ఇతని పోలికలు జుకర్‌  బర్గ్‌కు దగ్గర ఉండటం  కలిసొచ్చింది. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌. సినిమాటోగ్రఫీ మనకు అమెరికా విశ్వవిద్యాలయాల్లో వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. 83వ ఆకాడమీ వేడుకల్లో 8  విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్న ఈ సినిమా... ఉత్తమ ఆడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, ఒరిజినల్‌ స్కోర్, ఎడిటింగ్‌ విభాగాల్లో 3 ఆస్కార్లను దక్కించుకుంది. గోల్డెన్‌గ్లోబ్‌ పురస్కారాలతో పాటు పలువురు విమర్శకుల నుంచి ప్రశంసలందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసే పనిలోనూ ఉందిప్పుడు చిత్రబృందం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని