RGV: ‘ఆదిపురుష్‌’ ట్రోలింగ్‌.. అది తప్పయితే వాళ్లే అనుభవిస్తారు: రాంగోపాల్‌ వర్మ

రామాయణాన్ని ఆధారంగా చేసుకొని సిద్ధమైన ‘ఆదిపురుష్‌’ సినిమా టీజర్‌పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. టీజర్‌లో సైఫ్‌ లుక్‌ చూసి తాను షాకైనట్లు ఆయన చెప్పారు. వీడియోలో సహజత్వం అనేది కనిపించలేదని ఆయన అన్నారు.

Updated : 06 Oct 2022 16:32 IST

హైదరాబాద్‌: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush). బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ (Om Raut) దీన్ని రూపొందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్‌.. ప్రస్తుతం నెటిజన్లు, రాజకీయ నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలోని నటీనటుల లుక్స్‌పై తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్‌’ టీజర్‌, విమర్శలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (RGV).

‘‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌ వచ్చినప్పుడు కూడా వీఎఫ్‌ఎక్స్‌ అసలేం బాలేదని బాగా ట్రోల్‌ చేశారు. కానీ, సినిమా చూశాక.. ఎవరూ ఏం ట్రోల్స్‌ చేయలేదు. ట్రైలర్‌లో చూసినప్పుడు నచ్చలేదు. కానీ, బిగ్‌స్క్రీన్‌పై చూస్తుంటే బాగుందని చెప్పారు. కాబట్టి ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియోలు చూసి దేనిని నిర్ణయించకూడదు. రామాయణం అంటే ఇలా ఉంటుంది. రాముడు ఇలా కనిపిస్తాడు అని మనకు ఓ ఆలోచన ఉంది. ‘ఆదిపురుష్‌’ మన ఆలోచనకు విభిన్నంగా ఉండేసరికి పలువురు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. తెలిసిన ఓ నిర్మాత మొన్న నాకు ఫోన్‌ చేశారు. ‘రాముడికి మీసాలు ఉండటం ఏంటి?’ అని అడిగారు. రాముడికి మీసాలు పెట్టి ఎందుకు చూపించకూడదని వాళ్లు ఆలోచించి ఉండొచ్చు. నిజం చెప్పాలంటే, నాక్కూడా సైఫ్‌ అలీఖాన్‌ లుక్‌ నచ్చలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎస్వీ రంగారావుని రావణాసురుడిగా చూడ్డానికి అలవాటు పడ్డాను. రావణుడంటే పొడవాటి జుత్తు, గంభీరమైన లుక్స్‌, భారీ ఆకారం ఉన్నట్లు చూశా.. సడెన్‌గా సైఫ్‌ని చూసి.. ఇదేంటి ఇలా ఉన్నాడు? అని కాస్త బాధపడ్డా. దర్శకనిర్మాతలు కష్టపడి అన్ని కోట్లు పెట్టి సినిమా చేశారంటే వాళ్లు కొత్తగా ఏదో చూపించాలని అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ల ఆలోచన తప్పు అయితే వాళ్లే అనుభవిస్తారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏదైనా చేసే హక్కు ఉంది. వాళ్లకు ఇష్టమైన విధంగా సినిమా చేశారు. నీకు నచ్చితే చూడు లేకపోతే లేదు. అంతేకానీ, ట్రోల్స్‌ రూపంలో ఎదుటి వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదు’’

‘‘ఇప్పటి వరకూ చూసిన విధంగా కాకుండా విభిన్నమైన లుక్స్‌లో రామాయణ పాత్రల్ని చూపించనున్నాం అని చిత్రబృందం ముందు నుంచే  చెప్పి ఉంటే ఇప్పుడు ఈ స్థాయి ట్రోలింగ్‌ వచ్చేది కాదు. అలా చెప్పకపోవడం వల్లే టీజర్‌ విడుదలయ్యాక ఇన్ని విమర్శలు వస్తున్నాయి. అలాగే, రామాయణాన్ని తెరకెక్కిస్తున్నాం అని కాకుండా.. దాన్ని ఆధారంగా చేసుకొని ఓ ఫిక్షనల్‌ సినిమా చేస్తున్నామని చెప్పినా ఈ సమస్య వచ్చేది కాదు. ‘ఆదిపురుష్‌’ని చూస్తుంటే యానిమేటెడ్‌ ఫిల్మ్‌లా ఉంది. సినిమా చూస్తే ఇదే భావన ఉంటుందో లేదో తెలియదు. టీజర్‌ చూస్తుంటే.. పాత్రల్లో సహజత్వం లేదనిపించింది. అందుకే అందరూ విమర్శిస్తున్నారు’’ అని వర్మ పేర్కొన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts