Roja: సీఎంతో చిరంజీవి భేటీ శుభపరిణామం.. తప్పకుండా న్యాయం జరుగుతుంది: రోజా

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో నటుడు చిరంజీవి భేటీ అవటం శుభపరిణామం అని నటి, నగరి ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు.

Published : 14 Jan 2022 12:26 IST

కడప: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో నటుడు చిరంజీవి భేటీ అవటం శుభపరిణామం అని సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమ వారు చెప్పింది న్యాయమనిపిస్తే తప్పకుండా మంచి జరుగుతుందన్నారు. బంధువులతో కలిసి సంక్రాంతి పండగ జరుపుకునేందుకు కడపలోని శెట్టిపాలెం విచ్చేసిన ఆమె సినిమా టికెట్‌ ధరల విషయంపై మాట్లాడారు.

‘‘జగన్‌మోహన్‌రెడ్డి ఏది చేసినా ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తుంటాయి. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆయన పాఠశాల, కళాశాలల ఫీజులు తగ్గిస్తే యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్య అన్నారు. కొవిడ్‌ పేరుతో విపరీతంగా దోచుకుంటున్నారని ఆస్పత్రి వర్గాల్ని కంట్రోల్‌ చేసినప్పుడూ విమర్శించారు. ఇప్పుడు.. సినిమా టికెట్‌ ధరల విషయంలోనూ అలానే అంటున్నారు. ప్రజలంతా సౌకర్యవంతంగా జీవించేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై సీఎం, చిరంజీవి భేటీ అవటం శుభపరిణామం. అలా ఎవరైనా సీఎంను కలిసి సాధకబాధకాలు వివరించాలి. అంతే కానీ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడకూడదు. ఆయనకున్న బిజీ షెడ్యూలో చలన చిత్ర పరిశ్రమ గురించి సీఎం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజాసమస్యలు తీర్చేందుకు ముందుకెళ్తున్నాడే తప్ప ఎవరి మీదా కక్ష సాధించేందుకు కాదు. చిత్ర పరిశ్రమ వాళ్లు చెప్పింది సీఎంకు న్యాయమనిపిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది’’ అని రోజా అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని