RGV: బాలీవుడ్‌ స్టార్స్‌ సౌత్‌ తారలపై అసూయతో ఉన్నారు: వర్మ

దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న కారణంగా ప్రస్తుతం ఉత్తరాది స్టా్ర్స్‌ దక్షిణాది తారలంటే అసూయతో ఉన్నారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ...

Updated : 28 Apr 2022 17:11 IST

అజయ్‌ వర్సెస్‌ సుదీప్‌.. ఆర్జీవీ ఎంట్రీ

హైదరాబాద్‌: దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న కారణంగా ప్రస్తుతం ఉత్తరాది స్టార్స్ అసూయతో ఉన్నారని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. కన్నడ స్టార్‌ నటుడు సుదీప్‌, బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ల మధ్య బుధవారం జరిగిన ట్విటర్‌ వార్‌పై తాజాగా ఆర్జీవీ స్పందించారు. ‘‘దక్షిణాది లేదా ఉత్తరాది.. కాదు భారతదేశం మొత్తం ఒక్కటే అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రాంతీయత, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా భాషలనేవి వృద్ధి చెందాయి. భాష.. ప్రజలు చేరువ కావడానికి దోహదపడుతుంది. విడదీయడానికి కాదు’’ అని ఆర్జీవీ తొలుత ట్వీట్‌ చేశారు. అనంతరం.. ‘‘కేజీయఫ్‌-2’ రూ.50 కోట్లు ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ సాధించి బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుండటంతో ఉత్తరాది తారలు దక్షిణాది స్టార్స్‌పై అసూయతో ఉన్నారనేది కాదనలేని సత్యం. ఇకపై బాలీవుడ్‌ చిత్రాల ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ ఎలా ఉంటాయో మనమూ చూద్దాం. బాలీవుడ్‌లో బంగారం ఉందా? లేదా కన్నడలో బంగారం ఉందా? అనేది ‘రన్‌ వే 34’ ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ వల్ల అర్థమైపోతుంది’’ అని వర్మ పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..!

‘‘కన్నడ చిత్ర పరిశ్రమ ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయి సినిమాలు చేస్తోందని కొందరు అంటున్నారు. కానీ, అందులో నిజం లేదు. పాన్‌ ఇండియా స్థాయి అని కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని అలరించేలా మనం చిత్రాలు తెరకెక్కిస్తున్నాం. ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు. హిందీ వారే ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలు రూపొందిస్తున్నారు. తమ సినిమాలను తమిళం, తెలుగు, కన్నడ.. ఇలా దక్షిణాది భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అయినా, విజయం అందుకోలేకపోతున్నారు’’ అని ఓ ఆడియో ఫంక్షన్‌లో సుదీప్‌ చేసిన వ్యాఖ్యలపై అజయ్‌ దేవ్‌గణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా ‘‘సోదరా.. మీ ఉద్దేశం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు మీరెందుకు మీ చిత్రాలను హిందీలో డబ్‌ చేస్తున్నారు? జాతీయ భాషగా హిందీ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ అదే ఉంటుంది. జనగణ మన’’ అని అజయ్‌ పేర్కొన్నారు. అజయ్‌ ట్వీట్‌పై స్పందించిన సుదీప్‌.. ‘‘అజయ్‌ సర్‌.. మీకు మరో రకంగా అర్థమైందనుకుంటా. నేను ఎవరినీ కించపరిచేందుకు అలా చేయలేదు. మన దేశ భాషలన్నింటిపైనా నాకు గౌరవం ఉంది. మేం హిందీని గౌరవించాం, నేర్చుకున్నాం. అందుకే మీరు హిందీలో చేసిన ట్వీట్‌ను నేను చదవగలిగా. అదే నా సమాధానాల్ని కన్నడలో రాస్తే పరిస్థితి ఏంటి సర్‌? చదవగలరా. కాబట్టి ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడటం వల్లే ఇలా జరుగుతుంటుంది’’ అని రిప్లై ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని